రాష్ట్ర రథసారథి.. రాంచందర్ రావు
పుట్టుక నుంచీ సిద్ధాంతానికి నిబద్ధుడైన నిఖార్సైన జాతీయవాది పగ్గాలు అందుకున్నారు..
విద్యార్థి దశ నుంచే దేశానికి అంకితమైన కాషాయ సైనికుడు సారథ్యానికి సిద్ధమయ్యారు..
విద్యార్థి ఉద్యమాల నుంచి సామాజిక సమస్యల వరకు అనేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్న పోరాట యోధుడు కొత్త బాధ్యతను భుజానెత్తుకున్నారు..
గత 40 సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమైన బిజెపి సీనియర్ నాయకుడు, శాసమండలి బిజెపి మాజీ పక్షనేత నారపరాజు రాంచందర్ రావు బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు..
విద్యార్థి సమస్యలపై పోరాడుతూ పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ కాళ్లు విరగ్గొట్టుకున్న వైనం ఆయన గతం.. కరుడుగట్టిన రాడికల్స్ మూకలను ఎదురొడ్డుతూ ఉస్మానియా గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించిన చరిత్ర ఆయన సొంతం.. విద్యార్థి ఉద్యమాల నుంచి సామాజిక సమస్యల వరకు.. అయోధ్య కరసేవ నుండి తెలంగాణ ఉద్యమం వరకు.. ఉద్యమం ఆయన ఊపిరి.. పోరాటం ఆయన పథం.. ఏ స్థానంలో ఉన్నా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉన్నారు.. న్యాయవాదిగా జాతీయవాదులకు న్యాయ సహాయం చేశారు.. క్రమశిక్షణ గల కార్యకర్తగా.. అప్పజెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ.. అందరి మన్ననలు అందుకున్న రాంచందర్ రావుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తూ బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది..
సంస్థాగత పర్వంలో భాగంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఎన్. రాంచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకోసం జూన్ 30న హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. రాంచందర్ రావు ఒక్కడే నామినేషన్ వేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. మరునాడు జూలై 1న బిజెపి తెలంగాణ నూతన అధ్యక్షుడిగా రాంచందర్ రావును లాంచనంగా ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే నియామకపత్రం అందజేశారు. కేంద్రమంత్రి, ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జి. కిషన్ రెడ్డి బిజెపి జెండా అందిస్తూ పగ్గాలు అప్పగించారు. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాంచందర్ రావు మూడేళ్ల వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బిజెపిని అమేయ రాజకీయ శక్తిగా నిలబెట్టే కార్యాచరణకు ఆయన సిద్ధమయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో బిజెపి జెండాను ఎగరవేసే దిశగా కార్యకర్తలను కదం తొక్కించనున్నారు.
సంస్థాగత పర్వంలో భాగంగా 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో సభ్యత్వ సేకరణ మొదలైంది. ప్రజలు స్వచ్ఛందంగా ఆన్లైన్ లోను, ఆఫ్ లైన్ లోను సభ్యత్వం స్వీకరించారు. సంవత్సరం పాటు అన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్‌ల వారీగా బిజెపి సభ్యత్వ సేకరణ కొనసాగగా, రాష్ట్రం నుంచి 34 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అదేవిధంగా 34 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. గతంలో తెలంగాణలో 11 లక్షల మంది ప్రాథమిక సభ్యులు ఉంటే, ఈసారి 34 లక్షలకు పెరగడం రాష్ట్రంలో బిజెపికి పెరుగుతున్న ఆదరణకు అద్దం పడుతుంది. కార్యకర్తలు అంకితభావంతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైంది.
రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకుపైగా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటయ్యాయి. పోలింగ్ బూత్ కమిటీలను కొత్త టెక్నాలజీతో ఆన్లైన్లో ఏర్పాటు చేయడం విశేషం. మొత్తం 5610 శక్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 937 మండలాల్లో 911 మండలాలకు అధ్యక్షుల ఎన్నికలు పూర్తయ్యాయి. 36 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కూడా ముగిసింది. బిజెపి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ మాత్రమే కాదు.. సభ్యత్వం సేకరణ నుంచి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకు ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతుంది. అందుకే బిజెపి విలక్షణమైన పార్టీగా వినుతికెక్కింది.
అధ్యక్షుడినైనా కార్యకర్తగానే పనిచేస్తాను
14 కోట్ల సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బిజెపిలో తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని గర్వంగా ఉందని బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడినైనప్పటికీ అయినప్పటికీ, నా మనసులో పార్టీ కార్యకర్తగానే పనిచేస్తానన్నారు. బిజెపిలో కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పారు. బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మనందరి లక్ష్యమని, గోల్కొండ ఖిల్లాపై బిజెపి జెండా ఎగురవేయాలంటే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు.
జూలై 1న హైదరాబాద్ నగర శివారుల్లోని అధ్యక్ష ఎన్నికల వేడుకలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారైన అనంతరం రాంచందర్ రావు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘‘జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు అనేక దశల్లో కార్యకర్తల త్యాగాలు, నిరంతర శ్రమ ఫలితంగా బిజెపి దేశంలో అతిపెద్ద, బలమైన పార్టీగా ఎదిగింది. క్రమశిక్షణ, సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చాం. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలులో బిజెపి ఏర్పడే ముందు, జనసంఘ్ తరఫున ఓ అభ్యర్థి పోటీ చేశారు. ఆయనకు దాదాపు వెయ్యి ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీ గెలిచింది. అయినప్పటికీ, జనసంఘ్ అభ్యర్థి తరఫున కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. అప్పట్లో జనసంఘ్ నాయకులని ఆ సంబరాలపై ప్రశ్నించగా “గత ఎన్నికల్లో 300 ఓట్లు వచ్చాయి, ఈసారి 1000 వచ్చాయి. పార్టీ ఎదుగుతోంది. బలోపేతమవుతోంది. అందుకే ఈ ఆనందం” అని సమాధానమిచ్చారు. అలాంటి స్థితి నుంచి ఈరోజు బిజెపి తెలంగాణలో 8 మంది లోక్‌సభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్న స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణం.
అప్పట్లో బిజెపి అంటే చాలామందికి తెలియని పరిస్థితి. నేను యువమోర్చా కార్యకర్తగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో సభ్యత్వ నమోదు కోసం సైకిల్‌పై డబుల్స్ జర్నీ చేసి పార్టీ కోసం పనిచేశాను. విద్యార్థి పరిషత్‌లో ఉన్నప్పుడు వెళ్లి సభ్యత్వ సేకరణ కోసం హైదరాబాద్ నుంచి కరీంనగర్, మెట్‌పల్లికి బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. ఈరోజు బిజెపి ఈ స్థాయికి వచ్చిందంటే, దానికి కార్యకర్తల త్యాగాలు, నాయకుల కృషి, శ్రమ కారణం. డీఎస్పీ రెడ్డి, చలపతి రావు, వి. రామారావు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, డాక్టర్ కె. లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. బిజెపి పార్టీ ఎదుగుదలలో ఇంతమంది రాష్ట్ర అధ్యక్షుల, నాయకుల కృషి, శ్రమ ఉంది.
గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తోంది. ఆయనతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ ఆశీర్వాదం కూడా మనకు లభిస్తోంది. జాతీయ నాయకులతో పాటు, రాష్ట్రస్థాయిలో కిషన్ రెడ్డి, డా. కె. లక్ష్మణ్, బండి సంజయ్ వంటి నేతల సహకారంతో నాకు ఈ బాధ్యత లభించింది. గతంలో నల్లగొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనే కార్యకర్తను నక్సలైట్లు హత్య చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి, చంద్రారెడ్డి నక్సలైట్ల బుల్లెట్లకు బలయ్యారు. నేటి బిజెపి నాయకులు మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ధర్మారావు, నేనూ అందరం కలిసి నక్సలైట్లతో పోరాడి ఏబీవీపీని గెలిపించుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీని గొప్ప స్థాయిలో నిలబెట్టాం.
బిజెపి అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ, మాస్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. బిజెపిలో కొత్త, పాత అనే తేడా ఉండదు. మన ఇంట్లో బాబు పుట్టినా, పాప పుట్టినా పుట్టినరోజు నుంచే వారు కుటుంబసభ్యులవుతారు. అదే బిజెపిలోనూ వర్తిస్తుంది. నది ప్రవహించాలి. కొత్తనీరు రావాలి. కొత్తవాళ్లు, పాతవాళ్లు కలిసి బిజెపిని బలోపేతం చేయాలి. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాలి. యువతలో ఉన్న చైతన్యాన్ని బిజెపిలోకి తేవాలి. యువకులు, మహిళలు బిజెపిలో చేరాలి. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకూ బిజెపి గెలవాలి.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం. నేను విద్యార్థి దశ నుంచే అనేక పోరాటాలు చేశాను. అడ్వకేట్ల కోసం, విద్యార్థుల కోసం పోరాడాను. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను. “నేను సైతం” అనే భావనతో కలెక్టివ్ లీడర్‌షిప్‌లో నన్ను ఆదరించాలి. నా నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉండవు. అందరి నిర్ణయాలు తీసుకుని నేను అమలు చేయబోతున్నాను. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంది. మనమంతా క్రమశిక్షణతో బిజెపిని ముందుకు తీసుకెళ్లాలి. బిజెపి సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలి. జాతీయ, రాష్ట్ర నేతల మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను.’’ అని అన్నారు.
ఐక్యమత్యంతో పనిచేద్దాం
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా, పార్టీ కార్యకర్తలే బిజెపికి వెన్నెముక. రాంచందర్ రావు బిజెపి కార్యకర్త. విద్యార్థి పరిషత్‌లో పనిచేశారు. వామపక్ష భావజాలం ఉన్నవారు బెదిరించినా తట్టుకుని నిలబడ్డారు. పదవిలో ఉన్నా, లేకున్నా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన నేత రాంచందర్ రావు. గత రెండేళ్లుగా నేను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, జాతీయ, రాష్ట్ర నేతలు, జిల్లా అధ్యక్షులు అందరూ ఐకమత్యంతో పనిచేశారు. రానున్న రోజుల్లోనూ రాంచందర్ రావు నాయకత్వంలో అదే ఐక్యతతో పనిచేయాలి. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌కు వచ్చిన ప్రతి 100 మందిలో 37 మంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆమోదించి బిజెపికి ఓటు వేశారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో 3 స్థానాల్లో 2 స్థానాలను బిజెపి గెలుచుకుంది.
నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కొంతమంది బిజెపి తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం గత 11 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం సుమారు 12 లక్షల కోట్లు ఖర్చు చేసింది. వెల్నెస్ సెంటర్ల కింద బస్తీ దవాఖానాలకు కేంద్రమే నిధులు ఇచ్చింది. రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరించాం. అన్ని రైలు మార్గాలకు విద్యుదీకరణ పూర్తి చేశాం. రూ.80 వేల కోట్లతో రైల్వే నెట్వర్క్ పనులు, రూ.1.5 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ సీఎంలకు సవాల్ విసురుతున్నాం. గత 11 ఏళ్లలో మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది సెక్రటేరియట్ అయినా, ప్రెస్ క్లబ్ అయినా, ట్యాంక్‌బండ్ అయినా, వరంగల్ లేదా కరీంనగర్ అయినా – ఎక్కడైనా రండి, చర్చిద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణను దోచుకుంటోంది. కాంగ్రెస్ ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఏదీ అమలు చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వెనక్కు నెట్టారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు అయినా, తెలంగాణ అమరవీరుల, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు.
నాలుగుసార్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. గత రెండేళ్లలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు కొందరు కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లోపాలుంటే పెద్దమనసుతో క్షమించాలి. కలిసిమెలిసి పనిచేయాలి. పార్టీని ఐక్యమత్యంగా ముందుకు తీసుకెళ్లాలి. దేశంలో బిజెపి గెలిచినందువల్లే అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, రైతులకు ఎంఎస్పీ పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం, చంద్రయాన్ విజయాలు సాధ్యం అయ్యాయి. అధికారం అనేది దేశం కోసం కావాలి. తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో బిజెపి జెండా ఎగురవేయాలి.’’ అని అన్నారు.
రాంచందర్ రావు ఓ మిస్సైల్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ.. ‘‘ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా, బిజెపిలో కిందిస్థాయి నుండి అనేక బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు రాంచందర్ రావు. సోషల్ మీడియాలో కావాలనే ఆయనపై ట్రోల్ చేస్తున్నారు. గతంలో మోదీ సహా మా అందరిపైనా ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు. రాంచందర్ రావు కాళ్లు వంకరకు కారణమేందని అడిగితే ఇచ్చిన సమాధానంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏబీవీపీలో ఉండగా రాడికల్స్ ఆయనపై దాడులు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో మాపై అనేకమంది బీఆర్ఎస్ గూండాలు దాడులు చేశారు. మమ్ముల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నది కార్యకర్తలే. కార్యకర్తలపైన, మాపైన కేసులు పెట్టి జైళ్లకు పంపితే కోర్టులో వాదించి బయటకు తీసుకొచ్చింది రాంచందర్ రావు.
దేశానికి బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బిజెపికే ఉంది… ఆ దమ్ము కాంగ్రెస్‌కు ఉందా? దళిత, ఆదివాసీ బిడ్డలను రాష్ట్రపతులుగా చేసిన ఘనత ఒక్క బిజెపికే దక్కుతుంది. నేను, లక్ష్మణ్, దత్తాత్రేయ, చలపతిరావు బీసీలమే… మమ్మల్ని అధ్యక్షులుగా చేసింది బిజెపియే. దళితుడిని సీఎం చేయకుంటే తల నరక్కుంటానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్… మాట మార్చి దళితులను మోసం చేయలేదా? బీఆర్ఎస్కు సవాల్ చేస్తున్నా…. మీరు అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా?
బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ-రేసు, గొర్రెల స్కాం సహా అన్ని అక్రమాలే చేసింది. అయినా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి జైల్లో వేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదు. బిజెపి అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని కటకటాల్లోకి నెట్టేవాళ్లం. జడ్జీల ఫోన్లను కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తే సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? సీబీఐ విచారణ జరిపితే బీఆర్ఎస్, కాంగ్రెస్ బండారం బయటపడుతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు మాకు సమాన ప్రత్యర్థులే.
మన లక్ష్యం… మోదీ రాజ్యం, రామరాజ్యం రావాల్సిందే… గొల్లకొండపై కాషాయ జెండా ఎగరేయాల్సిందే.. అందరికీ ఇచ్చాం అవకాశం…బిజెపికి ఇద్దాం అవకాశం…అని సామాన్య ప్రజలంతా భావిస్తున్నారు. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో వంద సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం తథ్యం. మనందరిదీ ఒకటే గ్రూప్.. మన టీం కెప్టెన్ నరేంద్ర మోదీ.. మనమంతా ఆ టీం సభ్యులమే.. రాంచందర్ రావు నాయకత్వంలో ప్రతి బిజెపి కార్యకర్త పనిచేయాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేద్దాం.’’ అని అన్నారు.
కార్యకర్తకు దక్కిన గౌరవం
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ.. ‘‘రాంచందర్ రావు ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొంది, విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో నాయకత్వం వహిస్తూ, బిజెపిలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ నిజమైన కార్యకర్త. ఇది ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావించాలి. బిజెపిలో నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం నిరంతరం కష్టపడిన నాయకులకే పెద్ద పదవులు లభిస్తాయి. ఇతర పార్టీల్లో నాయకులు పదవులను అనుభవించేందుకు వస్తారు; కానీ బిజెపిలో మాత్రం బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. నేను రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 200 ఓట్ల తేడాతో ఓడినప్పుడు, ఎంతోమంది ఎన్నికల పిటిషన్ వేయమన్నారు. అప్పుడు నేను ఆ బాధ్యతను రాంచందర్ రావుకే అప్పగించాను. చాలామంది అడ్వకేట్లు ఆశ్చర్యపడ్డారు.. రాంచందర్ రావు క్రిమినల్ లాయర్, మరి సివిల్ పిటిషన్ ఎలా వాదిస్తారని? రాజ్యసభలో కొంతమంది సీనియర్ లాయర్లు ఉదయం కోర్టుల్లో లక్షల్లో సంపాదించి, ఆ తర్వాత రాజ్యసభకు వచ్చి సంతకాలు పెట్టే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్లకు తమ వృత్తి పట్ల, సంపాదన పట్ల మాత్రమే శ్రద్ధ కనపడుతోంది, రాజ్యసభ సభ్యులుగా బాధ్యత పట్ల కాదు. కానీ రాంచందర్ రావు దేశం కోసం, సిద్ధాంతం కోసం, క్రమశిక్షణతో పార్టీలో కొనసాగుతున్నారు.
బిజెపి 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది. దేశవ్యాప్తంగా 10 లక్షలపైగా పోలింగ్ బూత్‌లలో 7 లక్షల కమిటీలు, 18 వేల మండల కమిటీల్లో 15 వేలపైగా పూర్తయ్యాయి. 1093 జిల్లా కమిటీల్లో 900 పూర్తయ్యాయి. 37 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా పార్టీల్లో మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా ఎన్నికలు జరగడం లేదు. సభ్యత్వాలు జరిపే ప్రక్రియ లేదు. బిజెపిలో మాత్రం సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న 14 కోట్ల మంది ఎలాంటి తాయిలాలు లేకుండానే సభ్యులయ్యారు. ఇతర పార్టీల్లో ఆరోగ్య బీమా, జీవిత బీమా పేరుతో సభ్యత్వాలు ఇస్తారు. బిజెపిలో మాత్రం దేశం కోసం పని చేయాలనే భావనతో కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. బిజెపి అనేది సమిష్టి నాయకత్వంతో నడిచే పార్టీ. టీం డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్.. బూత్ అధ్యక్షుడు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా భావించి కృషి చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్‌కు బిజెపియే ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. గత 11 ఏళ్లుగా మోదీ అవినీతిరహిత పాలన అందిస్తున్నారు. అలాంటి పాలనే తెలంగాణలో కూడా కావాలి.’’ అని అన్నారు.


