NRR

రథసారథి 100 రోజుల ప్రయాణం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించి అక్టోబర్ 13న 100 రోజులు పూర్తిచేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుండే దూకుడుతో, నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు, ర్యాలీలు, సదస్సులు, ప్రజా సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి ZPTC వరకు BJP అభ్యర్థులు బలంగా పోటీ చేసేలా పార్టీని సిద్ధం చేస్తున్నారు. 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ, తెలంగాణకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వివరించారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా పేదలు, మధ్యతరగతి, రైతులు, విద్యార్థులు, MSMEలు లాంటి వర్గాలకు లబ్ధి చేకూర్చేలా తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ళు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, మహిళా పొదుపు సంఘాలకు బ్యాంక్ రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు కేంద్ర సహకారంతోనే జరుగుతున్నాయని తెలిపారు. ‘పల్లె నిద్ర’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతూ, గ్రామాల నాడి తెలుసుకుంటూ, ప్రతి నియోజకవర్గంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడ్డారు. రైతులకు ఎరువులను సక్రమంగా సరఫరా చేయకుండా, బ్లాక్ మార్కెట్‌కి తరలించేందుకు కారణమవుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సకాలంలో రైతులకు ఎరువులు అందేలా చర్యలు తీసుకున్నారు.

కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు రాంచందర్ రావు ప్రయాణం పార్టీలో కార్యకర్తల సేవలకు గుర్తింపు లభిస్తుందనడానికి తార్కాణం. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికై గళమెత్తుతూ సాగుతుంది రాంచందర్ రావు ప్రయాణం. రాంచందర్ రావు గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన నడిచొచ్చే కమలం జెండా.

సేవ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం..

‘‘పార్టీకి కార్యకర్తలే పునాది. భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి పార్టీని అధికారపీఠం వైపు తీసుకుపోయేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషి నాకు తెలుసు. కార్యకర్తల కఠోరశ్రమలో నేను భాగమే. ఒక కార్యకర్తగా పార్టీలో ప్రయాణం ప్రారంభించి, అందరి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందున్నాను. నేను అధ్యక్షుడు అయ్యి వంద రోజులైంది. ఈ వంద రోజుల్లో అత్యధిక భాగం కార్యకర్తలతో మమేకం అయ్యేందుకే కృషి చేశాను. 

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత కార్యకర్తలను కలిసేందుకు అనేక జిల్లాల్లో పర్యటనలు జరిపాను. ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చాను. పార్టీకి గుండెకాయలాంటి కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. వంద రోజుల్లో అనేక పోరాటాల్లో పార్టీని భాగం చేస్తూ స్వయంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పార్టీ అంటే నా ప్రాణం, కార్యకర్తలే పార్టీకి ప్రాణం. అలాంటి కార్యకర్తల కోసం మనసా వాచా కర్మణా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈ 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రతి జిల్లాలో ప్రజలతో మమేకమై, కార్యకర్తల ఉత్సాహాన్ని, ప్రజల ఆశలను బిజెపి దిశగా మలిచే ప్రయత్నం చేశాను. “సేవే సంస్థ” అనే మంత్రంతో రైతుల సమస్యల నుంచి బీసీ రిజర్వేషన్ల దాకా, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పనిచేశాను. 

రానున్న రోజుల్లో మరింత బలంగా బిజెపిని ప్రతి పల్లె, ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లడం నా ప్రధాన సంకల్పం. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి లక్ష్యం. ప్రతి దశలో మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ.. ధన్యవాదాలు.’’

– ఎన్. రాంచందర్ రావు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.