సచేత్ యాప్.. ప్రకృతి విపత్తులో కాపాడే నేస్తం
27 ఏప్రిల్ 2025న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. కాశ్మీర్లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు, కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది.
ఇప్పుడు భారతదేశం అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి కూడా అవకాశాలు కల్పిస్తోంది. నేడు చాలా మంది యువకులు స్పేస్ స్టార్టప్‌లో కొత్త జెండాలను రెపరెపలాడిస్తున్నారు. 10 సంవత్సరాల కిందట ఈ రంగంలో ఒకే ఒక కంపెనీ ఉండేది. కానీ నేడు దేశంలో 375 కంటే ఎక్కువ స్పేస్ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. రాబోయే కాలం అంతరిక్ష రంగం అనేక కొత్త అవకాశాలను తెస్తోంది. భారత్ కొత్త శిఖరాలను తాకుతుంది. గగన్‌యాన్, SpaDeX , చంద్రయాన్-4 వంటి అనేక ముఖ్యమైన మిషన్ల కోసం దేశం సిద్ధమవుతోంది.
పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలను చికిత్స కోసం భారతదేశానికి పంపడానికి ఇథియోపియాలో నివసిస్తున్న భారతీయులు చొరవ తీసుకున్నారు. అలాంటి చాలా మంది పిల్లలకు భారతీయ కుటుంబాలు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. ఇథియోపియాలో తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ప్రతి పేద బిడ్డకు మెరుగైన చికిత్స అందేలా చూడడమే ఈ ప్రయత్నం. భారతీయ ప్రవాసుల ఈ ఉదాత్తమైన పని ఇథియోపియాలో చాలా ప్రశంసలు అందుకుంటుంది.
కొద్ది రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారతదేశం పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ను పంపింది. రేబిస్, టెటనస్, హెపటైటిస్ బి, ఇన్ఫ్లుయెంజా వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించడానికి ఈ టీకా ఉపయోగపడుతుంది. నేపాల్ అభ్యర్థన మేరకు భారతదేశం నేపాల్‌కు పెద్ద మొత్తంలో మందులు, వ్యాక్సిన్లను పంపింది. ఇది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్సను అందిస్తుంది.
ఏదైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడంలో మీ అప్రమత్తత, మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు మీ మొబైల్లోని ప్రత్యేక యాప్ నుండి ఈ అప్రమత్తతలో సహాయం పొందవచ్చు. ఈ యాప్ ఏదైనా ప్రకృతి విపత్తులో చిక్కుకోకుండా మిమ్మల్ని కాపాడుతుంది. దీని పేరు సచేత్. ‘సచేత్ యాప్’ని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ- నేషనల్ డైజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారు చేసింది. వరదలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడటం, సునామీ, అడవిలో మంటలు, హిమపాతం, తుఫాను లేదా మెరుపు వంటి విపత్తు ఏదైనా కావచ్చు. సచేత్ యాప్ మీకు సమాచారం అందించడానికి, అన్ని విధాలుగా రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు వాతావరణ శాఖకు సంబంధించిన అప్డేట్లను పొందవచ్చు. విశేషమేమిటంటే ‘సచేత్ యాప్’ ప్రాంతీయ భాషల్లో కూడా చాలా సమాచారాన్ని అందిస్తుంది.
కొంతకాలం క్రితం వరకు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ హింస, అశాంతికి మాత్రమే ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు, అక్కడ ఉన్న దంతెవాడ సైన్స్ సెంటర్ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కొత్త ఆశాకిరణంగా మారింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడం పిల్లలకు చాలా ఆనందంగా ఉంది. వారు ఇప్పుడు సాంకేతికతను ఉపయోగించి కొత్త యంత్రాలను, కొత్త ఉత్పత్తులను తయారు చేయడం నేర్చుకుంటున్నారు. త్రీడీ ప్రింటర్లు, రోబోటిక్ కార్లతోపాటు ఇతర వినూత్న విషయాలను తెలుసుకునే అవకాశం వారికి లభించింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా 70 లక్షలకు పైగా చెట్లను నాటారు. ఈ చెట్లు అహ్మదాబాద్‌లో పచ్చదనాన్ని బాగా పెంచాయి. దీనితో పాటు సబర్మతి నదిపై రివర్ ఫ్రంట్ నిర్మాణం, కాంకరియా వంటి కొన్ని సరస్సుల పునర్నిర్మాణం కారణంగా ఇక్కడ నీటి వనరుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలలో గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ ఒకటిగా మారిందని ఇప్పుడు వార్తా నివేదికలు చెప్తున్నాయి. అక్కడి ప్రజలు కూడా ఈ మార్పును, వాతావరణంలో చల్లదనాన్ని అనుభవిస్తున్నారు.
సాధారణంగా పర్వతాలపై మాత్రమే యాపిల్ పండిస్తారని మనకు తెలుసు. అయితే కర్నాటకలోని బాగల్కోట్లో నివసించే శ్రీశైల తెలీ మైదాన ప్రాంతంలో యాపిళ్లను పండించారు. వారు నివసించే కులాలి గ్రామంలో యాపిల్ చెట్లు 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. శ్రీశైల తెలీకి వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే యాపిల్ సాగులో కూడా ప్రయత్నించి విజయం సాధించారు. వారు నాటిన యాపిల్ చెట్లకు నేడు పెద్ద సంఖ్యలో యాపిల్స్ పండడంతో పాటు వాటిని విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
యాపిల్‌కు ప్రసిద్ధి చెందిన కిన్నౌర్‌లో కుంకుమపువ్వు ఉత్పత్తి ప్రారంభమైంది. సాధారణంగా హిమాచల్‌లో కుంకుమపువ్వు సాగు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కిన్నౌర్‌లోని అందమైన సాంగ్లా లోయలో కూడా కుంకుమపువ్వు సాగు ప్రారంభమైంది. అలాంటి మరో ఉదాహరణ కేరళలోని వాయనాడ్. ఇక్కడ కూడా కుంకుమపువ్వు పండించడంలో విజయం సాధించారు. వాయనాడ్‌లో ఈ కుంకుమపువ్వును ఏ పొలంలోనో మట్టిలోనో మామూలుగా పండించడం కాదు- ఏరోపోనిక్స్ టెక్నిక్ ఉపయోగించి పండిస్తున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ లేదా జార్ఖండ్‌లో లిచ్చి పెరుగుతుందని మనం వింటున్నాం. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనూ రాజస్థాన్‌లోనూ లిచ్చీ ఉత్పత్తి జరుగుతోంది. తమిళనాడుకు చెందిన తిరు వీర అరసు కొడైకెనాల్లో లిచ్చీ చెట్లను నాటారు. ఏడేళ్ల కృషి తరువాత ఆ చెట్లు ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. లిచ్చీ సాగులో ఆయన సాధించిన విజయం చుట్టుపక్కల ఉన్న ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిచ్చింది. రాజస్థాన్‌లో లిచ్చీని పెంచడంలో జితేంద్ర సింగ్ రనావత్ విజయం సాధించారు. ఈ ఉదాహరణలన్నీ చాలా స్ఫూర్తిదాయకమైనవి.
1917 ఏప్రిల్, మే నెలల్లో దేశంలో స్వాతంత్ర్యం కోసం ఒక ప్రత్యేకమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పేదలు, అణగారిన వర్గాల వారు, రైతులపై దోపిడీ అమానవీయ స్థాయిలను అధిగమించింది. బీహార్ లోని సారవంతమైన భూముల్లో నీలిమందు సాగు చేయవలసిందిగా రైతులను బ్రిటిష్ వారు బలవంతం చేశారు. నీలిమందు సాగు వల్ల రైతుల పొలాలు బీడుగా మారాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితిలో గాంధీజీ 1917లో బీహార్‌లోని చంపారన్‌కు చేరుకున్నారు. “మా భూములు బీడుగా మారిపోతున్నాయి. మాకు తినడానికి తిండి లేదు” అని రైతులు గాంధీజీతో చెప్పారు. లక్షలాది రైతుల బాధలు గాంధీజీ మనసులో ఒక తీర్మానానికి దారితీశాయి. అక్కడి నుంచి చంపారన్ చరిత్రాత్మక సత్యాగ్రహం ప్రారంభమైంది. భారతదేశంలో బాపూ చేసిన మొదటి అతిపెద్ద ప్రయోగం ‘చంపారన్ సత్యాగ్రహం’. బాపూ సత్యాగ్రహంతో బ్రిటీష్ యంత్రాంగం మొత్తం కదిలింది. రైతులను నీలిమందు పండించవలసిందిగా బలవంతం చేసే చట్టాన్ని బ్రిటిష్ వారు నిలిపివేయవలసి వచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో కొత్త విశ్వాసాన్ని నింపిన విజయం ఇది.

