valmiki jayanthi

వాల్మీకి సమాజం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం

valmiki jayanthiవాల్మీకి సమాజం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకుంటోందని, కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. అక్టోబర్ 7న బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన స్ఫూర్తిదాయక జీవితాన్ని స్మరించుకున్నారు. మానవ సమాజానికి సత్యం, ధర్మం, న్యాయం, నైతికత మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘మహర్షి వాల్మీకి వారసత్వానికి సంబంధించిన వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వాల్మీకి సమాజం అత్యంత వెనుకబడిన తరగతులలో భాగంగా ఉంది. ఇటీవల గద్వాల ప్రాంతంలో బోయ వాల్మీకి సోదరులు నన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. వారికి ఎమ్మార్వో ఆఫీసుల్లో కనీసం కుల ధృవపత్రాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాల్మీకి బోయల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలు తీవ్రమైన సమస్యల్లో నడుస్తున్నాయి. దాదాపు 6.70 లక్షల విద్యార్థులు గురుకులాల విద్యాలయాల్లో చదువుతున్నారు, కానీ వారికి తినడానికి సరైన భోజనం లేదు, సురక్షితమైన భవనాలు లేవు. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకులాలు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలకు తాళాలు వేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు నాసిరకం భోజనం, పాక్షిక ఆహారం లేదా ఆహార లోపంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన గురుకుల భవనాలకు మరమ్మతులు చేపట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకులాల్లో అన్ని వసతులు కల్పించేందుకు తగిన నిధులు విడుదల చేయాలి. అన్ని వసతి గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలి.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.