jubilee hills

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్ష

భారత ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నవంబర్ 11న జరుపుతున్నట్లు ప్రకటించడంతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్, బిజెపిలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఈ ఎన్నికలు ఈ మూడు పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకదాని వెంట ఒకటి జరుగనుండటంతో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలిచి తీరాలన్న గట్టి పట్టుదలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో పావులు కదుపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగబోతున్నట్టు అధికార కాంగ్రెస్ ముందుగా సంకేతాలు ఇవ్వడంతోప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించింది. దాంతో కాంగ్రెస్ వ్యూహాన్ని మార్చుకొని ఉప ఎన్నిక కంటే ముందే స్థానిక ఎన్నికలకు శంఖం పూరించింది. అయినా, ఇదే సమయంలో ఉప ఎన్నికను కూడా ప్రకటించడంతో ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా పోయింది.

బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒక విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారనుంది. ఆయన వ్యవహారంపై పార్టీ అధిష్టానంతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతూ ఉండడంతో ఈ ఉపఎన్నికలో పార్టీని గట్టెకించలేని పక్షంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే, ఇంచార్జీలుగా ఏకంగా ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలను నియమించారు. అభ్యర్థి ఎంపిక మొదలు గెలిపించే వరకు ఈ ముగ్గురు మంత్రులదే బాధ్యత అని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులలో స్థానికం, బయటివారు అనే అంతర్గత కుమ్ములాటలు తీవ్రతరం అవుతూ ఉండడంతో ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులను అవకాశంగా మార్చుకొని ఈ సీటును గెలుపొందడం ద్వారా తెలంగాణలో జైత్రయాత్రకు నాంది పలకాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రతి డివిజన్ లో కార్యక్రమాలు జరుపుతూ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం వల్ల సానుభూతితో గెలుస్తారన్న బీఆర్‌ఎస్ అంచనా నెరవేరదని, కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమియే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్, బిజెపి భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే విజయం సాధించినట్టే అని ముందడుగు వేస్తున్నాయి. మరోవైపు ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో మైనార్టీ ఓటర్లు ఉండటంతో ముందుగానే ఎంఐఎంతో కాంగ్రెస్ అవగాహనకు వచ్చింది. ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దించకుండా ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగానే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అమేర్‌ ఖాన్‌ను తప్పించి అజారుద్దీన్‌ను ఎంపిక చేసినట్టు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపించాయి.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఓట్ల చీలిక, ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజి, ఇటీవల తగ్గించిన జీఎస్టీ, ఆపరేషన్ సిందూర్‌తో బిజెపి ప్రభుత్వానికి వచ్చిన పేరుతో జూబ్లీహిల్స్ వంటి కాస్మోపాలిటిన్ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు బిజెపి అంచనా వేస్తున్నది. అందుకే బిజెపి కూడా ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే పార్టీ నాయకులతో ఈ ఎన్నికలపై విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్న రాంచందర్ రావు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించారు. ఆ మేరకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. మరోవంక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో సైతం ఘనవిజయాలు నమోదు చేయడం ద్వారా బిజెపి ప్రాబల్యం నగరాలకే పరిమితం కాలేదని, గ్రామాలలోనూ మంచి పట్టు ఉందనే నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ జిల్లా పరిషత్‌లను బిజెపి కైవసం చేసుకోబోతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను సైతం దారి మళ్లించి పంచాయతీలను ఆర్థికంగా దెబ్బతీసిన పాపం బీఆర్‌ఎస్ దేనని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. తాజా మాజీ సర్పంచ్‌లు, మహిళలు, వృద్ధులు, రైతులు, యువతే బిజెపి బ్రాండ్‌ అంబాసిడర్లు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. ఆయా వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ అమలు చేయలేదని విమర్శించారు. ఆ పార్టీ చేసిన మోసాలపై ప్రచారం చేస్తామని తెలిపారు. 

మరోవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం, అంతర్గత కుమ్ములాటలు తీవ్రమవడం ఆయా పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నది. అభ్యర్థి ఎంపిక విషయంలోనే కాంగ్రెస్ లో కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. మంత్రుల ధోరణులనే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. అదీగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ల మధ్య సయోధ్య కుదరకపోవడం, ఎవరికి వారే అన్నట్టు ఉండటం కూడా కాంగ్రెస్ శ్రేణులలో గందరగోళానికి దారితీస్తోంది.

ప్రవీణ్