hand broken

పతాకస్థాయిలో కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలు

వైపు రాష్ట్రంలో తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెచ్చుమీరుతున్న సమయంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికను, స్థానిక సంస్థల ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలో అర్థం కాక సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల మధ్య పతాకస్థాయికి చేరుతున్న కుమ్ములాటలు పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు పంపుతున్నాయి. ముఖ్యమంత్రి ధోరణులకు వ్యతిరేకంగా మంత్రులు సమావేశమవుతూ, దిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేరవేస్తుండగా, మరోవంక ఒకరిపట్ల మరొకరు ఎడమొఖం, పెడముఖంగా వ్యవహరిస్తూ ఉండటంతో వారు క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ‘దున్నపోతు’ వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ తీసుకొని ఆ మంత్రులు ఇద్దరినీ ఇంటికి పిలిచి, ప్రభాకర్ చేత ‘క్షమాపణ’ అయితే చెప్పించారు గాని ఈ వాఖ్యలు రగిల్చిన చిచ్చు మాత్రం ఇప్పట్లో ఆరిపోయే అవకాశాలు కనిపించడం లేదు. మాదిగ సామాజికవర్గం అంటేనే కాంగ్రెస్‌ మొదటి నుంచీ అలుసుగా చూస్తున్నదని ఆ సామాజిక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అదే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలపై చలాయించే ఆధిపత్యం తాజాగా పరాకాష్టకు చేరినట్టు తెలుస్తున్నది. జిల్లాలో పార్టీ నేతలు అందరినీ సమైక్యంగా వ్యవహరించేటట్లు చేయాల్సిన ఇంఛార్జ్ మంత్రి తానే వారి మధ్య చిచ్చుపెడుతున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

పొన్నం ప్రభాకర్ వాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్‌ వ్యక్తం చేసిన ఆవేదన ఆ సామాజికవర్గం ప్రజలలో ఆగ్రవేశాలు రేకెత్తిస్తున్నాయి. “మాదిగ సామాజిక వర్గంలో పుట్టడమే మేం చేసిన పాపమా? ఆ సామాజిక వర్గం నుంచి మంత్రిని కావడమే మా దురదృష్టమా? మాదిగ సామాజికవర్గంలో పుట్టాం కాబట్టే ఇలాంటి అవమానాలు భరించాల్సి వస్తున్నది” అంటూ అడ్లూరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను సామాన్యమైన హరిజన వాడలో పుట్టి కాంగ్రెస్‌ జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చిన వాడినని తెలిపారు. “నేను మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన. నేను డబ్బున్నోడిని కాదు.. నా తండ్రి కేంద్ర మంత్రి కాదు.. పొన్నం ప్రభాకర్‌ మాదిరిగా ఉద్రేకంగా మాట్లాడే శక్తి ఉన్నవాడిని కాదు. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని. వాళ్లు అలా మాట్లాడుతారని నేను కలలో కూడా ఊహించలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “వాస్తవానికి నేను వాళ్లకు సమకాలికంగా ఎదగడం, ఆయన పక్కన కూర్చోవడం వివేక్‌కు ఇష్టం లేదు. మంత్రి వివేక్‌ మొదటి నుంచీ మా వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. మా వర్గీకరణను కూడా వ్యతిరేకిస్తున్నారు. మాదిగ వర్గానికి చెందినోడు నా పక్కన కూర్చుంటాడా.. వాడి లెక్కెంత’ అని వివేక్‌ అనుకుంటున్నారు” అంటూ చేసిన సంచలన వాఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నెలకొన్న పెత్తందారీ ధోరణులను బహిరంగ పరిచాయి.

47 లక్షల మంది ఓటర్లు ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా ఆదిలోనే అవమానపరిచారని, ఎంపీ పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఈ సందర్భంగా ఆ సామాజికవర్గం నేతలు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలల తర్వాత ఒక్క నేతకు అవకాశం కల్పించి, చట్టసభల సాక్షిగా ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించటం దుర్మార్గమైన చర్య అని అభివర్ణిస్తున్నారు. టీజీపీఎస్సీ సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటి సాధారణ పదవులను తమకు కట్టబెట్టి కీలక పదవులను వారు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలను ఆర్థిక పలుకుబడి కలిగిన మాల నేతలకు, వరంగల్‌ నియోజకవర్గాన్ని బైండ్ల సామాజికవర్గానికి చెందిన మహిళకు ఇచ్చారని, ఒక స్థానంలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వకుండా తమను నిర్దాక్షిణ్యంగా అణచి వేశారని గుర్తు చేస్తున్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గద్దెనెకాక నామినేటెడ్‌ పదవుల భర్తీలోనూ మాదిగలకు అన్యాయమే జరిగిందని, తొలి జాబితాలో 34 మందికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులిస్తే, మాదిగ సామాజికవర్గంలో ఒకరికి మాత్రమే చోటు కల్పించారని ఆ వర్గం వారు స్పష్టం చేస్తున్నారు. అది కూడా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవేనని చెప్తున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌ మాదిగలకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శిస్తున్నారు. తన రాజకీయ ఎదుగుదలలో మాదిగలు కీలకపాత్ర పోషించారని స్వయంగా రేవంత్‌ రెడ్డి పలు బహిరంగ సభలు, సమావేశాల్లో చెప్పారని, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన మాదిగలను శత్రువులుగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాదిగ సామాజికవర్గానికి రాజకీయంగా జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని పలుమార్లు బహిరంగంగా కోరినా రేవంత్‌ స్పందించలేదని గుర్తు చేస్తున్నారు. రేవంత్‌ పాలనలో తమ కులం రాజకీయంగా అణచివేతకు గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో మొదటి బహిష్కరణ వేటు మాదిగ సామాజికవర్గానికి చెందిన జడ్సన్‌పైనే పడిందన్న విషయాన్ని చరిత్ర ఎన్నటికీ మరచిపోదని స్పష్టం చేస్తున్నారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో మొత్తం ఆరుగురు మాదిగ ఎమ్యెల్యేలు కలిసి తమలో ఎవ్వరికీ మంత్రి పదవి ఇచ్చినా సరే అంటూ ఒత్తిడి తేవడంతో పార్టీ అధిష్టానం విధిలేక మంత్రి పదవి ఇవ్వడాన్ని పార్టీలో పెత్తందారీ నాయకత్వం తగ్గుకోలేకపోతున్నట్లు తాజా ఉదంతం వెల్లడి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతర నేపథ్యంగా జరిగే పనుల విషయంలో మంత్రి పొంగులేటి ఏకపక్ష ధోరణులపై మహిళా మంత్రులిద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రగిలిపోతున్నారు. పొంగులేటి ఆధిపత్యంపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం కోసం రూ.71 కోట్ల టెండర్లను ప్రభుత్వం పిలిచింది. దేవాదాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయిన సీతక్కకు కనీస సమాచారం లేకుండానే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో రగిలిపోతున్నారు. సెప్టెంబర్ 23న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు మేడారం సందర్శించారు. ఆ సమయంలో మేడారంలో చేపట్టనున్న పనులను ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వారానికి ఒకసారి అయినా సమీక్షించాలని సీఎం చెప్పడం, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క, సురేఖ షాక్‌కు గురయ్యారని తెలుస్తున్నది. తాజాగా మేడారం పనుల టెండర్ల ముసుగులో తన సంబంధీకులకు, తన జిల్లా వారికి పనులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. టెండర్లకు వచ్చిన మూడు కంపెనీల్లో రెండు మంత్రి పొంగులేటి సన్నిహితులవి కావడంతోనే ఆ మంత్రులను దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. తన మంత్రిత్వ శాఖలో తనకు తెలియకుండా టెండర్లు పిలవడంపై ఆగ్రహంగా ఉన్న కొండా సురేఖ ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కృష్ణ చైతన్య