Medical

పేదలకు అందుబాటులో ఆధునిక వైద్యం

2018లో రాంచీలో ఆయుష్మాన్ భారత్ (ఏబీ) పీఎం-జేఏవై పథకం ప్రారంభంతో ఆరోగ్య సంరక్షణలో కొత్త శకం మొదలైంది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం, నగదు రహిత చికిత్సలు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా కాగిత రహిత వైద్య సేవలకు మార్గం సుగమమైంది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. ‘‘దేశంలో ఏ ఒక్కరు కూడా ఆర్థిక స్తోమత లేని కారణంగా మంచి వైద్యం అందుకోలేకపోతున్నామని బాధ పడకూడదు’’ అని ఆయన అన్నారు.

అందరికీ ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రధాని బృహత్తర లక్ష్యాన్ని మనం నిజం చేశాం. ఈ కొద్దికాలంలోనే ఈ పథకం దేశంలో ఎంతో మంది నిరుపేదలకు ప్రాణదాతగా మారింది. దురదృష్టవశాత్తూ ఒక్క పశ్చిమ బెంగాల్ మాత్రమే ఈ పథకంలో చేరలేదు. మిగతా దేశం మొత్తం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 2025 నాటికి 10.3 కోట్ల మందికి పైగా ఆస్పత్రుల్లో చేరడానికి అనుమతులు మంజూరయ్యాయి. రూ.1.48 లక్షల కోట్లకు పైగా నగదు రహిత చికిత్సలు అందించి, ఈ పథకం ప్రజల సొమ్ము ఆదా అయ్యేలా చేసింది.

పీఎం-జేఏవై పథకం వల్ల ఎంతో మేలు జరిగింది. పదేళ్ల క్రితం ప్రజలు తమ వైద్య ఖర్చులను దాదాపు పూర్తిగా సొంతంగానే భరించేవారు. కానీ ఇప్పుడు ఈ భారం బాగా తగ్గింది. ప్రస్తుతం దాదాపు 61 కోట్ల మంది ఈ పథకం పరిధిలో ఉన్నారు. పదేళ్ల జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, 2022లో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచారు. మార్చి 2024లో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వారి కుటుంబాలను కూడా ఇందులో చేర్చారు. అక్టోబర్ 2024 నుంచి 70 ఏళ్లు పైబడిన అందరినీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ వయ వందన కార్డు ద్వారా ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. అంతేకాకుండా సుమారు కోటి మంది గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులను కూడా ఈ పథకంలో చేర్చుతున్నారు. ఈ పథకం ఆర్థిక భరోసానే కాకుండా ముఖ్యంగా వృద్ధులు, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలకు గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చింది. వివిధ కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య బీమా పథకాలను ఆయుష్మాన్ భారత్‌తో కలపడం వల్ల పనులు వేగవంతమై, ప్రయోజనాలు ప్రజలకు సులభంగా, పారదర్శకంగా చేరుతున్నాయి.

పీఎం-జేఏవై ఫలితంగా ఆర్థిక రక్షణతో పాటు ఆరోగ్య ఫలితాలు కూడా మెరుగయ్యాయి. ప్రతిష్టాత్మక ‘ల్యాన్సెట్’ పత్రిక నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకం లబ్ధిదారుల్లో క్యాన్సర్ నిర్ధారణ అయిన 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభించేవారి సంఖ్య 90 శాతం పెరిగింది. ఆర్థిక అవరోధాలు తొలగిపోయిన తర్వాత వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఇది సూచిస్తుంది. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం ఈ పథకం అమలు చేసిన రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు (ఐఎంఆర్), ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు (యు5 ఎంఆర్) బాగా తగ్గాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు కొన్ని ఉత్తమమైన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వైద్యం పొందే అవకాశాన్ని పేదలకు కల్పించింది. ఈ పథకంలో 32,913 ఆస్పత్రులు నమోదయ్యాయి. ఇందులో 15,103 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఈ విస్తరిస్తున్న నెట్‌వర్క్, తక్కువ వైద్య సేవలు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా మెరుగైన సేవలు అందుబాటులోకి రావడాన్ని తెలియజేస్తోంది. 

ప్రత్యేక వైద్య సేవలు చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో అత్యుత్తమ వైద్య సేవలు కూడా పేదల కుటుంబాలకు చేరువయ్యాయి. ఇది ఆరోగ్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించింది. చిన్న పట్టణాల్లో కొత్త ఆస్పత్రులు పెడుతున్నారు. తద్వారా ఆరోగ్య రంగంలో ఉన్న భౌగోళిక అసమానతలు కూడా తగ్గుతున్నాయి. ఈ పథకం డిజిటల్ ఆరోగ్య సంరక్షణను కూడా ప్రోత్సహించింది. అత్యాధునిక ఐటీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల గుర్తింపు, ఈ-క్లెయిమ్‌లు, అక్రమాల విశ్లేషణ, ఇతర రాష్ట్రాల్లోనూ చికిత్స పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల అక్రమాలు 0.33 శాతం మాత్రమే ఉన్నాయి. ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మూడు అంచెల వ్యవస్థ కూడా ఉంది.

ఈ పెనుమార్పునకు మూలం ప్రధాని ఆలోచనలే. 2016లో నేను కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు, జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలికి అధ్యక్షత వహించే అవకాశం నాకు లభించింది. ఆ చర్చల్లో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ ప్రధాన అంశంగా ఉండేది. భారత్ వంటి పెద్ద, వైవిధ్యభరిత దేశంలో అందరికీ ఆరోగ్యం ఎలా సాధ్యం అని ఆలోచించేవాడిని. ప్రధాని మార్గదర్శకత్వంలోనే మనం పీఎం-జేఏవై పథకాన్ని రూపొందించగలిగాం. ఆయన స్వయంగా ప్రతి వివరాన్నీ చర్చించారు. 2018లో ప్రారంభించడానికి ముందు ఈ ప్రణాళికను మెరుగుపరచడానికి అనేక రాత్రుళ్ళు పొద్దుపోయేవరకు చర్చలు జరిపాం. ప్రారంభించిన తర్వాత కూడా ఆయన దీని గురించి లోతుగా చర్చించేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనల సందర్భంగా ఆయన ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులను కలిసి వారి సూచనలు తీసుకుని వాటి ఆధారంగా మరిన్ని సవరణలు సూచించారు.

ఏడు సంవత్సరాల తర్వాత ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా నిలిచింది. కానీ ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. పశ్చిమ బెంగాల్ కూడా ఈ పథకంలో చేరితే ఆ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రయోజనం లభిస్తుందని ఆశిస్తున్నాను. తక్కువ సేవలు ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఇందులో చేర్చాలి. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులను కూడా నిరంతరం మెరుగుపరచాలి. మరో ప్రధాన అంశం, ఆయుష్మాన్ భారత్‌ను ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో అనుసంధానం చేయడం. బలమైన రెఫరల్ వ్యవస్థ, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, ఫాలో-అప్ వ్యవస్థలు దీనికి మద్దతుగా ఉండాలి. రోగులు ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రులకు, అక్కడి నుంచి అధునాతన వైద్య సేవలకు సులభంగా వెళ్లగలగాలి. క్లెయిమ్‌లను నిశితంగా పరిశీలించడం, ఆస్పత్రులకు సకాలంలో చెల్లింపులు చేయడం కూడా చాలా అవసరం. ఇది సేవలందించేవారి విశ్వాసాన్ని పెంచి వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రతి భారతీయుడికీ ఆదాయంతో, భౌగోళిక ప్రాంతంతో సంబంధం లేకుండా మంచి వైద్యం అందేలా చేయడమే మా లక్ష్యం. ఈ బాధ్యత చాలా పెద్దది, కానీ మా సంకల్పం దృఢంగా ఉంది. రాబోయే సంవత్సరాలలో ఆయుష్మాన్ భారత్ ప్రధాని ఆశయానికి, ప్రభుత్వ నిబద్ధతకు, దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.

జేపీ నడ్డా,
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి