Advance Farmer

రైతుల నైపుణ్యాలకు పదును

రైతుల సాధికారత దేశ వ్యవసాయ వ్యూహంలో ప్రధానాంశంగా మారింది. మన జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిలో సగం మంది జీవనోపాధికి వ్యవసాయంపైనే ఆధారపడటం వల్ల రైతుల నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంపొందించడం సమ్మిళిత, సుస్థిర వృద్ధికి చాలా అవసరం. నేటి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు కేవలం రుణాలు లేదా పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాలేదు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటం, యాంత్రీకరణను స్వీకరించడం, మెరుగైన మార్కెట్ అవకాశాలను పొందడం వంటివి కూడా వారు ఎదుర్కొంటున్న సవాళ్లలో ఉన్నాయి. దీనిని గుర్తించిన ఎన్డీయే ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి ఎజెండాలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు ప్రాధాన్యమిచ్చింది. గత దశాబ్దంలో రైతులకు ఆచరణాత్మక పరిజ్ఞానం, వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమాలతో రైతులు కేవలం సాగుదారులుగానే కాకుండా, ఆవిష్కర్తలు, నిర్ణేతలు, వ్యవసాయ-విలువ గొలుసులో చురుకైన భాగస్వాములుగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK), వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ATMA), గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ (STRY), వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ (SMAM), ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) వంటి సంస్థలు, పథకాలు బలమైన శిక్షణా వేదికలను అందిస్తున్నాయి. వీటితో పాటు హార్టికల్చర్ (ఉద్యాన పంటలు), పశుపోషణ, భూసార పరిరక్షణ, ఆహార శుద్ధి వంటి రంగాలకు సంబంధించిన కార్యక్రమాలలోనూ నైపుణ్యాన్ని అందిస్తున్నారు. ఈ సమష్టి ప్రయత్నాలన్నీ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నొక్కి చెబుతున్నాయి. అది ఉత్పాదకతను, ఆదాయాలను పెంచడానికి, పటిష్టమైన వ్యవసాయ రంగాన్ని నిర్మించడానికి నైపుణ్యాల పెంపు ద్వారా రైతులకు సాధికారత కల్పించడం చాలా కీలకం అని.

 రైతుల శిక్షణకు సంస్థాగత వేదికలు

రైతులకు నేరుగా నైపుణ్యాన్ని అందించడానికి బలమైన సంస్థాగత వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ద్వారా స్థాపించిన KVKలు, జిల్లాలవారీగా ప్రధాన వ్యవసాయ విస్తరణ కేంద్రాలుగా పనిచేస్తాయి. ఇవి స్థానిక వ్యవసాయ-వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆచరణాత్మక శిక్షణ, ప్రదర్శనలు, వృత్తి కోర్సుల ద్వారా పరిశోధన, ఆచరణ మధ్య అంతరాన్ని పూరిస్తున్నాయి. 2021-2024 మధ్య KVKలు 58.02 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2021–22లో 16.91 లక్షలు, 2022–23లో 19.53 లక్షలు, 2023–24లో 21.56 లక్షల మంది రైతులు శిక్షణ పొందారు. 2024–25లో ఫిబ్రవరి 2025 వరకు 18.56 లక్షల మంది రైతులు శిక్షణ పొందారు. ఈ గణాంకాలు పంట నిర్వహణ, భూసారం, పశుపోషణ, అనుబంధ కార్యకలాపాలలో రైతులకు ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడంలో KVK వ్వవస్థ స్థిరత్వం, స్థాయిలను ప్రతిబింబిస్తున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా శిక్షణను అందిస్తూ, శాస్త్రీయ పద్ధతులను పరిచయం చేయడం ద్వారా KVKలు రైతుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో అత్యంత ప్రభావవంతమైన వేదికల్లో ఒకటిగా మారాయి. దీనికి తోడు, వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ATMA) రాష్ట్రాలు తమ విస్తరణ వ్యవస్థలను పునరుద్ధరించడంలో వాటికి మద్దతు ఇచ్చింది. ‘విస్తరణ సంస్కరణల కోసం రాష్ట్ర విస్తరణ కార్యక్రమాలకు మద్దతు’కు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకమైన ‘ఆత్మ’ను దేశవ్యాప్తంగా కేంద్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం రైతులకు శిక్షణ, ప్రదర్శనలు, క్షేత్ర సందర్శనలు, కిసాన్ మేళాలు వంటి వాటి ద్వారా తాజా వ్యవసాయ సాంకేతికతలు, మెరుగైన వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఆత్మ’ (ATMA) కింద 2021-22లో సుమారు 32.38 లక్షల మంది రైతులకు శిక్షణ ఇవ్వగా ఇది 2022-23లో 40.11 లక్షలకు పెరిగింది. 2023-24లో 36.6 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 2024-25 సంవత్సరం గణాంకాలు ఇంకా పూర్తికాలేదు. అయితే జనవరి 30, 2025 నాటికి సుమారు 18.3 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. మొత్తంగా 2021 నుండి 2025 వరకు ఈ పథకం దాదాపు 1.27 కోట్ల మంది రైతులను చేరుకుంది.

గ్రామీణ యువతకు నైపుణ్యం 

వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త అవకాశాల కోసం యువతరాన్ని సిద్ధం చేయడానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ (STRY) కార్యక్రమాన్ని గ్రామీణ యువతకు, రైతులకు వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఏడు రోజుల స్వల్పకాలిక నైపుణ్యం ఆధారిత శిక్షణను అందించడానికి రూపొందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయగలిగే నైపుణ్యం గల మానవ వనరులని సృష్టించడం దీని లక్ష్యం. STRY, హార్టికల్చర్, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పశుపోషణ వంటి రంగాలలో ఆచరణాత్మక వృత్తి శిక్షణను అందిస్తుంది. గత నాలుగు సంవత్సరాలలో ఈ పథకం పరిధి స్థిరంగా పెరుగుతూ వస్తోంది. 2021–22లో 10,456 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వగా, 2022–23లో 11,634 మందికి, 2023–24లో 20,940 మందికి ఇచ్చారు. 2021-2024 మధ్య మొత్తం 43,000 మందికి పైగా యువతకు శిక్షణ లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా డిసెంబర్ 31, 2024 వరకు 8,761 మంది యువతకు శిక్షణ ఇచ్చారు.

వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్

వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ (SMAM) చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ విద్యుత్ లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో యాంత్రీకరణను విస్తరించాలని చూస్తోంది. చిన్న కమతాల సవాళ్లు, అధిక నిర్వహణ ఖర్చుల సమస్యను పరిష్కరించడానికి కస్టమ్ హైరింగ్ సేవలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. అధికారిక సమాచారం ప్రకారం 2021 నుంచి 2025 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో SMAM మొత్తం 57,139 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది.

నేల, వనరులపై అవగాహన పెంపు 

పంట ప్రణాళిక, ఎరువుల వినియోగంపై రైతులు అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడంలో భూసార ఆరోగ్య కార్డు పథకం కీలక పాత్ర పోషించింది. జూలై 24, 2025 నాటికి దేశవ్యాప్తంగా 25.17 కోట్లకు పైగా భూసార ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. దాంతో పాటు 93,000కి పైగా రైతు శిక్షణా కార్యక్రమాలు, 6.8 లక్షల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు భూమిలో సమతుల్య పోషక నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించాయి. ఇక సమష్టి కార్యాచరణ స్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) ఏర్పాటు రైతు సామర్థ్యాన్ని పెంపొందించడానికి కొత్త వేదికలను సృష్టించింది. 10,000 FPOలు నమోదు కాగా, రైతులకు వ్యవసాయ-వ్యాపార నిర్వహణ, మార్కెట్ అనుసంధానం, ఈ-నామ్ వంటి డిజిటల్ వేదికల వినియోగంపై డిజిటల్ మాడ్యూల్స్, వెబినార్ల ద్వారా క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తున్నారు. 

ప్రభుత్వం తమ ప్రధాన జాతీయ పథకాలలోనూ నైపుణ్యాభివృద్ధిని భాగంగా చేసింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (2022–26) వ్యవసాయాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించింది. 2015లో ప్రారంభమైనప్పటి నుంచి జూన్ 30, 2025 వరకు PMKVY పథకం కింద 1.64 కోట్ల మందికి పైగా శిక్షణ పొందారు. 1.29 కోట్ల మందికి పైగా సర్టిఫికెట్లు లభించాయి. PMKVY మాదిరిగానే సమీకృత ఉద్యాన పంటల అభివృద్ధి కార్యక్రమం, రాష్ట్రీయ గోకుల్ మిషన్, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన వంటి ఆయా రంగాలకు ఉద్దేశించిన నిర్దిష్ట పథకాలలో కూడా రైతులు సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక అంశాలు ఉన్నాయి. సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వం రైతులు మెరుగైన పద్ధతులను పాటించడమే కాకుండా వారిని వ్యవస్థాపకులుగా, వ్యవసాయ-వ్యాపారులుగా, గ్రామీణ అభివృద్ధికి కీలక చోదకులుగా సాధికారీకరిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా నైపుణ్యం గల, స్వయం సమృద్ద, పటిష్ట రైతు సమాజానికి పునాది వేస్తున్నాయి.