Mann Ki Baat PM Modi

భారత అణుశక్తిలో చారిత్రాత్మక మైలురాయి

ఏప్రిల్ 26న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనుసులో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

భారతదేశం ఎల్లప్పుడూ దేశ పురోగతితో విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానించింది. ఈ దార్శనికతతో మన శాస్త్రవేత్తలు పౌర అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి ప్రయత్నాలు దేశ నిర్మాణానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాయి. దీని ఫలితంగా మన పారిశ్రామిక వృద్ధికి, ఇంధన రంగానికి, ఆరోగ్య సంరక్షణ రంగానికి ఎంతో ప్రయోజనం లభించింది. రైతుల నుండి ఆధునిక ఆవిష్కర్తల వరకు ప్రతి ఒక్కరికీ భారతదేశ పౌర అణు కార్యక్రమం ఎంతో సహాయపడింది. కొద్ది రోజుల కిందటే మన అణు శాస్త్రవేత్తలు మరో ప్రధాన విజయంతో భారతదేశ గౌరవాన్ని మరింత పెంచారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. క్రిటికాలిటీ అనేది ఒక రియాక్టర్ మొట్టమొదటిసారిగా స్వీయ-నిర్వహణ అణు శృంఖల చర్య విజయాన్ని సాధించే దశ. ఈ దశ రియాక్టర్ కార్యాచరణ దశలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశ అణుశక్తి ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. అంతేకాకుండా ఈ అణు రియాక్టర్ రూపకల్పన పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జరగడం విశేషం. దీన్ని బ్రీడర్ రియాక్టర్ అని ఎందుకు పిలుస్తారనే విషయం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు కోసం కొత్త ఇంధనాన్ని కూడా స్వయంగా ఉత్పత్తి చేసే ఒక వ్యవస్థ ఇది. భారతదేశ అణు కార్యక్రమానికి అమూల్యమైన సహకారం అందించిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 

పవన శక్తి రంగంలో భారతదేశం ఇటీవల ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. భారతదేశ పవన శక్తి ఉత్పాదన సామర్థ్యం ఇప్పుడు 56 గిగావాట్లను దాటింది. కేవలం గత ఒక్క సంవత్సరంలోనే దాదాపు 6 గిగావాట్ల కొత్త సామర్థ్యాన్ని అదనంగా సాధించింది. ఈనాడు పవన శక్తి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. ఇది మన ఇంజనీర్ల కృషి. ఇది మన యువత పట్టుదల. ఇది దేశ సామూహిక సంకల్పానికి ప్రతీక.

‘బీటింగ్ రిట్రీట్’ సంగీతం మొదటిసారిగా వేవ్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇది ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు తప్పకుండా వినండి. మన సాయుధ దళాలు, వారి సంప్రదాయాలను చూసి మీరు చాలా గర్వపడతారు.

ప్రతి సంవత్సరం వర్షాలు ముగియగానే రాన్ ఆఫ్ కచ్ కు లక్షలాది ఫ్లెమింగో పక్షులు వస్తాయి. ఈ ప్రాంతమంతా గులాబీ రంగుతో నిండిపోతుంది. అందుకే దీనికి ‘ఫ్లెమింగో సిటీ’ అని పేరు వచ్చింది. ఈ పక్షులు ఇక్కడ తమ గూళ్లను నిర్మించుకుని, తమ పిల్లలను పెంచుతాయి. కచ్ ప్రజలు వీటిని ‘లాఖా జీ బారాతీలు’ అని పిలుస్తారు. ఇప్పుడు కచ్‌లో ఈ లాఖా జీ బారాతీలు పర్యావరణ పరిరక్షణకు ఒక సుందర చిహ్నంగా మారాయి.

ఉత్తర ప్రదేశ్ తరాయి ప్రాంతంలో పంట కోత కాలంలో ఏనుగుల గుంపులు గ్రామాల వైపు వస్తాయి. ఇది సంఘర్షణ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో కూడా ‘గజ్ మిత్ర’ వంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏనుగులపై దృష్టి పెట్టేందుకు గ్రామస్థులు బృందాలుగా ఏర్పడతారు. వారు ప్రజలను సకాలంలో అప్రమత్తం చేస్తారు. ఇది సంఘర్షణను తగ్గించి, ప్రజలకు భరోసాను పెంచుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో బ్లాక్ బక్ అంటే కృష్ణజింకలు తిరిగి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది. కానీ నిరంతర ప్రయత్నాల వల్ల వాటి సంరక్షణ పెరిగింది. ఈ రోజు అవి పొలాల్లో బహిరంగంగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఇది మనం కోల్పోయిన వారసత్వం తిరిగి రావడాన్ని సూచిస్తుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్ట మేక పిట్ట ఒకప్పుడు మన ఎడారి ప్రాంతాలకు ప్రత్యేక చిహ్నంగా ఉండేది. అయితే ఒకప్పుడు వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఈ పక్షి అంతరించిపోయే అంచున ఉండేది. కానీ ఇప్పుడు దాని పరిరక్షణ కోసం ఒక పెద్ద ఉద్యమం జరుగుతోంది. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రజనన కేంద్రాలను స్థాపించారు. ఇప్పుడు నవ జీవనానికి ప్రారంభ మార్గాలు కనిపిస్తున్నాయి.

బ్రిటిష్ వారు చేసిన చట్టం ప్రకారం వెదురును ఒక చెట్టుగా నిర్వచించారు. దానికి సంబంధించిన నియమాలు చాలా కఠినంగా ఉండేవి. వెదురును ఎక్కడికైనా రవాణా చేయడం చాలా కష్టంగా ఉండేది. ఫలితంగా ఇక్కడి ప్రజలు వెదురు సంబంధిత వ్యాపారాల నుండి దూరంగా ఉన్నారు. 2017లో చట్టాన్ని మార్చడం ద్వారా వెదురును చెట్ల క్యాటగిరీ నుండి తొలగించాం. దాని ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయి. ఈరోజు ఈశాన్య ప్రాంతమంతటా వెదురు రంగం అభివృద్ధి చెందుతోంది. ప్రజలు నిరంతరం నూతన ఆవిష్కరణలు చేస్తూ, దానికి విలువను జోడిస్తున్నారు.

కొద్ది రోజుల కిందట భారత జాతీయ ఆర్కైవ్స్ ఒక ప్రత్యేక పోర్టల్‌లో ఒక విశిష్టమైన డేటాబేస్‌ను పంచుకుంది. ఈ సంస్థ 20 కోట్లకు పైగా అమూల్యమైన దస్తావేజులను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. బిర్చ్ వృక్షాల బెరడుపై రాసిన 7వ శతాబ్దపు గిల్గిత్ తాళపత్రాలు వీటిలో ఉన్నాయి. 8వ శతాబ్దానికి చెందిన ఆసక్తికరమైన గ్రంథం ‘శ్రీ భువాలయ్’ ను కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సంఖ్యలపై ఆధారపడిన ఈ పుస్తకం ఒక గ్రిడ్ రూపంలో ఉంది. రాణి లక్ష్మీబాయికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లేఖలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవి 1857లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలను వెల్లడిస్తాయి. ఇవి ఆమె ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభిమానుల కోసం నేతాజీ జీవితం, ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ ప్రసంగాలకు సంబంధించిన అనేక పత్రాలు ఉన్నాయి. పండిట్ మదన్ మోహన్ మాలవీయకు సంబంధించిన అనేక పత్రాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. వీటిలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు, హిందీ సాహిత్య సమ్మేళనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంది. మన రాజ్యాంగ సభకు సంబంధించిన అనేక విశిష్టమైన పత్రాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరందరూ www.abhilekh-patal.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరుతున్నాను. ఇది మీకు మన చరిత్రకు సంబంధించి అద్భుత అనుభవాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం మన దేశంలో ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. అదే జనగణన కార్యక్రమం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన. జనగణన 2027ను డిజిటల్ రూపంలోకి మార్చారు. మొత్తం సమాచారం నేరుగా డిజిటల్ మాధ్యమంలో నమోదు జరుగుతుంది. జనగణన కోసం ఇంటింటికీ వెళ్ళే సిబ్బంది దగ్గర ఒక మొబైల్ యాప్ ఉంటుంది. వారు మీతో మాట్లాడి, అందులో సమాచారాన్ని నమోదు చేస్తారు. ఈసారి జనగణనలో మీ భాగస్వామ్యం మరింత సులభతరమైంది. మీ సమాచారాన్ని మీరే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఈ సదుపాయం జనగణన సిబ్బంది రాకకు 15 రోజుల ముందే ప్రారంభమవుతుంది. మీరు మీ సౌలభ్యం మేరకు మీకు వీలైన సమయంలో సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మీకు ఒక ప్రత్యేక ఐడీ సంఖ్య లభిస్తుంది. ఈ ఐడీ సంఖ్య మీ మొబైల్ లేదా ఈమెయిల్‌కు వస్తుంది. ఆ తర్వాత జనగణన సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఈ ఐడీ సంఖ్యను చూపించి మీ సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చు. దీనివల్ల సమాచారాన్ని మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రక్రియను సులభతరం చేస్తుంది. స్వీయ-గణన పూర్తయిన రాష్ట్రాల్లో జనగణన చేసే సిబ్బంది బృందాలు కుటుంబాల జాబితా రూపొందించే పనిని కూడా ప్రారంభించాయి.

బ్రెజిల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ చీజ్ పోటీలో రెండు భారతీయ చీజ్ బ్రాండ్‌లు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నాయి. ఈనాడు భారతీయ చీజ్ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది. అనేక భారతీయ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. భారతీయ చీజ్ ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి ప్రపంచ మార్కెట్లకు, రెస్టారెంట్లకు చేరుతోంది. ఈ రోజు మనం లోకల్ నుండి గ్లోబల్ స్థాయికి వెళ్లడం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భారతీయ చీజ్ ఉదాహరణ మనకు ముందుకు వెళ్ళే మార్గాన్ని చూపిస్తుంది. భారతదేశ రుచి, భారతీయ సంప్రదాయం, భారతీయ నాణ్యత ప్రపంచానికి ఒక కొత్త అనుభూతిని అందించి, భారతదేశంతో ఒక కొత్త బంధాన్ని ఏర్పరుస్తాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.