వ్యక్తిత్వ హననానికి తగిన గుణపాఠం
అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ మాత్రం బుద్ధి తెచ్చుకోలేదు. బిజెపి నేతలపై, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై అదే పనిగా అసంబద్ధ ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మే 7న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన ప్రేలాపనలపై బిజెపి కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దీంతో పలువురు బిజెపి కార్యకర్తలు కౌశిక్ రెడ్డిని నిలదీయడానికి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి దాక్కోవడంతో సహనం కోల్పోయిన బిజెపి కార్యకర్తలు అక్కడ ఉన్న ఆయన కారును ధ్వంసం చేశారు.
బిజెపిని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాలకు, వ్యక్తిగత విమర్శలకు దిగుతోంది. బండి సంజయ్ లవంగం వేసుకున్న దృశ్యాలను వక్రీకరించి తంబాకుతో ముడిపెట్టడం బీఆర్ఎస్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. తాను తంబాకు తీసుకోలేదని స్వయంగా బండి సంజయ్ దేవుడి మీద ప్రమాణం చేసినప్పటికీ, గులాబీ పార్టీ పదేపదే అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కౌశిక్ రెడ్డి గానీ, కేటీఆర్ గానీ తాము డ్రగ్స్ తీసుకోవడం లేదని ప్రమాణం చేయగలరా? డీఎన్ఏ టెస్టుకు సిద్ధమా? అని సవాల్ విసిరితే వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు.
బండి సంజయ్ స్వయంకృషితో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన నాయకుడు. ఒక సామాన్యుడు కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. అటు కౌశిక్ రెడ్డి వార్తల్లో ఉండేందుకు నిత్యం బండి సంజయ్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. తన స్థాయికి మించి ఎదుటి వారిపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య దూషణలు చేయడం కౌశిక్ రెడ్డికి అలవాటే! గతంలో మహిళ అయిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఉద్దేశిస్తూ అసభ్య వ్యాఖ్యలు చేసి, మహిళల ఆగ్రహానికి గురైన చరిత్ర కౌశిక్ రెడ్డిది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బిజెపి కార్యకర్తలు సహనం కోల్పోయేలా చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా బిజెపి భౌతిక దాడులను ప్రోత్సహించదు. కానీ బూతులు తిడుతూ, నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే కార్యకర్తలు ఎంత వరకు సంయమనంతో ఉండగలరు? సహనాన్ని చేతగానితనంగా భావించి, అదే పనిగా రెచ్చగొడుతుంటే పరిస్థితులు చేయిదాటిపోతాయి. ప్రత్యర్థి పార్టీగా బీఆర్ఎస్ బిజెపిని, బిజెపి నాయకులను రాజకీయంగా విమర్శించవచ్చు, ఆధారాలతో ఆరోపణలు చేయవచ్చు, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతామని, నిరాధార ఆరోపణలతో బురద జల్లుతామంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పకుండా ఉండరు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలను బిజెపి తీవ్రంగా ఖండించింది. బిజెపి నాయకులపై ఎవరైనా అసత్య ఆరోపణలు లేదా వ్యక్తిగత దూషణలు చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోబోదని, తగిన విధంగా తిప్పికొడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు హుందాగా మాట్లాడాలని సూచించారు. బిజెపి హింసను ప్రోత్సహించదని, అయితే వ్యక్తిగత పరువుకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే కార్యకర్తలు తగిన విధంగా స్పందించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని రాంచందర్ రావు హెచ్చరించారు.

