Vandemataram

వందేమాతరం.. దేశానికి స్ఫూర్తి మంత్రం

Vandemataramవందేమాతరం గేయం.. దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. ఈ ఏడాదితో వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ జాతీయ గీతాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభ సందర్భంగా బంకించంద్ర ఛటర్జీ రాశారు. ఇది ఆయన నవల ‘ఆనందమఠ్‌’లో భాగంగా తొలిసారి సాహిత్య పత్రిక ‘బంగదర్శన్‌’లో ప్రచురితమైంది. శక్తిసామర్థ్యాలు, సౌభాగ్యం, దైవ స్వరూపంగా మాతృభూమిని ప్రార్థించే ఈ గీతం దేశ ఐక్యత, ఆత్మగౌరవాలను మేల్కొలిపే స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణను సమకూర్చింది. అటుపైన అనతి కాలంలోనే దేశభక్తికి శాశ్వత ప్రతీకగా మారింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వందేమాతరం 150వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సామూహికంగా ‘వందేమాతరం’ ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఒక స్మారక తపాలా బిళ్లను, నాణాన్ని కూడా ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని సందర్శించారు. దేశవ్యాప్తంగా ఏడాది పాటు… 2026 నవంబరు 7 వరకూ నిర్వహించే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలలో భాగంగా దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ”వందేమాతరం గేయం కాదు.. భారతీయులు సాధించలేని లక్ష్యమంటూ ఏదీ లేదని చెప్పే ధైర్యం. ఓ మంత్రం, స్వప్నం, సంకల్పం. ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తున్న గేయం. ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి చేసినపుడు.. దేశం దుర్గామాత అవతారమెత్తడాన్ని ప్రపంచం చూసింది” అని అన్నారు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయంలోని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని, దీంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని వ్యాఖ్యలు చేశారు. ”దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల గొంతుక వందేమాతరం. ప్రతి భారతీయుడి భావోద్వేగాలను ప్రతిబింబించిన గీతం. దురదృష్టవశాత్తూ 1937లో ఆత్మ నుంచి ఒక భాగాన్ని వేరు చేసినట్లు, ఈ గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారు. వందేమాతరాన్ని ముక్కలు చేశారు. ఈ విభజనతో దేశ విభజనకూ బీజాలు పడ్డాయి. ఈ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో యువతరం తెలుసుకోవాలి. ఆ విభజనవాద మనస్తత్వంతో ఇప్పటికీ దేశానికి ముప్పు పొంచి ఉంది” అని పేర్కొన్నారు. 

ఇది మన మాతృభూమి అని, ఈ దేశం మన తల్లి అని, మనం ఆమె పిల్లలమని, వేద కాలం నుంచి భారతీయులు దేశాన్ని మాతృమూర్తిగా కొలిచారని మోదీ అన్నారు. వందేమాతరం ద్వారా ఈ భావన స్వాతంత్ర్య సమరంలో కొత్త చైతన్యాన్ని నింపిందని వెల్లడించారు. దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి… అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్‌ ఇందుకు భిన్నం… ఇక్కడ తల్లి అంటే జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

వందేమాతరం స్వాతంత్ర్య పోరాట గీతమైనప్పటికీ, మనకు లభించిన స్వేచ్ఛను పరిరక్షించుకోవడంలోనూ ఇది స్ఫూర్తినిస్తున్నదని మోదీ పేర్కొన్నారు. బంకింబాబు అసలు కూర్పు నుంచి కొన్ని పంక్తులను ఈ సందర్భంగా ఉటంకించారు. దీని ప్రకారం… భరతమాత జ్ఞానప్రదాత అయిన సరస్వతీ స్వరూపం మాత్రమే కాదు… సౌభాగ్య ప్రదాత లక్ష్మీదేవి, సాయుధ శక్తిస్వరూపిణి దుర్గామాత కూడా! ఇది జ్ఞానం, శాస్త్ర, సాంకేతికతలలో ముందంజలో నిలిచే దేశాన్ని.. అభ్యసనం ఆవిష్కరణల శక్తితో సుసంపన్న దేశాన్ని… జాతీయ భద్రతలో స్వావలంబన గల దేశాన్ని నిర్మించడమే ఈ దార్శనికత లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 

”వందేమాతరం ప్రధాన ఇతివృత్తం భారత్, భరతమాత. భారతదేశపు అద్భుత భావన. మనం, మన పూర్వీకులు, రుషులు, సాధువులు, గురువులు, దేవుళ్ళు, మన దేశ ప్రజలు కలిసి మన సొంత సాంస్కృతిక గుర్తింపును సృష్టించుకున్నాం. బలం, నైతికత మధ్య సమతుల్యతను మనం అర్థం చేసుకున్నాం. అప్పుడే ఒక దేశంగా భారత్ గతంలోని ప్రతి దెబ్బను భరించి బంగారు రత్నంగా ఆవిర్భవించింది… దాని ద్వారా అమరత్వాన్ని పొందింది. భారత్ అనే ఈ భావన వెనుక ఉన్న గొప్ప సైద్ధాంతిక శక్తి ఉంది. భరతమాత బానిస సంకెళ్లు తొలగిపోయి… భరతమాత బిడ్డలంతా వారి భవితను సొంతంగా నిర్మించుకునే స్వేచ్ఛ లభించింది. ఇక్కడి నదులు, పర్వతాలు, అడవులు, చెట్లు, సారవంతమైన నేలలతో ఈ భూమి ఎల్లప్పుడూ బంగారం పండించే శక్తిని కలిగి ఉంది. శతాబ్దాలుగా ప్రపంచమంతా భారత్ శ్రేయస్సు గురించి కథలు వింటూనే ఉంది. కేవలం కొన్ని శతాబ్దాల కిందటే భారత్ ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉంది. బంకిం బాబు వందేమాతరం రచించే సమయానికి భారత్ తన స్వర్ణయుగం నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. విదేశీ దండయాత్రలు, వారి దాడులు, దోపిడీలు, బ్రిటిష్ వారి దోపిడీ విధానాలతో ఆ సమయంలో మన దేశం పేదరికం, ఆకలి గుప్పిట్లో విలపిస్తోంది. అయినప్పటికీ ఆ విపత్కర పరిస్థితుల్లో, చుట్టూ బాధ, విధ్వంసం, విషాదం ఉన్నప్పటికీ… ప్రతిదీ మునిగి పోతున్నట్లు అనిపించిన విపత్కర పరిస్థితిల్లోనూ… మన బంకిం బాబు సంపన్న భారత్ కోసం పిలుపునిచ్చారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా భారత్ తన స్వర్ణయుగాన్ని పునరుద్ధరించగలదని ఆయన నమ్మారు. అందుకే ఆయన వందేమాతరం అని పిలుపునిచ్చారు. నేడు శాస్త్ర, సాంకేతికత రంగంలో మనం అపూర్వమైన పురోగతిని సాధించాం. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఆవిర్భవించాం. నూతన భారతదేశం మానవతా సేవలో కమల – విమల స్వరూపమైతే, శత్రువు ఉగ్రవాదం ద్వారా భారతదేశ భద్రత, గౌరవంపై దాడికి సాహసించినప్పుడు ఉగ్రవాదాన్ని నశింపజేయడానికి ‘దశ‑ప్రహరణ‑ధారిణీ దుర్గ’ గా ఎలా మారిందో ప్రపంచం మొత్తం చూసింది.

మహాత్మా గాంధీ 1927లో “వందేమాతరం మన ముందు విభజించలేని సమగ్ర భారతదేశ దృశ్యాన్ని ఉంచుతుంది” అని అన్నారు. అరవిందుడు ‘వందేమాతరం’ను ఒక పాట కంటే ఎక్కువ, ఒక మంత్రం అని అభివర్ణించారు. భికాజీ కామా రూపొందించిన భారత జెండా మధ్యలో కూడా ‘వందేమాతరం’ అని రాశారు. మన జాతీయ జెండా కాలక్రమేణా చాలా మార్పులకు లోనైంది. అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు జాతీయ పతాకం ఎగురవేసిన ప్రతి సందర్భంలోనూ మనం అప్రయత్నంగానే ‘భారత్ మాతా కి జై! వందేమాతరం!’ అని నినదిస్తాం. అందుకే, ఈరోజు మనం ఆ జాతీయ గేయం 150 సంవత్సరాలను జరుపుకుంటున్న సందర్భం మన దేశ మహానాయకులకు అర్పించే నివాళి. అలాగే, వందేమాతరం అని నినదిస్తూ ఉరికొయ్యపై ప్రాణాలు వదిలిన లక్షలాది అమర వీరులకు, వందేమాతరం అంటూ కొరడా దెబ్బలను భరించినవారికి, మంచు కొండలపై వందేమాతరం అంటూ ధైర్యంగా నిలబడిన సైనికులకు కూడా ఇది మన గౌరవప్రదమైన వందనం.” అని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి రేఖ గుప్తా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.