rural india

వికేంద్రీకరణతో మారుతున్న గ్రామీణ భారత ముఖచిత్రం

‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో భారత్ చేపట్టిన సమ్మిళిత వృద్ధి ప్రయాణం గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రాథమిక వసతుల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా జనాభాలో మెజారిటీ భాగం నివసించే గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న మార్పులు దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు, స్థానిక సంస్థల బలోపేతం, డిజిటల్ విప్లవం గ్రామీణ భారతాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ కేటాయింపులు 2016-17లో రూ.87,765 కోట్ల నుంచి 2026-27 నాటికి రూ.2,73,108 కోట్లకు పెరిగాయి. అంటే గత దశాబ్ద కాలంలో సుమారు 211 శాతం పెరుగుదల నమోదైంది. ఇది గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటిచెబుతోంది. 

సంక్షేమం నుంచి భాగస్వామ్యం వైపు

గ్రామీణాభివృద్ధి విధానంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. అభివృద్ధి అంటే కేవలం పైనుంచి పథకాలను అమలు చేయడం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన అధికారాలతో పంచాయతీరాజ్ సంస్థలు నేడు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. 16వ ఆర్థిక సంఘం (2026-2031) కింద పంచాయతీలకు నేరుగా బదిలీ చేసే నిధులను రూ.4.35 లక్షల కోట్లకు పెంచడం ద్వారా స్థానిక సంస్థల ఆర్థిక స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం బలోపేతం చేసింది. 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల (రూ.2.36 లక్షల కోట్లు) తో పోలిస్తే ఇది భారీ పెరుగుదల.

పేదరిక నిర్మూలనలో మైలురాళ్లు

నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, దేశంలో బహుముఖ పేదరికం గణనీయంగా తగ్గింది. 2005-06లో 55.3 శాతంగా ఉన్న పేదరికం, 2022-23 నాటికి 11.28 శాతానికి పడిపోయింది. విద్యా, ఆరోగ్య రంగాలపై వ్యయాన్ని పెంచడం (12%), సామాజిక భద్రతా పథకాలను పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వసతుల కల్పన విప్లవాత్మకంగా సాగుతోంది:

జల జీవన్ మిషన్: 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ‘హర్ ఘర్ జల్’ (ఇంటింటికీ నీరు) లక్ష్యంతో ప్రతి ఇంటికీ తాగునీరు అందుతోంది. 2025 నవంబర్ నాటికి సుమారు 15.74 కోట్ల గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా నీటి సరఫరా అందుతోంది.

స్వచ్ఛ భారత్ (గ్రామీణ): దేశంలోని 96 శాతానికి పైగా గ్రామాలు ‘ODF+’ (బహిరంగ మలవిసర్జన రహిత) హోదాను సాధించాయి. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సౌభాగ్య పథకం: దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడంలో ఈ పథకం నూటికి నూరు శాతం విజయం సాధించింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ): 2029 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. గత 11 ఏళ్లలో 3.7 కోట్ల గృహాల నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది బడ్జెట్‌లో దీని కోసం రూ.54,916 కోట్లు కేటాయించారు.

గ్రామీణ రహదారులు (ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన): సుమారు 99.6 శాతం ఆవాసాలకు పక్కా రోడ్ల సౌకర్యం కల్పించారు.

డిజిటల్ విప్లవం: సాంకేతికత గ్రామీణ పాలనలో పారదర్శకతను పెంచింది. స్వామిత్వ పథకం ద్వారా డ్రోన్లను ఉపయోగించి గ్రామీణ భూముల మ్యాపింగ్ చేయడం వల్ల భూ వివాదాలు తగ్గడమే కాకుండా, ఆస్తులపై రుణాలు పొందే సదుపాయం కలిగింది. అలాగే ‘నమో డ్రోన్ దీదీ’ వంటి పథకాలు మహిళా రైతులను సాంకేతికత వైపు నడిపిస్తున్నాయి. ‘భూ-ఆధార్’ ద్వారా భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 

మహిళా సాధికారత: దీనదయాళ్ అంత్యోదయ యోజన కింద నేడు దేశంలో 10 కోట్ల మంది మహిళలు 90 లక్షల స్వయం సహాయక సంఘాలలో (SHGలు) సభ్యులుగా ఉన్నారు. వీరు కేవలం పొదుపు సంఘాలుగానే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తిగా ఎదిగారు.

షి-మార్ట్ లు: 2026-27 బడ్జెట్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘షీ-మార్ట్స్’ ఏర్పాటును ప్రతిపాదించారు. ఇవి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి సామాజిక రిటైల్ దుకాణాలుగా పనిచేస్తాయి. ‘లఖ్‌పతి దీదీ’ లక్ష్యం దిశగా మహిళలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. 

కొత్త ఉపాధి చట్టం: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ, ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్-2025’ (వీబీ- జీ రామ్ జీ) చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి 2026-27 బడ్జెట్‌లో రూ.95,692 కోట్లు కేటాయించారు. ఈ చట్టం కింద ఏడాదికి 125 రోజుల పని దినాలను కల్పించడమే కాకుండా, నీటి భద్రత, విపత్తు నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు.

భారతదేశ గ్రామీణాభివృద్ధి కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, వికేంద్రీకరణ, ప్రజా భాగస్వామ్యంతో కూడిన ఒక కొత్త నమూనాగా మారుతోంది. పెరిగిన బడ్జెట్ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా శక్తిని వినియోగించుకోవడం ద్వారా గ్రామీణ భారతం దేశాభివృద్ధిలో కీలక భాగస్వామిగా నిలుస్తోంది. 2026-27 బడ్జెట్ ఈ ప్రయాణంలో ఒక చరిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది.