పీఎం రాహత్: ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడే సంజీవని
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఒక రోజు సగటున 500 మరణాలు సంభవిస్తున్నాయని ఒక అంచనా. ఇందులో సకాలంలో వైద్యం అందక చనిపోతున్న వారే ఎక్కువ. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగలిగితే దాదాపు 50 శాతం మరణాలను నివారించొచ్చని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్’ (PM RAHAT -Road Accident Victim Hospitalisation and Assured Treatment) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. తక్షణ వైద్య సహాయం అందకపోవడం వల్ల ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం.
‘పీఎం రాహత్’ ప్రాణాలను కాపాడే తక్షణ వైద్యం అందించేందుకు ప్రమాద బాధితుల కోసం ఒక నిర్మాణాత్మక అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో ఆసుపత్రులకు ఆర్థిక భరోసా కూడా కల్పిస్తుంది. ERSS (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్) 112 హెల్ప్‌లైన్‌తో ఈ పథకాన్ని అనుసంధానించడం ద్వారా ప్రమాద బాధితులు ‘గోల్డెన్ అవర్’ లోపు ఆసుపత్రికి చేరుకునేలా చర్యలు తీసుకుంటారు. రోడ్డు ప్రమాద బాధితులు, వీరికి సహాయం చేసే వ్యక్తులు, వీరినే ‘రాహ్-వీర్’ అంటారు లేదా ప్రమాద స్థలంలో ఉన్న ఎవరైనా సరే ప్రమాదం జరిగిన వెంటనే 112కి కాల్ చేస్తే, ఆ సమాచారం ఎమర్జెన్సీ సిస్టమ్‌లో నమోదు అవుతుంది. అదే సమయంలో పోలీస్, అంబులెన్స్, దగ్గర్లోని ఆసుపత్రికి అలర్ట్ వెళ్తుంది. దీంతో అంబులెన్స్ వీలైనంత త్వరగా ప్రమాద స్థలికి చేరుకుంటుంది. పోలీసులు ప్రమాద వివరాలు- ప్రమాద స్థలం, వాహనం, బాధితుల వివరాలను Electronic Detailed Accident Report (e-DAR) ప్లాట్‌ఫామ్‌లో అప్లోడ్ చేస్తారు. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చిన వెంటనే, ఆసుపత్రి Transaction Management System (TMS) లో కేసును నమోదు చేస్తుంది. దీంతో చికిత్స క్యాష్‌లెస్‌గా ప్రారంభమవుతుంది. పోలీసులు ప్రమాదం నిజమా కాదా అని డిజిటల్ గానే ధ్రువీకరిస్తారు. బాధితుడికి అందించే చికిత్స, ఖర్చులు, మెడికల్ రిపోర్టులు అన్నీ సిస్టమ్‌లో అప్డేట్ అవుతాయి. వైద్య అధికారులు రియల్ టైమ్‌లో మానిటర్ చేయగలుగుతారు. కేసు రిజిస్ట్రేషన్ నుంచి చికిత్స, పోలీసు ధ్రువీకరణ, ఆసుపత్రులకు రీయింబర్స్‌మెంట్ వరకు మొత్తం ప్రక్రియ అంతా డిజిటల్ విధానంలో జరుగుతుంది.
ఈ పథకం కింద ఏ రకమైన రోడ్డుపైన ప్రమాదం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రాణాపాయం లేని సందర్భాల్లో 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 48 గంటల వరకు బాధితుడికి చికిత్స అందిస్తారు. అయితే ఇది సమగ్ర డిజిటల్ వ్యవస్థ ద్వారా పోలీసు ధ్రువీకరణకు లోబడి ఉంటుంది. ప్రాణాపాయం లేని కేసుల్లో 24 గంటల్లోపు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసుల్లో 48 గంటల్లోపు పోలీసు ధ్రువీకరణ పూర్తి కావాల్సి ఉంటుంది.
పీఎం రాహత్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఈ-డార్ (ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్)’ ప్లాట్‌ఫారమ్‌ను, నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో (టీఎంఎస్ 2.0) అనుసంధానిస్తుంది. ఆసుపత్రులకు చేసే చెల్లింపులు (రీయింబర్స్‌మెంట్) ‘మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్’ (MVAF) ద్వారా జరుగుతాయి. ప్రమాదానికి కారణమైన వాహనానికి బీమా ఉంటే ఆ మొత్తాన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి చెల్లిస్తారు. ఒకవేళ బీమా లేకపోయినా లేదా అది ‘హిట్ అండ్ రన్’ కేసు అయినా ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ద్వారా ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తారు. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదించిన 10 రోజుల్లోగా క్లెయిమ్‌లను చెల్లిస్తారు. దీనివల్ల ఆసుపత్రులకు ఆర్థిక భరోసా లభిస్తుంది, చికిత్సకు ఎలాంటి ఆటంకం కలగదు. బాధితుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ఉండే జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఒక అధికారిని నియమిస్తుంది. ఇది జిల్లా స్థాయిలో జవాబుదారీతనం నిర్ధారిస్తుంది.

