యావత్ ప్రపంచాన్ని ఏకం చేసిన యోగా
ప్రపంచాన్ని సంఘర్షణ నుంచి సహకారానికి, ఒత్తిడి నుంచి పరిష్కారాలకు యోగా మార్గనిర్దేశం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచంలోని పెరుగుతున్న ఒత్తిడి, అశాంతి, అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని ఇటువంటి సమయాల్లో యోగా శాంతికి మార్గాన్ని అందిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రతి దేశం, ప్రతి సమాజం యోగాను వారి జీవనశైలి, ప్రజా విధానాలతో అనుసంధానించాలని పిలుపునిచ్చారు. శాంతి, సమతుల్యత, సుస్థిరత దిశగా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సమష్టి కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మందితో కలిసి మోదీ యోగా సాధన చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ “ఐక్యత” యోగా సారమనీ, యావత్ ప్రపంచాన్ని యోగా ఇలా ఏకం చేయడం చూస్తుంటే సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంగా యోగా ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ, ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆలోచనను భారత్ ప్రతిపాదించిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. 175 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని, ఇది యావత్ ప్రపంచ ఐక్యతకు అరుదైన ఉదాహరణగా అభివర్ణించారు. ఈ మద్దతు కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే కాదని, మానవాళికి మేలు చేసేందుకు ప్రపంచం చేసిన సమష్టి ప్రయత్నాన్ని ఇది సూచిస్తుందన్నారు. “పదకొండు సంవత్సరాల తరువాత, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవనశైలిలో యోగా అంతర్భాగంగా మారింది” అని ఆయన చెప్పారు. దివ్యాంగులు బ్రెయిలీలో యోగా గ్రంథాలను చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా సాధన చేయడం గర్వంగా ఉందన్నారు. యోగా ఒలింపియాడ్స్‌లో గ్రామీణ ప్రాంతాల యువత ఉత్సాహంగా పాల్గొనడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సిడ్నీ ఒపెరా హౌస్ మెట్ల మీదైనా, ఎవరెస్ట్ శిఖరం దగ్గరైనా, విశాలమైన సముద్రపు తీరంలోనైనా, “హద్దులు.. నేపథ్యాలు.. వయస్సు.. సామర్థ్యాలకు అతీతంగా యోగా అందిరిదీ” అనే సందేశంలో మార్పు ఉండదని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
యోగా దినోత్సవ ఇతివృత్తమైన “యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్” గురించి ప్రస్తావిస్తూ…భూమిపై ఉన్న ప్రతి జీవి ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉందనే లోతైన సత్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మానవ శ్రేయస్సు.. మనకు అన్నం పెట్టే నేల ఆరోగ్యం, మనకు నీటిని అందించే నదులు, మన పర్యావరణ వ్యవస్థను పంచుకునే జంతువులు, మనల్ని పోషించే మొక్కల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యోగా మనకు ఈ పరస్పర అనుసంధానాన్ని తెలియజెప్పి, ప్రపంచంతో ఏకమయ్యే దిశగా మార్గనిర్దేశం చేస్తుందని నరేంద్ర మోదీ వివరించారు. “మనం ఒంటరి కాదని, ప్రకృతిలో భాగస్వాములమని యోగా గుర్తుచేస్తుంది. మొదట్లో మన సొంత ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల మాత్రమే శ్రద్ధ వహించడం నేర్చుకుంటాం. కానీ క్రమంగా ఈ సంరక్షణ మన పర్యావరణం, సమాజం, యావత్ భూమండల ఆరోగ్యం గురించి ఆలోచించే వరకూ విస్తరిస్తుంది. యోగా ఒక లోతైన వ్యక్తిగత క్రమశిక్షణ. ఇది వ్యక్తులను ‘నేను’ నుంచి ‘మనం’ అనే భావన దిశగా నడిపించి మనలో మానవత్వాన్ని పెంపొందిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
‘‘నేను నుంచి మనం అనే భావన భారత స్ఫూర్తిని సూచిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వార్థానికి అతీతంగా ఉండి సమాజం గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడే మొత్తం మానవాళి సంక్షేమం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిని ప్రస్తావిస్తూ, అది “సర్వే భవంతు సుఖినః” అంటే సర్వజనుల సంక్షేమమే మన పవిత్ర కర్తవ్యం అనే విలువను మనకు బోధిస్తుందన్నారు. ‘నేను’ నుంచి ‘మనం’ వైపు ఈ ప్రయాణం సేవ, అంకితభావం, సహజీవనానికి పునాదిని ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. ఈ ఆలోచనే సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.
“మానవాళి గాలి పీల్చుకోవడానికీ, జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం ద్వారా తిరిగి పరిపూర్ణులుగా మారేందుకు అవసరమైన పాజ్ బటన్ వంటిదే యోగా” అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రపంచ సమాజానికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, “ఈ యోగా దినోత్సవం ప్రపంచానికి అంతఃశాంతిని ప్రసాదించే మానవత 2.0 ప్రారంభాన్ని సూచించేలా” మనమంతా కృషి చేయాలని కోరారు. యోగా కేవలం వ్యక్తిగత అభ్యాసంగా ఉండకుండా, ప్రపంచంతో భాగస్వామ్యాలకు ఒక మాధ్యమంగా పరిణామం చెందాలన్నారు.
దేశంలోని ప్రముఖ వైద్య సంస్థలు యోగా పరిశోధనలో చురుగ్గా నిమగ్నమై ఉన్నాయన్నారు. సమకాలీన వైద్య పద్ధతులతో యోగ శాస్త్రీయ ఔచిత్యాన్ని అనుసంధానించే లక్ష్యంగా వారు కృషి చేస్తున్నారని తెలిపారు. భారత్ తన వైద్య, పరిశోధనా సంస్థల ద్వారా యోగా రంగంలో ఆధారాల ఆధారిత చికిత్సను ప్రోత్సహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గుండె, నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సలో, అలాగే మహిళల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సును మెరుగుపరచడంలో యోగా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు.
జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా యోగా, ఆరోగ్య సందేశం చురుగ్గా ముందుకు వెళుతున్నదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో డిజిటల్ టెక్నాలజీ గణనీయమైన పాత్ర పోషించిందని ఆయన వ్యాఖ్యానించారు. యోగా పోర్టల్, యోగాంధ్ర పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా కార్యక్రమాలు నమోదయ్యాయని, ఇది దేశవ్యాప్తంగా యోగా పరిధి గణనీయంగా విస్తరించడాన్ని సూచిస్తుందన్నారు. దేశంలోని ప్రతి మూలలో జరుగుతున్న కార్యక్రమాల స్థాయి.. పెరుగుతున్న యోగా ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
“హీల్ ఇన్ ఇండియా” మంత్రానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను ప్రస్తావిస్తూ, వైద్యం కోసం ప్రముఖ గమ్యస్థానంగా భారత్ ఆవిర్భవించిందన్నారు. ఈ అభివృద్ధిలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యోగా సాధనను ప్రామాణీకరించే ఒక సాధారణ యోగా ప్రోటోకాల్ అభివృద్ధి చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర ఆరోగ్య వ్యవస్థ నిర్మాణంలో భాగంగా వైద్య కళాశాలల్లో 10 రోజుల యోగా మాడ్యూల్‌ను చేర్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లోనూ శిక్షణ పొందిన యోగా ఉపాధ్యాయులను నియమించినట్లు ఆయన తెలిపారు. భారత ఆరోగ్య వ్యవస్థ నుంచి ప్రపంచ సమాజం ప్రయోజనం పొందేలా చూసేందుకు, ప్రత్యేక ఇ-ఆయుష్ వీసాలను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
స్థూలకాయం సమస్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, రోజువారీ ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించే సవాలును స్వీకరించాలన్నారు. వ్యక్తులు తమ భోజనంలో కనీసం 10 శాతం నూనె వినియోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చనే విషయంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నూనె వినియోగాన్ని తగ్గించడం, అనారోగ్యకరమైన ఆహారాన్ని నివారించడం, యోగా సాధన చేయడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యమైన భాగాలని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
యోగాను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని శాంతి, ఆరోగ్యం, సామరస్యం వైపు నడిపించే ఉద్యమం అవసరమన్నారు. జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి ప్రతి వ్యక్తి యోగాతో తమ రోజును ప్రారంభించాలనీ, ఒత్తిడి లేని జీవితం కోసం ప్రతి సమాజం యోగాను స్వీకరించాలని ఆయన కోరారు. “యోగా మానవాళిని ఏకం చేసే మాధ్యమంగా పనిచేయాలి.. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం ప్రపంచ సంకల్పంగా మారాలి” అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కింజరాపు,జాదవ్ ప్రతాపరావు గణపత్‌రావు, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, భూపతి రాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రధాని అభినందించారు. విశాఖపట్నంతో పాటు దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు ఏకకాలంలో జరిగాయి. 2015లో జూన్ 21ని ఐడీవైగా పాటించాలనే భారత్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) ఆమోదించినప్పటి నుంచి.. ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూరు, న్యూయార్క్ (యూఎన్ ప్రధాన కార్యాలయం), శ్రీనగర్ సహా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన యోగా దినోత్సవ ప్రధాన వేడుకలకు నాయకత్వం వహించారు. అప్పటి నుంచి ఐడీవై ఒక శక్తిమంతమైన ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా అభివృద్ధి చెందింది.

