GKR SPM

దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

spm gkrటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ కులం, మతం, భాషల పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. హిందువుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించి, ఇతర మతస్తులను బుజ్జగించేలా సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడిందని అన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం దేశానికే మొదటి ప్రాధాన్యత అన్న భావనతో పాలన అందిస్తోందన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల పట్ల కాంగ్రెస్ ఉదాసీనత ప్రదర్శిస్తే, మోదీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందన్నారు. బిజెపికి దేశం సమగ్రంగా ఉండడం అత్యంత ముఖ్యమని, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముందుండి పనిచేసిందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు కోసం బలిదానమైన బిజెపి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలను నరేంద్ర మోదీ సాకారం చేశారన్నారు.

జూన్ 23న డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సహా పలువురు నాయకులు శ్యామా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్యామాప్రసాద్ సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు, సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘1951లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ తాత్కాలిక ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టి పాకిస్థాన్‌కు కాశ్మీర్‌లోని కొంతభాగాన్ని అప్పగించారు. దీనిని వ్యతిరేకించిన శ్యామాప్రసాద్ మాటలను నెహ్రూ పెడచెవిన పెట్టారు. తొలి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ.. రాజీనామా చేసి భారతీయ జనసంఘ్‌ పార్టీని స్థాపించారు. ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశమంతా త్రివర్ణ పతాకం ఉండగా, కాశ్మీర్‌కు మాత్రం మరో జెండా ఉండేది. దేశమంతా ఒక ప్రధాని ఉండగా, కశ్మీర్‌కు మరో ప్రధానమంత్రి ఉండేవారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమలవుతుంటే, జమ్ము కాశ్మీర్‌లో మాత్రం ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హక్కులు ఉండేవి. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని, జమ్ము కాశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగం చేయాలని శ్యామా ప్రసాద్ ముఖర్జీ మొట్టమొదట ఉద్యమాన్ని చేపట్టారు. జమ్ము కాశ్మీర్ భారతదేశంలో ఒక అంతర్భాగమైతే, అక్కడ ప్రత్యేక ప్రధానమంత్రి, ప్రత్యేక హక్కులు, ప్రత్యేక అధికారాలు ఎలా ఉంటాయంటూ ప్రశ్నించారు. వీసా, పర్మిట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన జమ్ము కాశ్మీర్‌లో అడుగుపెట్టారు. అప్పుడు ఆయనతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఉన్నారు. దేశ ప్రజలను చైతన్యం చేయాలని, కాశ్మీర్‌లో జరుగుతున్న అసమానతల గురించి తెలియజేయాలని వాజ్‌పేయిని శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రేరేపించారు. కానీ, జమ్ము కాశ్మీర్‌లో అడుగుపెట్టిన వెంటనే పర్మిట్ లేదన్న కారణంతో ఆయనను అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన జమ్ము కాశ్మీర్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన హత్యేనన్న ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దేశ సమగ్రతను కాపాడాలన్న సంకల్పంతో, ఆ ఆలోచనను పూర్తిగా కార్యరూపం దాల్చేందుకు ముందడుగు వేసి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానం అయ్యారు. శ్యామాప్రసాద్ లక్ష్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో నెరవేర్చారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్ము కాశ్మీర్‌లో దళితులకు, మహిళలకు దేశంలోని ఇతర ప్రాంతాలవారిలా సమాన హక్కులు కల్పించారు. ఆర్టికల్ 370 అమలులో ఉండగా 42 వేల మంది సైనికులు, పౌరులు జమ్ము కశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కాంగ్రెస్ వారిని పట్టించుకోలేదు. అక్కడి ప్రభుత్వాలు, కొంతమంది నాయకులు పాకిస్థాన్ ఐఎస్ఐకు అనుకూలంగా వ్యవహరించారు. ఆనాడు జమ్ము కాశ్మీర్ గోడలపై “ఓ దేశం కుక్కలారా, ఈ దేశం నుంచి వెళ్లిపోండి” అన్న రాతలు కనిపించేవి. దారుణ పరిస్థితులు ఉండేవి. అలాంటి సమయంలో జాతీయ పతాకాన్ని లాల్ చౌక్‌లో ఎగురవేయడానికి అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. నరేంద్ర మోదీ ఈ యాత్రకు కన్వీనర్‌గా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత లాల్ చౌక్‌లో జాతీయ పతాకం అధికారికంగా ఎగురవేశారు. 

ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు, పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, తన పదవిని నిలుపుకోవడానికి న్యాయస్థానాల తీర్పులను కాలరాశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి, లక్షలాది మందిని జైలులో వేసి, పౌరహక్కులను హరించివేసి దేశం మొత్తం ఒక జైలుగా మార్చారు. ఆనాడు జనసంఘ్ ను దేశం కోసం, పౌర హక్కుల కోసం, పత్రికా హక్కులను రక్షించేలా.. ప్రజాస్వామ్యం కోసం జనతా పార్టీలో తృణప్రాయంగా విలీనం చేసింది. అలాంటి విశిష్ట నాయకత్వాన్ని, దేశభక్తిని, గొప్ప సిద్ధాంతాన్ని మనకు అందించిన మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఈ రోజు 14 కోట్ల మంది బిజెపిలో సభ్యులుగా ఉన్నారు. ఆయన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నాం.’’ అని అన్నారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి వరకు అనేక కార్యక్రమాలు జరిగాయి. శ్యామా ప్రసాద్‌కు నివాళులు అర్పించి వారి సేమలను స్మరించుకున్నారు. జూన్ 23 నుంచి శ్యామా ప్రసాద్ జయంతి అయిన జూలై 6 వరకు రెండు వారాల పాటు జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బిజెపి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బూత్ స్థాయిలో ప్రాథమిక సభ్యుల సదస్సు, మొక్కలు నాటడం వంటి పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.