Eatala 11 years

అప్పుడు ఆడిందే ఆట.. ఇప్పుడు చావుదెబ్బ

Eatala 11 years‘గతంలో ఉగ్రదాడులు జరిగితే సంతాపసూచకంగా కొవ్వొత్తులు​ వెలిగించేవాళ్లం.. ఎర్రగులాబీలు పెట్టేవాళ్లం.. కానీ ఇప్పుడు పాకిస్తాన్​ కు చెప్తున్నా.. బిడ్డా.. మీ వైపు నుంచి ఒక్క డ్రోన్​ వచ్చినా.. భారత్​ నుంచి హైదరాబాద్‌లో తయారైన బ్రహ్మోస్​ క్షిపణి దూసుకొస్తదని హెచ్చరిస్తున్నాం.’’ అంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా11 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి నేడు ప్రజల ముందు కనిపిస్తున్నదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బిజెపి 11 ఏళ్లుగా నీతివంతంగా, పారదర్శకంగా, సమర్థమంతమైన పరిపాలన అందిస్తోందని, మరో 11 ఏళ్లు పరిపాలించేందుకు ప్రజల మద్దతుతో ముందుకెళ్తోందన్నారు. మోదీ ప్రభుత్వం విజయవంతంగా 11 ఏళ్లు, మల్కాజ్‌గిరి ఎంపీగా ఈటల రాజేందర్ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభకు కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రజలను ఆకట్టుకుంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ నుంచి నరేంద్ర మోదీ వరకు బిజెపి సాధించిన విజయాలను అందులో ప్రదర్శించారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్, రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్‌, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బిజెపి శాసనమండలి పక్షనేత ఏవీఎన్‌ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారు. యూపీఏ హయాంలో ఏ రోజు పేపర్​ చూసినా, టీవీ చూసినా కుంభకోణాలే కనిపించేవి. పతాక శీర్షకల్లో కాంగ్రెస్​ అవినీతి వార్తలు ఉండేవి. కానీ, గత 11 ఏళ్లలో బిజెపి ప్రభుత్వానికి సంబంధించి ఒక్క అవినీతి వార్త రాలేదంటే.. మోదీ పారదర్శక పాలనను అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోదీ నేతృత్వంలో గ్రామాల్లో స్వచ్ఛభారత్​ టాయిలెట్​ నుంచి మొదలు పెడితే.. చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగురవేసే వరకు ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించాం.

ఆనాడు పాకిస్తాన్​ ఆడిందే ఆటగా పాడిందే పాటగా దేశంలోని అన్ని నగరాల్లో ఐఎస్​ఐ ఏజెంట్లను పెట్టుకునేది. హైదరాబాద్‌లో బిజెపి నాయకులు సహా, పోలీస్​ అధికారులపై తీవ్రవాదులు దాడులు చేశారు. ఆనాడు పాకిస్తాన్​ అనుకుంటే.. భారతదేశంలో ఏ నగరంలోనైనా బాంబు పేలుళ్లు జరిపేది. ఏమీ చేయలేని పరిస్థితిలో భారతదేశం నష్టాన్ని భరించింది. ఎన్ని దాడులు జరిగినా.. ఆనాటి ప్రభుత్వం పాకిస్తాన్‌ను ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేది. మరి ఈరోజు ప్రధాని మోదీ నాయకత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. సర్జికల్​ స్ట్రైక్స్​, ఎయిర్​ స్ట్రైక్స్​ కావొచ్చు.. ఆపరేషన్​ సిందూర్​ లాంటి సాహసోపేత ఆపరేషన్లు చేపట్టి.. ఇక్కడున్నది బిజెపి ప్రభుత్వం.. మోదీ ప్రభుత్వం బిడ్డా అంటూ పాకిస్తాన్‌ను ఎలా చావుబెబ్బ తీశామో మీకు తెలుసు. ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా భారత సైనికులు ఆపరేషన్​ సింధూర్‌ను సక్సెస్​ చేశారు.

అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈ రోజు భారతదేశంలో నేషనల్​ హైవేల నిర్మాణం జరిగింది. హైదరాబాద్​ నుంచి ఎక్కడికెళ్లినా ప్రపంచస్థాయి రోడ్లు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత ప్రధాని మోదీది. తెలంగాణలో రూ.1లక్షా 50 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. 40 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో ఆధునీకరిస్తున్నారు. కాంగ్రెస్​ హయాంలో ఒక్కటంటే ఒక్క రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధి​ చేయలేదు. 

త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసు. ధనికరాష్ట్రంగా మొదలైన తెలంగాణ లక్షల కోట్ల అప్పులపాలైంది. అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను ఎలా దెబ్బతీశారో చూశాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ ఏ రకంగా పనిచేసిందో మనం చూశాం. కేసీఆర్‌ను వద్దనుకొని, సోనియా గాంధీ మాటలు నమ్మి, ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్​ కు ఓటు వేస్తే.. గడిచిన ఏడాదిన్నరలో ప్రజల నమ్మకాన్ని ఎలా వమ్ము చేసిందో చూస్తున్నాం. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి.. వెన్నుపోటు పొడిచారు. అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను నమ్మేవాడు లేడని.. సీఎం రేవంత్​ రెడ్డి వాపోతున్నాడు. పరిపాలన చేతగాక.. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్​ చేతులెత్తేసింది. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్​ఎస్​ అలియాస్​ బీఆర్​ఎస్​ కావొచ్చు.. కాంగ్రెస్​ కావొచ్చు.. ​కేసీఆర్​ గానీ, రాహుల్​ గాంధీ కానీ.. విఫలమయ్యారు. తెలంగాణకు మేలు జరగాలంటే.. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. అమరుల ఆత్మలు శాంతించాలంటే.. ప్రధాని మోదీ నేతృత్వంలో బిజెపితోనే సాధ్యం. తెలంగాణకు ఏకైక రక్ష బిజెపి. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలి.’’ అని అన్నారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మోదీతో అనేకసార్లు సమావేశం అయ్యాం. జీఎస్టీ అమలు తీరు పరిశీలన కోసం ఆస్ట్రేలియా వెళ్ళాం. వాళ్ళు మా దేశంలో అక్షరాస్యత ఎక్కువ, టాక్స్ ఎక్కువ కడతారు, రాజకీయ చైతన్యం ఉంది, మీదగ్గర ఇవేమీ లేదు, మీరెలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. కానీ మోదీ అమలు చేసి చూపించారు. జీఎస్టీని అమలు చేసే దమ్ము కాంగ్రెస్‌కు లేకపోతే మోదీ అమలు చేసి చూపించారు. అప్పుడు పన్నాదాయం రూ.73 వేల కోట్లు వస్తే ఇప్పుడు రూ.2.40 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో పలుదేశాల అధ్యక్షులు కంటతడి పెడితే మోదీ భారత ప్రజలకు ధైర్యం నింపారు. గ్రామాలలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చేదే. జమ్ములో ఆర్టికల్ 370 రద్దు కోసం ప్రాణత్యాగం చేసిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని మోదీ సాధించారు. డిజిటల్ లావాదేవీల్లో అమెరికా కంటే ముందున్నాం. సౌదీలో కూడా మన వారి కోసం దేవాలయం కట్టించారు. మంచి నాయకుడు ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేందుకు మోదీ పాలన ఉదాహరణ. కేసీఆర్ అహంకారంతో మోదీని ఏం ముఖం పెట్టుకొని వస్తావని ప్రశ్నించారు. ఇదే వ్యక్తి మోదీని అసెంబ్లీలో పొగిడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఖతం పట్టించారు. బిజెపి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. ఆ పేరుతో అవినీతికి వ్యతిరేకం.’’ అని అన్నారు. డా. కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మోదీ హయాంలో జనగణనలో కులగణన చేసేందుకు నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ.11 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు.