కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే… తెలంగాణకు బిజెపినే అండ
జూలై 12న రంగారెడ్డి రూరల్ జిల్లా శంషాబాద్ లో జరిగిన బిజెపి తెలంగాణ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షోపన్యాసం
తెలంగాణ రాష్ట్రంలో నవంబరు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలు, 2024 ఏప్రిల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత జరగుతోన్న విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయించి, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలందరికీ బిజెపి రాష్ట్ర పార్టీ తరఫున వందనాలు.
ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాగ్రహానికి గురై ఓటమిపాలైంది. అనుకోనివిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పది సంవత్సరాల పాటు బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బిజెపి కార్యకర్తలు నిరంతర పోరాటాల్లో నిమగ్నమై బాగా కష్టపడిన ఫలితంగా 2018లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన మన పార్టీ ఈ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 7 శాతం మాత్రమే ఉన్న ఓట్లుకు 15 శాతానికి పెంచుకోగలిగాం. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి 8 లోక్ సభ స్థానాల్లో విజయాన్ని అందించారు. 46 శాసనసభ స్థానాల్లో ఆధిక్యంతో పాటు, 44 స్థానాల్లో రెండో స్థానాన్ని ఇచ్చి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిజెపియే ప్రధాన ప్రత్యామ్నాయమనే తీర్పునిచ్చారు. శాసనసభ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ మనం అనేక ఉద్యమాలు నిర్వహించాం. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటాలు చేశాం. ఫలితంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నప్పటికీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ‘బీఆర్ఎస్-బిజెపి ఒక్కటే’ననే తప్పుడు ప్రచారం, అమలుకు నోచుకోలేని గారడీ గ్యారంటీల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. శాసనసభ ఎన్నికల తర్వాత వెంటనే పార్లమెంటు ఎన్నికల కోసం కార్యకర్తలందరు శ్రమించిన ఫలితంగా 5 నెలల్లో పార్లమెంటు ఎన్నికల్లో మంచి విజయం సాధించాం. ఇది పూర్తిగా కార్యకర్తల విజయం. మోదీ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకున్న నమ్మకాన్ని ప్రతిబింబించేలా, 1980లో బిజెపి ఏర్పడినప్పటి నుంచి మొదటిసారిగా బిజెపి తెలంగాణ ప్రాంతంలో 8 పార్లమెంటు సీట్లు గెలవడమే కాక, 35 శాతం పైగా ఓట్లు సాధించడం, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసీటు కూడా పొందలేక మూడో స్థానంలోకి నెట్టివేయబడటం రాబోయే రోజుల్లో మారనున్న తెలంగాణ రాజకీయాలకు దిక్సూచిగా మారింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బిజెపిదే అధికారం. రాష్ట్రంలో అనేక తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. సోనియాగాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు 6 గ్యారంటీలు, 13 వాగ్దానాలు, 66 అంశాలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని చెప్పి 7 నెలల పాలన పూర్తయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకపోవడం దురదృష్టకరం.
ఎన్నికలకు 18 నెలల ముందే వరంగల్ పట్టణంలో రైతు డిక్లరేషన్ పేరుతో, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ పేరుతో, నాగర్ కర్నూల్ జిల్లాలో మహిళా డిక్లరేషన్ పేరుతో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి నేటికీ గ్యారంటీలు అమలు చేయక రైతులను, యువతను, మహిళలను, విద్యార్థులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలను దగా చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుచేతనే అతితక్కువ కాలంలో ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ, అప్రజాస్వామిక విధానాల వల్ల రాష్ట్రం రావణకాష్టంలా మారింది. ధర్నాలు, నిరసనలు, అరెస్టులు, లాఠీచార్జ్ లతో అట్టుడుకుతోంది. ప్రజాపాలనపై సోయిలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులే ప్రధాన కార్యాచరణగా ముందుకెళ్తున్నది. గత బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రజా తీర్పునకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నది. తాము మేనిఫెస్టోలో పెట్టిన పాంచ్ న్యాయ్ టెన్త్ షెడ్యూల్ లో శాసనసభ్యులు లేదా పార్లమెంటు సభ్యులు పార్టీ మారితే డిస్ క్వాలిఫై చేయాలన్న కాంగ్రెస్, రాహుల్ గాంధీ పెట్టిన ఎజెండాను తుంగలో తొక్కి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కాంగ్రెస్లో చేర్చుకుంటున్న అనైతిక వైఖరి మనం చూస్తున్నాం.
తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండు పార్టీలు ఓట్ల కోసం కులాల కుంపట్లు, మతాల మధ్య మంటలు రగులుస్తున్నాయి. ఆ మంటల్లో చలి కాచుకుంటున్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటకాగడం ఎంఐఎంకి అలవాటే. ఆఖరుకు పార్లమెంటులో సైతం జై పాలస్తీనా అన్న ఎంఐఎం నాయకుడితో అంటకాగుతున్న ఈ రెండు పార్టీలు ఏ దేశభక్తులో, ఏ రకమైన సెక్యులరిస్టులో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. లోక్ సభ ఎన్నికల సమయంలో పదేపదే భారత రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని బిజెపిపై అభాండాలు వేసింది కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చింది కాంగ్రెస్ పార్టీయే. అంబేద్కర్ రాజ్యాంగంలో లేని సోషలిజం, సెక్యులరిజాన్ని ఎమర్జెన్సీ కాలంలో చేర్చి, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల మౌళిక, పౌర హక్కులను తుంగలోతొక్కిన కాంగ్రెస్ పార్టీకి బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదు. రాష్ట్రాల్లోని కాంగ్రెస్సేతర ప్రభుత్వాలను కూలగొట్టడం కొరకు 69 సార్లు రాజ్యాంగ సవరణ చేసి, 90 సార్లు 356 అధికరణను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి, రాజ్యాంగ హక్కులను కాలరాసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపించినంత మాత్రాన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తమ నిజస్వరూపం ప్రజలకు తెలియదనుకోవడం అవివేకమే. ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే అన్నట్లు రాజ్యాంగాన్ని అనేక రకాలుగా కాలరాసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. ఇప్పుడేమో రాజ్యాంగ రక్షకులమంటూ అసత్యాలు మాట్లాడుతున్నారు. గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రజలకు చెప్పిందే చేసింది. చేసేదే చెప్పింది. గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే మోదీ గ్యారంటీ అనేది ప్రజలకు వంద శాతం అర్థమైంది. నీళ్లేవో పాలేవో తేటతెల్లమైపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 7 నెలల కాంగ్రెస్ పాలన, కేంద్రంలో బిజెపి పాలనపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా, ఏ అభివృద్ధి జరిగినా అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగిందే. ఇవాళ పల్లెల్లో ఇంటింటికీ ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉచిత టాయిలెట్లు, ముద్ర లోన్లు, గ్రామీణ సడక్ యోజన కింద వేసే రోడ్లు, హైమాస్ లైట్లు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, రైతులకు ఎకరానికి రూ.18 వేల చొప్పున ఇచ్చే ఎరువులపై సబ్సిడీ, ప్రతి రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి, గ్రామ పంచాయతీలకు నిధులు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, స్మార్ట్ సిటీ నిధులు, నేషనల్ హైవేస్.. ఇవన్నింటికీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తెలంగాణను అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా ఒకవైపు సహకరిస్తుంటే, గత పదేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ కుటుంబ పాలన అభివృద్ధిని కుంటు పడేసి, అవినీతిలో కూరుకుపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడని రంగం లేదు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియాలో కూరుకుపోయి ప్రజాధనాన్ని, రాష్ట్ర ఖజానాను లూటీ చేశారు. పర్యావసానంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు దాపురించాయి. నాటి బీఆర్ఎస్ నాయకులు కమీషన్ల కక్కుర్తితో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేశారు. ఆఖరుకు ఇప్పుడే పుట్టిన బిడ్డ నెత్తిన సైతం లక్షల రూపాయల అప్పుమూటను మోపారు. తామేమి తక్కువ కాదన్నట్లుగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ RG Tax/ R-Tax/UK Tax/BV Tax పేరుతో వసూళ్లకు తెగబడి దిల్లీకి మూటలు మోసే పనిలో పడింది. పదేండ్లు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణను దోచుకుంటోంది. పరిపాలనను పక్కనబెట్టి భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, కమీషన్లు, పర్సంటేజీల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును పోటీలు పడి ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల దాకా దిల్లీకి కప్పం కట్టే పనిలో బిజీ అయిపోయారు కాంగ్రెస్ నాయకులు. పేరు మారిందే తప్ప పెద్దగా బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా లేదనేది ప్రజలకు అర్థమైంది. ప్రజల కోసం, అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం పాటుపడే పార్టీ బిజెపియేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలు మన వైపు చూస్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఆఖరి పౌరుడి వరకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించగలిగితే, రాష్ట్రంలోని అవినీతి పరిపాలనను ఎండగట్టగలిగితే ప్రజాక్షేత్రంలో ప్రజల వెన్నంటి ఉండి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయగలిగితే మనం రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయం. కొన్నాళ్లలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బిజెపి ఎవరూ ఊహించని అనూహ్య ఫలితాలను సొంతం చేసుకోవడం ఖాయం. ఆ దిశగా గత పదేండ్లుగా ఎంతో ఉత్సాహంతో, బాధ్యతతో పార్టీ ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన కార్యకర్తలంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటూ, మీతో పాటు మీ వెన్నంటి ఉంటానని హామీ ఇస్తూ…
భారత్ మాతా కీ జై

