తెలంగాణలో బిజెపిని నెం. 1 చేసే ప్రణాళిక ఉంది
తెలంగాణలో బిజెపి నెంబర్ వన్ పార్టీగా అవతరించేందుకు 1500 రోజుల ప్రణాళిక ఉందని కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అనేది పదవుల కోసం కాదని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీకి కొత్త శకం మొదలైందని తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా బిజెపి ప్రాబల్యమేంటో బిజెపి ఉత్తర భారతదేశానికే పరిమితమని విమర్శించిన వారికి అర్థమైంది. దక్షిణ భారతంలో బిజెపి మరింత బలపడిందని, కేరళలో ఖాతా తెరిచిందని, తమిళనాడులో మెరుగైన ఓటు శాతం సాధించిందని అన్నారు. జూలై 12 రంగారెడ్డి రూరల్ జిల్లా శంషాబాద్ లో జరిగిన బిజెపి తెలంగాణ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో ధర్మేంద్ర ప్రదాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ధర్మేంద్ర ప్రదాన్ ప్రసంగిస్తూ దేశంలో అనేక మంది కార్యకర్తల కృషితో నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే సర్కారు సాకారమైందని అన్నారు. ‘‘తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 % ఓట్లు సాధిస్తే ఈసారి 35శాతం ఓట్లు గెలుచుకున్నాం. గతంలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించిన ప్రజలు .. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లను అందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద సీట్లు దాటలేదు. 13 రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. అహంకారంగా మాట్లాడుతున్నారు. మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఇండీ కూటమికి నాయకత్వమే లేదనేది రుజువైంది. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమానపరుస్తోంది. కానీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ బిజెపిపై దుష్ప్రచారం చేస్తోంది. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా రిజర్వేషన్లకు ఎటువంటి ఢోకా లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోంది. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం బిజెపి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసింది. పదేళ్లుగా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూనే ఉంది. తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్ లో భారతీయ జనతా పార్టీని మరింత బలపర్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. యువత, మహిళలు, రైతులు, పేదల శ్రేయస్సు అకుంఠిత పరిశ్రమతో, గొప్ప సంకల్పంతో పని చేయాలి. కాంగ్రెస్-బీఅర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిలదీసి పోరాటం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని నెంబర్ 1 పార్టీగా ఎదిగేలా కార్యకర్తలు సంకల్పంతో పని చేయాలి. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి. రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి.’’ అని ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు.

