రాహుల్… దమ్ముంటే ఓయూలో తిరగగలవా?
‘‘బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి నేను సవాల్ చేస్తున్నా… మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా… ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా?’’ అంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘‘6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాలను గుర్తించి బిజెపికి 8 ఎంపీ సీట్లు అందించి తెలంగాణలో బిజెపియే ప్రత్యామ్నాయం అని తీర్పునిచ్చిన తెలంగాణ ప్రజలకు ఇదే నా సెల్యూట్’’ అని వ్యాఖ్యానించారు. జూలై 12న రంగారెడ్డి రూరల్ జిల్లా శంషాబాద్ లో జరిగిన బిజెపి రాష్ట్ర విస్త్రత కార్యవర్గ సమావేశంలో 3వ సారి మోదీ ప్రభుత్వానికి అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశానికి వచ్చిన వారందరూ లేచి నిలబడి తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ ‘‘తెలంగాణ ప్రజలకు, బిజెపికి విడదీయరాని బంధముంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో డా. కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో 4 ఎంపీ సీట్లను అందించారు. మొన్నటి ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు అందించి కాంగ్రెస్ కు బిజెపియే ప్రత్యామ్నాయం అని నిరూపించారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా అన్నింటినీ భరిస్తూ, తెగిస్తూ పోరాడుతున్నందునే బిజెపి పట్ల తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి మోసపోయారని తెలుసుకున్న ప్రజలు 8 ఎంపీ సీట్లు గెలిపించి మోదీకి పట్టం కట్టారు. ఎంపీ ఎన్నికల్లో జవాన్ ను అడిగినా, మహిళలను అడిగినా, చివరకు సామన్య ప్రజలను ఎవరిని అడిగినా ‘మోదీ’యే మాకు గ్యారంటీ అని చెబుతున్నారు. వార్డు మెంబర్ నుండి ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా మోదీయే గ్యారంటీ అని చెబుతూ బిజెపికి ఓటేశారు.
మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. ఈ దేశానికి గ్యారంటీ మోదీయేనని నిరూపించారు. మోదీ స్పూర్తితో తెలంగాణలోనూ రామరాజ్యం రావాలని ప్రజలు భావిస్తున్నారు. బిజెపి కార్యకర్తలు చేసిన పోరాటాలు మరువలేనివి. ఎన్ని కేసులు ఎదురైనా తెగించి కొట్లాడారు. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మోదీ సంక్షేమ పథకాలను, విజయాలను వివరించి పని చేశారు. కార్యకర్తల కష్టార్జితంతోనే బిజెపి అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు తమ భుజంపై కాషాయ జెండాను మోశారు. వారందరికీ నా సెల్యూట్
తెలంగాణలో కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండాలని ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే… ఈ దేశ ప్రజల బతుకులు బాగుపడాలంటే మోదీయే ప్రధానిగా ఉండాలని బిజెపికి ఓటేశారు.. ఈసారి తెలంగాణలోనూ అధికారంలోకి రాబోయేది బిజెపి మాత్రమేనని ఘంటాపథంగా చెబుతున్నా. మోదీ ఇచ్చిన మాట తప్పని వ్యక్తి. ప్రధాని కాగానే కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేశారు. కనీస మద్దతు ధర పెంచారు. సబ్సిడీలపై ఎరువులను పంపిణీ చేస్తున్నారు.
గెలిచి 7 నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిది. మోదీ రోజ్ గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయినా బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ చెప్పడం సిగ్గు చేటు. బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసినా, రాజ్యాంగాన్ని మార్చేస్తారని అబద్ధాలను ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోకుండా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టారు. మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న.’’ అని అన్నారు.