Modi at Independence Day

లౌకిక పౌరస్మృతికి సమయం ఆసన్నమైంది

Modi at Independenceదేశంలో అమలవుతున్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షాపూరితంగా ఉందని, లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తద్వారా మత వివక్ష తొలగి, పౌరుల మధ్య అంతరం తగ్గుతుందన్నారు. తరచూ ఎన్నికల నిర్వహణ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, అన్నిరకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా ‘ఒక దేశం – ఒకే ఎన్నిక’ సాకారం చేసుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. మా సంస్కరణల ప్రక్రియ బలవంతం వల్ల కాదని, దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో నడుస్తుందన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న దిల్లీలోని ఎర్రకోటపై మోదీ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరసగా ఇది 11వసారి. కోట బురుజులపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా 98 నిమిషాల పాటు ప్రసంగించారు. గతంలో ఏ ప్రధాని ఇంత సుదీర్ఘంగా ప్రసంగించలేదు. ఈ ప్రసంగంలో మోదీ ప్రభుత్వ విజయాలను, వికసిత భారత్‌ లక్ష్యాలను ప్రజల ముందుంచారు. మోదీ పంద్రాగస్టు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

మన దేశంలో సుప్రీంకోర్టు పలుమార్లు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అంశాన్ని ప్రస్తావించింది. మన జనాభాలో గణనీయ శాతం నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ అనేక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆ మేరకు ప్రస్తుత పౌరస్మృతి ఒక మతానికి సంబంధించిన సివిల్ కోడ్‌ను పోలి ఉందని, అది వివక్షాపూరితమని స్పష్టమైంది. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మార్పును ప్రతిపాదిస్తున్నందున ఈ అంశంపై విస్తృతంగా చర్చించాలి. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను సాకారం చేయడం మన సమష్టి బాధ్యత. విభిన్న అభిప్రాయాలను, దృక్పథాలను స్వాగతించాలి. మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టే, వివక్షను పెంచే చట్టాలకు ఆధునిక సమాజంలో స్థానం లేదు. అందువల్ల దేశం లౌకిక పౌరస్మృతిని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మార్పు ద్వారా మత వివక్ష తొలగిపోయి, పౌరుల మధ్య అంతరం తగ్గుతుంది.

భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా, పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన విధులపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. 140 కోట్ల మంది పౌరులు తమ కర్తవ్యాన్ని కూడా గుర్తించడం చాలా అవసరం. మనమంతా సమష్టిగా మన బాధ్యతలను నిర్వర్తిస్తే ఒకరి హక్కులను మరొకరు పరిరక్షించినవారం అవుతాం. తద్వారా ఎలాంటి అదనపు శ్రమ లేకుండా సహజంగానే హక్కులను పరిరక్షిస్తాం. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, మన సమష్టి శక్తిని పెంపొందించి, కొత్త శక్తితో ముందుకు నడిపించే ఈ మనస్తత్వాన్ని మనం స్వీకరిస్తాం. 

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ రావాలి

దేశంలో వారసత్వ రాజకీయాలు, కులతత్వం భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని చేస్తున్నాయి. వీటి నుంచి దేశాన్ని, రాజకీయాలను విముక్తం చేయాలి. వీలైనంత త్వరగా లక్ష మంది యువతను ప్రతినిధులుగా రాజకీయ జీవితంలోకి తీసుకురావాలి. రాజకీయ నేపథ్యం లేని… అంటే- తల్లిదండ్రులు, తోబుట్టువులు, మామలు, అత్తలు రాజకీయ నాయకులు కాని కుటుంబాల నుంచి లక్షమంది యువతను ముందుకు తేవాలనుకుంటున్నాం. కొత్త రక్తం కావాలి… పంచాయతీ, మునిసిపల్ కార్పొరేషన్లు, జిల్లా కౌన్సిళ్లు, రాష్ట్ర అసెంబ్లీలు, లోక్‌సభలోకి అలాంటి ప్రతిభావంతులైన యువత కావాలి. ఫలానా పార్టీ అనేదేదీ లేకుండా నచ్చిన పార్టీలో చేరి ప్రతినిధులుగా మారాలి. అలాంటివారు లక్ష మంది సమీప భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థలో ప్రవేశిస్తే ప్రజాస్వామ్యం సుసంపన్నం కావడమే కాకుండా కొత్త ఆలోచనలకు, కొత్త సామర్థ్యాలకు దారితీస్తుందన్నది వాస్తవం. కాబట్టి, మనం ఈ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తరచూ ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతోందని, అవరోధాలు వస్తున్నాయని కూడా చెప్పదలిచాను. దేశంలో ప్రతి మూడు.. ఆరు నెలలకోసారి ఎన్నికలు వస్తున్నందున ప్రతి పథకం వాటితో ముడిపెట్టడం సులువైంది. ఎప్పుడు ఏ పథకాన్ని ప్రకటించినా అది ఏదో ఒక ఎన్నికలతో ముడిపడి ఉందన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. ప్రతి పథకానికీ ఎన్నికల రంగు పులుముతున్నారు. దీనిపై దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయం వెల్లడించాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను స్వీకరించేందుకు దేశం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టే, ఈ నినాదం సాకారమయ్యేలా రాజకీయ పార్టీలు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నవారు ముందుకు రావాలి. భారతదేశ పురోభివృద్ధికి, దాని వనరులను సామాన్యుల కోసం గరిష్ఠంగా వినియోగించడానికి ఈ ముందడుగు అత్యంత అవశ్యమని త్రివర్ణ పతాకం సాక్షిగా ఎర్రకోట బురుజుల నుంచి కోరుతున్నాను.

భారతదేశానికి స్వర్ణయుగం

దేశంలో కొత్త వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయి. దేశ ప్రగతి కోసం అనేక ఆర్థిక విధానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి, ఈ కొత్త వ్యవస్థలపై దేశ విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. దేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది,దేశం పట్ల ప్రపంచ వైఖరి మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన యువతకు అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లుగా మనకు అందని లెక్కలేనన్ని కొత్త ఉద్యోగావకాశాలు ఇప్పుడు వారి ముంగిట ఉన్నాయి. భారతదేశానికి ఇది స్వర్ణయుగం. 

గత దశాబ్ద కాలంలో 10 కోట్ల మంది సోదరీమణులు మహిళా స్వయం సహాయక సంఘాల్లో భాగమయ్యారు. సాధారణ గ్రామీణ కుటుంబాలకు చెందిన 10 కోట్ల మంది మహిళలు ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రంగా, స్వయం సమృద్ధిగా మారుతున్నారు. కోటి మంది మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరి ‘లఖ్ పతి దీదీ’లుగా మారారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించే నిధులను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని నిర్ణయించాం. ఇప్పటి వరకు ఈ స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల ద్వారా మొత్తం తొమ్మిది లక్షల కోట్ల నిధులు అందించాం.

మన అభివృద్ధిని వేగవంతం చేసిన మరో రెండు పురోగతులపైనే మనం దృష్టి పెట్టాలి. మొదటిది ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీనిలో మనం అంచెలంచెలుగా ఎదిగాం. రెండోది జీవన సౌలభ్యం, సామాన్య ప్రజలకు కూడా సరసమైన గౌరవప్రదమైన జీవనశైలి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. గత దశాబ్ద కాలంలో అత్యాధునిక రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పటిష్టమైన రహదారులు, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించడం ద్వారా ప్రతి గ్రామానికి, అటవీ ప్రాంతాలకు కూడా పాఠశాల లభించేలా సౌకర్యాలు కల్పించడం, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించడానికి సుదూర ప్రాంతాల్లో ఆధునిక ఆసుపత్రులు, ఆరోగ్య మందిరాలు నిర్మించడం వంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా అపారమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూశాం. అనేక వైద్య కళాశాలలు, ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ‘అమృత్ సరోవర్స్’ను పునరుద్ధరించడం ద్వారా అరవై వేల చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేశాం. కాలువల భారీ నెట్వర్క్ కారణంగా ఇప్పుడు చాలా మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 4 కోట్ల పక్కా ఇళ్లు పేదలకు కొత్త జీవం పోశాయి. మరో 3మూ కోట్ల కొత్త ఇళ్లకు హామీ ఇవ్వడం జరిగింది.

మన ఈశాన్య భారతదేశం ఇప్పుడు వైద్య మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉంది. మారుమూల గ్రామాలను, సరిహద్దులను కలుపుతూ రహదారులు నిర్మించి ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చాం. ఈ పటిష్ఠమైన మౌలిక సదుపాయాల నెట్ వర్క్ ద్వారా దళితులు, దోపిడీకి గురైన, అణగారిన, వెనుకబడిన, గిరిజనులు, అడవిలో నివసిస్తున్న వారు, అడవులు, కొండలు, సుదూర సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారి అవసరాలను తీర్చగలిగాం. 

(ఉచిత) విద్యుత్తు, నీరు, గ్యాస్ (కనెక్షన్లు)ఇప్పుడు 100 శాతం సరిపడా ఉన్నాయి. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేలా మేం చర్యలు తీసుకున్నాం. గతంలో ప్రభుత్వం వేలాది నిబంధనలతో సాధారణ పౌరులపై భారం మోపేది. పౌరులు చట్టపరమైన సంక్లిష్టతల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండడానికి మేము 1,500 చట్టాలను తొలగించాము. చిన్న చిన్న పొరపాట్లకు ప్రజలను జైలుకు పంపే చట్టాలు ఉండేవి. శతాబ్దాల క్రితం నాటి నేర చట్టాల స్థానంలో (భారతీయ) న్యాయ సంహిత పేరిట కొత్త నేర చట్టాలను తీసుకొచ్చాం. ఇందులో ప్రధాన అంశం శిక్ష కాదు; పౌరులకు న్యాయం చేయాలనే భావన.

సంస్కరణలతో అవకాశాలు

2047 నాటికి వికసిత భారత్ కల సాకారం కావాలంటే పాలన సంస్కరణలు ఆవశ్యకం. ఈ సంస్కరణలతో ప్రజల జీవితాల్లో అవకాశాలను సృష్టిస్తూ, అవరోధాలను తొలగిస్తూ ముందుకు సాగాలి. పౌరులు తమ జీవితాల్లో గౌరవం పొందాలి; పంచాయతీలు, నగర పంచాయతీలు, నగర పాలికలు, మహానగర పాలికలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లాలు లేదా కేంద్రం ఏదైనా సరే, ఈ 3 లక్షల విభాగాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈసంస్థలన్నిటికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను: మీ స్థాయిలో ప్రతి ఒక్కరూ సామాన్యులకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఏడాదికి రెండు సంస్కరణలు చేపట్టండి; అది పంచాయితీ అయినా, రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా ఏ శాఖ అయినా ఏడాదికి రెండు సంస్కరణలు అమలు చేసి ఆచరణలో పెట్టండి. దీనివల్ల ఏటా 25-30 లక్షల సంస్కరణలు రావచ్చు. 25-30 లక్షల సంస్కరణలు చేస్తే సామాన్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కొత్త ఆత్మవిశ్వాసం మన దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నేడు మన దేశం ఆకాంక్షలతో నిండి ఉంది. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఘనతను సాధించాలని మన దేశ యువత ఉవ్విళ్లూరుతోంది. కాబట్టి, మూడు కీలక రంగాలపై దృష్టి పెడుతూ, ప్రతి రంగంలో పురోగతిని వేగవంతం చేయడమే మన లక్ష్యం. మొదటిది, మనం అన్ని రంగాలలో కొత్త అవకాశాలను సృష్టించడం. రెండవది, వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి అవసరమైన సహాయక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. మూడోది, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చి, మన పౌరులకు మెరుగైన జీవన స్థితిగతులు కల్పించడం. ఈ మూడు అంశాలు భారత్‌లో అభిలషణీయ సమాజాన్ని సృష్టించాయి. ఫలితంగా ఆత్మవిశ్వాసంతో నిండిన సమాజం ఏర్పడింది. ఉపాధిలో, స్వయం ఉపాధిలో కొత్త రికార్డులు నెలకొల్పడంలో మనం గణనీయమైన పురోగతి సాధించాం. నేడు మన తలసరి ఆదాయం రెండింతలైంది. 

అంతర్జాతీయ ప్రగతిలో భారత్ పాత్ర గణనీయంగా ఉంది, మన ఎగుమతులు నిరంతరం పెరుగుతున్నాయి, మన విదేశీ మారక నిల్వలు రెట్టింపయ్యాయి, అంతర్జాతీయ సంస్థలు భారత్ పై ఎక్కువగా నమ్మకముంచాయి. కరోనా విపత్తులో ఆర్థిక వ్యవస్థను వేగంగా మెరుగుపరచుకున్న దేశమేదైనా ఉందంటే, అది భారత్ మాత్రమే. కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడిస్తుండడం దేశం సరైన దిశలో పయనిస్తోందనడానికి నిదర్శనం. గ్రామాలు, కొండలు, అడవుల్లోని వివిధ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పీఎం జన్ మాన్ పథకాల ప్రయోజనాలు అందేలా చూస్తున్నాం. మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించాం. పారాలింపిక్స్‌లో మన క్రీడాకారులు అత్యద్భుతంగా రాణించడం అబ్బురపరుస్తోంది. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లింగ పరివర్తిత వ్యక్తుల (ట్రాన్స్ జెండర్లు) సమాజంపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చి; హోదా, గౌరవం, సమానత్వాన్ని కల్పించేలా సవరణలు చేయడం, కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా పలు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా, మార్పు దిశగా మనం సరైన మార్గంలో ముందుకు సాగుతున్నాం. ‘త్రివిధ మార్గాల్లో’ మొదలైన మనం సార్వత్రిక సేవాభావం ప్రత్యక్ష ప్రయోజనాన్నిచూస్తున్నాం.

విశ్వాసలేమి నుంచి ఆత్మవిశ్వాసం వరకు

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఒక దేశంగా మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని మరచిపోకూడదు. ‘చల్తా హై’ (నడిచిపోతుంది లే) అనే మన వైఖరి, యథాతథ స్థితిని అంగీకరించడమే ఇందుకు కారణం. మార్పును అమలు చేయడంలో మనం విశ్వసించం లేదా పాల్గొనం. ప్రస్తుత స్థితిని సవాలు చేయం. కొత్తగా ఏమీ చేయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతోనే జీవించాలన్న స్థితిగతుల వాతావరణం ఏర్పడింది. ప్రజలు ఏమీ జరగబోదని నమ్మేవారు. ఈ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వచ్చింది. మనలో ఆత్మవిశ్వాసం నింపాలి, ఆ దిశగా ప్రయత్నాలు చేశాం. మా సంస్కరణల ప్రక్రియ బలవంతం వల్ల కాదు, దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో నడుస్తుంది. అందువల్ల, ఈ రోజు, మన సంస్కరణల మార్గం వృద్ధికి బ్లూప్రింట్ గా మారింది.

Modi at Independenceబ్యాంకింగ్ రంగంలో అభివృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు. జరుగుతున్న కార్యకలాపాలు మన బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టాయి. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు అమలు చేశాం. ఫలితంగా నేడు మన బ్యాంకులు ప్రపంచంలోని ఎంపిక చేసిన బలమైన బ్యాంకుల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. బ్యాంకులు బలపడినప్పుడు, అధికారిక ఆర్థిక వ్యవస్థ శక్తి కూడా బలపడుతుంది. ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడినప్పుడు, సామాన్య పేదల అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను తీర్చడానికి ఇది గొప్ప శక్తిగా మారుతుంది.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తు “తల్లి-తండ్రి” సంస్కృతి వేళ్లూనుకుంది, ఇక్కడ ప్రజలు నిరంతరం ప్రభుత్వానికి విన్నవించవలసి వచ్చింది, ఉపకారాలు కోరవలసి వచ్చింది. సూచనలు లేదా సిఫార్సులపై ఆధారపడవలసి వచ్చింది. నేడు ఆ పాలనా నమూనాను మార్చాం. ఇప్పుడు ప్రభుత్వమే లబ్ధిదారులకు చేరువవుతోంది. ప్రభుత్వమే వారి ఇళ్లకు గ్యాస్ స్టవ్ లను పంపిణీ చేస్తుంది, వారి గృహాలకు నీటి సరఫరాను తీసుకువస్తుంది, విద్యుత్తును అందిస్తుంది, అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరేలా వారిని ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.

సామాజిక నిర్మాణంలో మార్పులు కొన్నిసార్లు గణనీయ సవాళ్లకు దారితీస్తాయి. అన్ని స్థాయులలో అవినీతి చెదపురుగు మన వ్యవస్థపై సామాన్యుల నమ్మకాన్ని దెబ్బతీసింది. అందుకే అవినీతిపై విస్తృత యుద్ధానికి శ్రీకారం చుట్టాను. అవినీతిపరులకు భయానక వాతావరణం సృష్టించాలని అనుకుంటున్నాను. తద్వారా సామాన్య పౌరుడిని దోచుకునే సంప్రదాయానికి ముగింపు పలకాలి. మనదేశంలో కొందరు అవినీతిని కీర్తిస్తున్నారు, బహిరంగంగానే అభినందిస్తున్నారు. సమాజంలో అవినీతి బీజాలు నాటేందుకు, దాన్ని గొప్పగా చిత్రించేందుకు, అవినీతిపరులను సమాజం అంగీకరించే స్థాయికి చేరేలా నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఆరోగ్యకర సమాజానికి అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారాయి. అవినీతిపరులకు దూరంగా ఉండటం ద్వారా వారు ఆ మార్గంలో వెళ్లడానికి భయపడే వాతావరణం సృష్టించవచ్చు. ఏదేమైనా అవినీతిని కీర్తిస్తే ప్రస్తుతం నిజాయితీగా ఉన్నవారు కూడా దానిని ప్రతిష్ఠకు చిహ్నంగా చూడటం ప్రారంభిస్తారు. అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యమనే అపోహ ఏర్పడుతుంది.

21వ శతాబ్దపు అవసరాలను తీర్చే విద్యావిధానం

మనం చిన్నచిన్న విజయాలకు ఆనందించే వ్యక్తులం కాదు. కొత్త జ్ఞానాన్ని, వైభవాన్ని పొందాలనుకునే సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం; ఉన్నత విజయాల కోసం నిరంతరం పరితపించేవాళ్లం. అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాం. నూతన విద్యావిధానం ద్వారా 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత విద్యావిధానంలో పరివర్తన తేవాలనుకుంటున్నాం. వేగవంతమైన అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశంలో భవిష్యత్ సంసిద్ధత గల నైపుణ్య వనరులను మనం సిద్ధం చేయాలి. దేశంలో కొత్త ప్రతిభావంతులను గుర్తించడంలో నూతన విద్యావిధానం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. మన దేశ యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అంతే కాదు, విదేశాల నుంచే భారతదేశానికి వచ్చేలా ప్రజలను ఆకట్టుకునే సంస్థలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నాం. ఇటీవల, నలందా విశ్వవిద్యాలయ పునర్నిర్మాణం ద్వారా బీహార్ ఘనమైన చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించాం. నలంద విశ్వవిద్యాలయం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. నూతన విద్యావిధానం మాతృభాష ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తోందని నేను బలంగా నమ్ముతున్నాను. భాష కారణంగా దేశంలో ప్రతిభకు అవరోధం కలగకూడదని రాష్ట్ర ప్రభుత్వాలను, దేశంలోని అన్ని సంస్థలను కోరుతున్నాను. భాష అడ్డంకి కాకూడదు. మన దేశంలోని నిరుపేద పిల్లలకు కూడా వారి కలలను సాకారం చేసే శక్తిని మాతృభాష అందిస్తుంది. కాబట్టి, మాతృభాషలో అధ్యయనం, జీవితంలో మాతృభాష పాత్ర, కుటుంబంలో దాని స్థానాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాలి.

నేడు నైపుణ్యాల ప్రాధాన్యం బాగా పెరిగింది. పరిశ్రమ 4.0ని దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాం. వ్యవసాయం సహా ప్రతి రంగంలో సామర్థ్యాన్ని పెంచడం కోసం నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలనుకుంటున్నాం. ఈసారి మరింత విస్తృత స్థాయిలో ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ లో ఇంటర్న్ షిప్ లకు ప్రాధాన్యం ఇచ్చాం. తద్వారా మన యువత అనుభవాన్ని పొందవచ్చు; వారి సామర్థ్యాన్ని పెంపొందించుకుని, మార్కెట్లో నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు. ఈ విధంగా నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయాలనుకుంటున్నాను. 

ప్రపంచం శరవేగంగా మారుతోంది, జీవితంలోని ప్రతి అంశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యం పెరుగుతోంది. మనం సైన్స్ కు పెద్ద పీట వేయాలి. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన తర్వాత మన పాఠశాలలు, కళాశాలల్లో శాస్త్రసాంకేతిక రంగాలపై కొత్త ఆసక్తి నెలకొంది. ఈ నవోత్సాహాన్ని మన విద్యా సంస్థలు పెంపొందించాలి. కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు కూడా చేయూతను పెంచింది. చట్టపరమైన ఛట్రంతో జాతీయ పరిశోధన సంస్థను ఏర్పాటు చేసి పరిశోధనను నిరంతరం బలోపేతం చేసేలా శాశ్వత వ్యవస్థను అభివృద్ధి చేశాం. దేశ యువత ఆలోచనలు సాకారమయ్యేలా పరిశోధన, ఆవిష్కరణలకు బడ్జెట్ లో రూ. లక్ష కోట్లు కేటాయించాం. 

సేంద్రియ ఆహారానికి కేంద్ర బిందువు

మన వ్యవసాయ వ్యవస్థలో పరివర్తన చాలా కీలకం, తక్షణ అవసరం. శతాబ్దాలుగా మనల్ని వెనక్కు నెడుతున్న కాలం చెల్లిన ఆచరణల నుంచి మనం విముక్తులం కావాలి. ఈ ప్రయత్నంలో మన రైతులకు క్రియాశీలకంగా సహకరిస్తున్నాం. నేడు రైతులు సులభంగా రుణాలు పొందేలా చూడడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారికి మేం చేయూత అందిస్తున్నాం. తమ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా రైతులకు సహకరిస్తున్నాం. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు కూడా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం. తద్వారా రైతులకు అన్ని విధాలా సహకారం అందుతుంది. ఈ దిశలో ముందుకు సాగడానికి మేం కట్టుబడి ఉన్నాం.

ఎరువుల వాడకం వల్ల మన నేలల సారం రోజురోజుకూ క్షీణించడాన్ని గమనిస్తున్నాం. అలాగే మన నేలల నుంచి ఉత్పాదకత కూడా క్షీణిస్తోంది. ఈ కీలక సమయంలో సేంద్రియ వ్యవసాయ మార్గాన్ని ఎంచుకుని, మన భూమాతను రక్షించే బాధ్యతను స్వీకరించిన దేశంలోని లక్షలాది మంది రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది బడ్జెట్ లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించి, చేయూత ఇవ్వడానికి మేం గణనీయమైన ఏర్పాట్లు చేసి, ప్రధాన పథకాలను ప్రవేశపెట్టాం. ప్రపంచ దేశాలకు సేంద్రియ ఆహారానికి కేంద్ర బిందువుగా ఉండేది నాదేశమే; ఈ ఉత్పత్తులను అందించేది దేశ రైతులే. అందుకే రాబోయే రోజుల్లో ఈ దార్శనికతతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం. తద్వారా, సేంద్రియ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతున్నందున మన దేశం ప్రపంచానికి సేంద్రియ ఆహార పాత్రగా మారవచ్చు. రైతుల జీవితాల్లో సౌలభ్యం, గ్రామాల్లో అగ్రశ్రేణి ఇంటర్నెట్ అనుసంధానత, రైతులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడడం, వారి పిల్లలకు అధునాతన పాఠశాలలతో పాటు ఉపాధి అవకాశాలు అందేలా భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఆవిష్కరణ అయినా, ఉద్యోగరంగమైనా, వ్యవస్థాపక రంగమైనా ప్రతి రంగంలో మహిళలు గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. భాగస్వామ్యాన్ని పెంచడమే కాదు, మహిళలు నాయకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. నేడు, చాలా రంగాల్లో — అది రక్షణ రంగం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, సైన్యం కావచ్చు, నౌకాదళం కావచ్చు లేదా అంతరిక్ష రంగం కావచ్చు — మహిళల శక్తి సామర్థ్యాలను గమనిస్తున్నాం. మన తల్లి, సోదరీమణులు, బిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఒక సమాజంగా మనం తీవ్రంగా ఆలోచించాలి. దేశంలో, పౌరుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాలు, సమాజం, దేశం ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై జరుగుతున్న నేరాలపై జాప్యం లేకుండా విచారణ జరపాలి. ఇటువంటి రాక్షస చర్యలకు పాల్పడే వారిపై విచారణ లేకుండానే కేసు నమోదు చేసి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, పౌర సమాజంపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి. అత్యాచార బాధితులైన తల్లీ కూతుళ్లనే మీడియాలో ప్రధానంగా చూపుతూ, సమాజంలో వారి గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు; అయితే, అత్యాచార నేరగాళ్లు వార్తల్లోకి ఎక్కడం లేదని కూడా చెప్పదలచుకున్నాను. ఇప్పుడు నేరస్థుల గురించి విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి తప్పక శిక్ష పడుతుంది. తద్వారా, అలాంటి దుష్కృత్యాలకు పాల్పడేవారు ఉరి శిక్ష సహా తదుపరి పర్యవసానాలకు భయపడతారు. ఈ భయాన్ని సృష్టించడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను.

గతంలో భారతదేశంలో బొమ్మలు కూడా దిగుమతి అయ్యేవి. కానీ, నేడు మన బొమ్మల పరిశ్రమ అంతర్జాతీయ విపణిలో పేరెన్నికగన్నదని గర్వంగా చెప్తాం. మనం బొమ్మలను ఎగుమతి చేయడం ప్రారంభించాం. ఒకప్పుడు మొబైల్ ఫోన్లు దిగుమతి అయ్యేవి. మొబైల్ తయారీ వ్యవస్థకు ఇప్పుడు భరత్ పెద్ద కేంద్రంగా ఉంది. మనం వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం మొదలుపెట్టాం. అదీ మన సత్తా. ప్రపంచ భవిష్యత్తు సెమీకండక్టర్లు, ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధతో ముడిపడి ఉంది. మనం సెమీకండక్టర్ మిషన్ ను ప్రారంభించాం. ప్రపంచానికి తక్కువ ధరల్లో లభించేలా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని ఆకాంక్షిస్తున్నాం. మన దగ్గర నైపుణ్యానికి కొదవలేదు; ఈ రంగంలో మన యువత లక్ష్యాలు భారీగా ఉండాలి. భారత్ పరిశోధన రంగంలో ఉంది; ఇప్పుడు తయారీ వైపు కూడా మళ్ళాలి. ఈ రంగంలో ప్రపంచానికి అన్ని దశల్లోనూ సేవలందించే సామర్థ్యం మనకుంది.

రక్షణ బడ్జెట్ లో ఏమాత్రం పెంపునైనా ప్రశ్నించడం మనకు అలవాటే. ఆ నిధులను ఎక్కడ వినియోగించారో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇతర దేశాల ఎగుమతులపై రక్షణ బడ్జెట్‌ను ఖర్చు చేశాం. రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధంగా మారడంలో మన దళాల నిబద్ధత పట్ల, వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు ఇకపై ఎగుమతులపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్న వస్తువుల జాబితాను అందించారు. ఈ స్ఫూర్తితో రక్షణ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. రక్షణ తయారీ రంగంలో కూడా భారత్ ఉనికిని చాటుకుంది. చిన్న వస్తువుల విషయంలోనూ దిగుమతులపై ఆధారపడిన మన రక్షణ రంగం క్రమంగా అభివృద్ధి చెంది ఎగుమతిదారుగా, వివిధ రక్షణ పరికరాల తయారీదారుగా మారింది. 

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం గొప్ప విజయాన్ని సాధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), సంస్కరణలు కూడా గణనీయమైన బలాన్ని చేకూర్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) గణనీయంగా అభివృద్ధి చెందాయి. తయారీ ప్రపంచంలో, ముఖ్యంగా పరిశ్రమ 4.0లో గొప్ప శక్తితో పురోగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాం. నైపుణ్యాభివృద్ధిలో కొత్త నమూనాలను ప్రవేశపెట్టాం.

ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఇదొక సువర్ణావకాశం. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు రూపొందించాలి. సుపరిపాలనపై భరోసా కల్పించి, శాంతిభద్రతలపై వారిలో విశ్వాసం పెంపొందించాలి. ప్రతి రాష్ట్రం ఆరోగ్యకరమైన పోటీ ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించాలి. ఈ పోటీ వల్ల ఆయా రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయి; స్థానిక యువతకు అవకాశాలు లభించి, ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

‘డిజైన్ ఫర్ ది వరల్డ్’ మన కల

మనమిప్పుడు డిజైన్ రంగంపై దృష్టి పెట్టాలి. ‘డిజైన్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యమివ్వాలి. భారతీయ ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పర్యాయపదంగా మార్చేందుకు కృషి చేయాలి. తద్వారా మన ఉత్పత్తులు ప్రపంచ ఆమోదం పొందడం సులభమవుతుంది. ఇది మన ఉత్పత్తులు, మన సేవలు, విధానాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మనం ముందుకు సాగాలంటే నాణ్యతపై దృష్టి పెట్టాలి. మనలో ప్రతిభ ఉంది… డిజైన్ రంగంలో ఎన్నో నవ్యావిష్కరణలను ప్రపంచానికి అందించగలం. ‘డిజైన్ ఇన్ ఇండియా’ నినాదాన్ని స్వీకరించి ‘డిజైన్ ఫర్ ది వరల్డ్’ అనే కలతో ముందుకు సాగాలి.

గేమింగ్ ప్రపంచంలోకి నవతరం ప్రతిభావంతులను తీసుకురాగలం. మన దేశంలో తయారయ్యే డిజిటల్‌ క్రీడలవైపు ప్రపంచవ్యాప్త బాలలను ఆకర్షించగలం. మన దేశపు బాలలు, యువత, ఐటీ నిపుణులు సహా కత్రిమ మేధ (ఎఐ) నిపుణులు గేమింగ్ ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నది ఆకాంక్ష. గేమింగ్ ప్రపంచాన్ని మన ఉత్పత్తులు ప్రభావితం చేయాలి. మన యానిమేటర్లకు ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగల సామర్థ్యం ఉంది. ఈ పరిశ్రమలో మన భాగస్వామ్యం కోసం ఇంకా శ్రమించాలి.

పర్యావరణ పరిరక్షణలో ముందంజ

ప్రస్తుతం భూ తాపం, వాతావరణ మార్పు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ విషయంలో భారత్ అనేక కార్యక్రమాలు అమలు చేసింది. ప్రపంచం ఆశ్చర్యపడే ఫలితాలను సాధించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధంలో మనం ముందు వరసలో ఉన్నాం. పునరుత్పాదక విద్యుదుత్పాదన దిశగా గణనీయ కృషి చేశాం. మనమిప్పుడు నికరశూన్య ఉద్గార (నెట్-జీరో) స్థాయి వైపు పయనిస్తున్నాం. ఏ జి-20 దేశమైనా పారిస్ ఒప్పందం నిర్దేశిత లక్ష్యాలను గడువుకు ముందే చేరిందంటే అది నా దేశం… భారత్‌ మాత్రమే. ఈ విజయం నాకెంతో గర్వకారణం. నేడు మనం పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు దగ్గరవుతున్నాం.. అంటే- 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యం చేరడానికి కఠోరంగా శ్రమిస్తున్నాం. మన రైల్వేలను 2030 నాటికి కర్బన ఉద్గార రహితంగా మార్చడానికి మనం కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాలకూ డిమాండ్ పెరుగుతోంది. ‘పిఎం సూర్య ఘర్ యోజన’ కింద సౌరవిద్యుత్‌ ఉత్పదనతో విద్యుత్‌ బిల్లుల వ్యయం కూడా తగ్గించుకోవచ్చు.

గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా భారత్‌ అంతర్జాతీయ కూడలిగా మారాలన్నది మన లక్ష్యం. ఆ దిశగా విధానాల రూపకల్పన-వాటి అమలు శరవేగంగా సాగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్‌ను సరికొత్త ఇంధన వనరుగా రూపొందించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఈ కృషితో భూ తాపం, వాతావరణ మార్పు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. అదే సమయంలో గణనీయ హరిత ఉపాధి (గ్రీన్ జాబ్స్) అవకాశాలు అందివస్తాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు మన యువతకు ఉపాధి కల్పన కోసం మనం హరిత ఇంధన రంగానికి ప్రోత్సాహంతోపాటు దాని విస్తరణపై దృష్టి పెట్టాలి.

భారత జి-20 అధ్యక్షత సందర్భంగా దేశంలోని వివిధ నగరాల్లో 200కుపైగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం. గతంలో ఎన్నడూ జి-20 కార్యకలాపాలు ఇంత ఘనంగా సాగిన ఉదంతాలు లేవు. ఇప్పుడు ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యం భారత్ సొంతం. మన అసమాన ఆతిథ్య హోదా నేడు యావత్‌ ప్రపంచానికీ అనుభవంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2036 ఒలింపిక్స్‌ను భారత్‌ గడ్డపై నిర్వహించాలని లక్ష్యం నిర్దేశం చేసుకున్నాం. ఆ దిశగా ఇప్పటికే గణనీయ పురోగతి సాధించాం.

ప్రగతి నిరోధకంగా ప్రతికూల మనస్తత్వం

మనం దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ గణనీయ పురోగతి సాధిస్తున్నాం. అయితే, కొందరు వ్యక్తులు దీన్ని అభినందించలేని దుస్థితిలో ఉన్నారన్నది నిజం. స్వలాభానికి అతీతంగా ఆలోచించలేని వారు, ఇతరుల బాగోగులను పట్టించుకోని వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు తమ వక్రబుద్ధితో అందరికీ ఆందోళన కలిగిస్తారు. నిస్పృహలో కూరుకుపోయిన ఇలాంటి వారిని దేశం దూరం నెట్టాలి. ఆ కొద్దిమంది వ్యక్తులు తమ వ్యతిరేక భావనలతో విషబీజాలు నాటితే అది అరాచకం, విధ్వంసం, గందరగోళం, తీవ్రమైన ఎదురుదెబ్బలకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితులను సరిదిద్దాలంటే అసాధారణ కృషి అవసరం. ఈ నిరాశావాద శక్తులు కేవలం నిస్పృహకు పరిమితం కాదు… వినాశం గురించి కలలుకంటూ మన సమష్టి పురోగతిని బలహీనపరిచే ప్రతికూల మనస్తత్వాన్ని వారు పెంచి పోషిస్తున్నారు. ఈ ముప్పును దేశం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మన మంచి ఉద్దేశాలు, సమగ్రత, దేశంపై అంకితభావంతో మనను వ్యతిరేకించే వారిని కూడా మనం గెలవగలమని నా తోటి పౌరులకు నేను హామీ ఇస్తున్నాను. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే నిబద్ధత నుంచి వెనక్కు తగ్గేది లేదని, ఈ సంకల్పాన్ని నెరవేర్చి తీరుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.

భారత్ అభివృద్ధి ఎవరికీ ముప్పు కాదు. గతంలోనూ మనం సుభిక్షంగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని యుద్ధాల్లోకి లాగలేదు. మనది బుద్ధుడు పుట్టిన భూమి.. యుద్ధం మన మార్గం కాదు కాబట్టి, ప్రపంచానికి ఆందోళన అక్కర్లేదు. భారత్‌ పురోగమిస్తున్న కొద్దీ దాని విలువలను, వేల ఏళ్ల చరిత్రను అర్థం చేసుకోవాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాను. మమ్మల్ని ముప్పుగా భావించవద్దు… సమస్త మానవాళి సంక్షేమానికి దోహదపడే భూమిని కష్టతరం చేసే వ్యూహాలను అనుసరించవద్దు.

బంగ్లాదేశ్ లో ఇటీవలి సంఘటనలపై ఆందోళనలను అర్థం చేసుకున్నాను. త్వరలోనే అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి రాగలవని నమ్ముతున్నాను. మన 140 కోట్ల మంది పౌరుల ప్రాథమిక ఆందోళన బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీల భద్రత గురించే. మన పొరుగు దేశాలు సంతృప్తి, శాంతి మార్గాన్ని అనుసరించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుకుంటోంది. శాంతిభద్రతల విషయంలో మన నిబద్ధత మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయింది. రాబోయే రోజుల్లో, మన సానుకూల ఆలోచనలు బంగ్లాదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కొనసాగుతాయి, ఎందుకంటే- మనం మానవాళి సంక్షేమానికి అంకితమయ్యాం.

ఇది భారత దేశానికి స్వర్ణయుగం… వికసిత భారత్-2047 మన కోసం ఎదురుచూస్తోంది. అవరోధాలు, అడ్డంకులు, సవాళ్లను అధిగమించి దృఢ సంకల్పంతో ముందుకు సాగేందుకు ఈ దేశం కట్టుబడి ఉంది. మిత్రులారా… నా ఆలోచనలలో ఎటువంటి సంకోచం లేదు. నా దక్కోణం చాలా స్పష్టంగా ఉంది. ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు స్వాతంత్య్ర స్వప్నాన్ని సాకారం చేయగలిగినపుడు ఈనాడు 140 కోట్ల మంది పౌరులు సుసంపన్న భారత్ కలను సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. నా మూడోదఫా పదవీకాలంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపొందడం తథ్యం. ఆ మేరకు నేను మూడు రెట్లు శ్రమించి.. మూడు రెట్ల వేగంతో… మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తాను. తద్వారా దేశం కోసం మనం కంటున్న కలలు త్వరగా సాకారం కాగలవు. నా ప్రతి క్షణం దేశం కోసమే. ప్రతి సెకను దేశానికే అంకితం; నాది అన్నదేదైనా భరతమాత కోసమే. నా అణువణువూ తల్లి భారతి కోసమే. కాబట్టే 24 గంటలూ పనిచేయాలనే నిబద్ధత, దేశం 2047 నాటికి ‘వికసిత భారత్’ కావాలనే దార్శనికత ఆలంబనగా నా తోటి పౌరులకు పిలుపునిస్తున్నాను: మన పూర్వికులు కన్న కలలను స్వీకరించి మన కలలను వాటికి జోడించి ఒక మహా సంకల్పంగా మార్చుకుందాం. అందుకు తగినట్లు అవిరళ కృషికి శ్రీకారం చుడదాం. మన ఆశయాలను, మన ప్రయత్నాలను అనుసంధానిద్దాం. ఈ 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా పరిగణించి ‘స్వర్ణ భారత్’ను తీర్చిదిద్దుదాం. ఈ శతాబ్దంలో ‘వికసిత భారత్’తో మన కలలను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుదాం.