GKR Khammam Visit

వరద బాధితులకు బిజెపి అండ

GKR Khammam Visitదేశంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు బిజెపి కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు బిజెపి కార్యకర్తలు పెద్దసంఖ్యలో రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పరిస్థితిపై తక్షణమే రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాఫ్టర్లను రాష్ట్రానికి పంపించారు. ఇక క్షేత్రస్థాయిలో బిజెపి కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు, మంచినీరు, మందులు వంటివి పంపిణీ చేశారు. పార్టీ హైదరాబాద్ నుంచి బియ్యం, బెడ్ షీట్స్, పప్పు, చింతపండు, దుప్పట్లు ఇతరత్రా సామాగ్రితో కూడిన నాలుగు ట్రక్కులను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించింది. ఇంకా అనేక చోట్ల నుండి వరద బాధితులకు సహాయం చేయడం కోసం బిజెపి ఆధ్వర్యంలో నిత్యావసరాల ట్రక్కులు బయలుదేరాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన కొద్దిపాటి సాయాన్నే పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటూ సరస్పర నిందారోపణల్లో నిమగ్నమయ్యితే… ప్రచారం కన్నా ప్రజలకు సేవ చేయడమే మిన్న అన్నట్టు బిజెపి కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మనసులు గెలుచుకున్నారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సెప్టెంబర్ 8న ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో స్వయంగా మాట్లాడి నిత్యవసరాల పంపిణీ చేశారు. ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆహారం, తాగునీరు, వైద్య సహాయంపై వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో మున్నేరు వరద బాధితులను పరామర్శించారు. ముంపు బారిన పడ్డ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటామని భరోసానింపారు. అనంతరం పరివాహక ప్రాంతంలో వాగు పరిస్థితిని పరిశీలించారు. దంసాలపురం పరివాహక ప్రాంతంలోని మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం ఖమ్మం అర్బన్ కందగట్ల ఫంక్షన్ హాల్ లో పదివేల మంది మున్నేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని, ఈ వరదల్లో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల కోసం పని చేస్తాయని అన్నారు. వరదలు సంభవించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ.1345 కోట్లు నిల్వ ఉంచారని, వాటిని ప్రజల కోసం ఖర్చు చేయమని మోదీ ఆదేశించారని తెలిపారు. మున్నేరు వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో పర్యటించారు. బాధితులతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ”ప్రధాన మంత్రి ఆదేశాలతో మిమ్మల్ని పరామర్శించి ఇక్కడ పరిస్థితుల్ని పరిశీలించడానికి వచ్చాను. రాకాసితండా ప్రజలు వరద కారణంగా సర్వస్వం కోల్పోయారు, నిరాశ్రయులుగా మిగిలారు. పంట పొలాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పొలాలన్నీ ఇసుక మేట వేశాయి. పంట పొలాల్లో ఇసుక మేటను తొలగించి, ఆర్థిక సాయం అందించి, రైతులు సాగు చేసుకునే విధంగా చేయాలి.” అయితే తండా ప్రజలు తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందరి ఆమోదం మేరకు రాకాసితండాను సురక్షిత ప్రాంతానికి మార్చే అవసరం ఉందన్నారు. కిషన్ రెడ్డితో పాటు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర బిజెపి నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Shivaraj Singh Chowhan Khammamసెప్టెంబర్ 6న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఏరియల్ సర్వే ద్వారా వరద ముంపునకు గురైన ప్రాంతాలైన ఎర్రుపాలెం మండలం మీనవోలు, ఖమ్మంలోని ప్రకాశ్ నగర్, మున్నేరు ప్రాంతాలను, దెబ్బతిన్న రహదారులను, నీట మునిగిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. జుజ్జులరావు పేటలో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో పాల్గొన్నారు. ఇక్కడే రైతుల ముఖాముఖీ ముచ్చటించి మాట్లాడారు.

ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ బాధితులకు భరోసా నింపారు. తానూ ఒక రైతేనని, తనకూ వ్యవసాయ పొలాలు ఉన్నాయని, వర్షాల కారణంగా మీకు జరిగిన నష్టాన్ని పూడ్చలేనిదని అన్నారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపునకు గురైన పొలాలన్నింటినీ చూశానని, రహదారులు చాలా దెబ్బతిన్నాయని, ప్రజల ఇండ్లలోకి నీళ్లు వచ్చాయని ఈ గాయం మాన్పలేనిదని అన్నారు. కేవలం వరి పంట మాత్రమే నష్టపోలేదని, ఇండ్లు మునిగిపోయి, ఇంట్లో సామాగ్రి దెబ్బతిన్నదని, పశువులు కూడా చనిపోయాయని వర్షం తీవ్ర నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంద సంవత్సరాల్లో ఎప్పుడూ కురవని వర్షం ఈ సారి కురిసిందని అన్నారు. పక్షపాతం చూపబోనని, మానవతా దక్పథంతో సాయం చేస్తామని వెల్లడించారు. నష్టపోయిన రైతులందరినీ అన్నివిధాలా ఆదుకుంటామని, సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రైతులకు, ప్రజలకు కలిగిన నష్టాన్ని స్వయంగా చూశానని, అందరికీ కేంద్రం అండగా ఉంటుందని, అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం చేయూతనిచ్చి త్వరలోనే ఆదుకుంటుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విపత్తు నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేయలేదని, ఈ దఫా ఎలాంటి రాజకీయాలు చేయకుండా స్వయంగా పరిశీలించి ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను పోయిన ప్రభుత్వం వాడుకోలేదు కాబట్టి, తిరిగి నిధులు రాలేదని, వాటిని వేరే కార్యక్రమాలకు మళ్లించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఆదుకోలేదని, కేంద్రాన్ని కూడా ఆదుకోనివ్వకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుని బాధితులను ఆదుకుంటామని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని, నరేంద్ర మోదీ, కేంద్ర సర్కారు అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి సహాయంగా ఉండేందుకే మోదీ తమను పంపించారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల అనంతరం తప్పకుండా ఆదుకుంటామని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, బాధితులందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు.

తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్ & కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం సెప్టెంబర్ 11న తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటు ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. ఈ సందర్భంగా జి. కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ తో మాట్లాడి ఖమ్మం పర్యటనలో తాను తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.