జమిలి ఎన్నికలకు కేంద్రం జై
జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ఈ నివేదికలో జమిలి ఎన్నికల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణంలో 1.1 శాతం తగ్గుతుందని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ పేర్కొంది. వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఆర్థిక పరమైన కార్యక్రమాలు తగ్గి జీడీపీపై ప్రభావం పడుతోందని కమిటీ వెల్లడించింది. జమిలీ ఎన్నికల వల్ల జీడీపీలో 1.5 శాతం పెరుగుదల ఉంటుందని, ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.4.5 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. ఈ మొత్తం వైద్యంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో సగంగా, విద్యపై చేస్తున్న ఖర్చులో మూడోవంతుగా ఉంటుందని పేర్కొంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జమిలీ ఎన్నికల అవసరాన్ని గుర్తిస్తూ ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అన్ని ఎన్నికలకు ఒకే ఎన్నికల జాబితా, ఒకే ఓటరు కార్డు ఇవ్వడం ద్వారా ఓటరు హక్కులను కూడా కాపాడినట్లవుతుందని తెలిపింది. ఇందుకోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 325లో సవరణలు తీసుకురావాల్సిన అవసరాన్నీ కమిటీ గుర్తుచేసింది. రెండు దశల్లో ఎన్నికల నిర్వహించాలని, మొదటి దశలో అసెంబ్లీలు, పార్లమెంటుకు.. ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలని కమిటీ సూచించింది. అంటే గరిష్టంగా 6 నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయితే మిగిలిన నాలుగున్నర సంవత్సరాలు దేశాభివృద్ధిపై దృష్టి సారించేందుకు వీలు కలుగుతుంది. దీనిపై దాదాపు 47 పార్టీల అభిప్రాయాలను కమిటీ తీసుకోగా.. 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు సానుకూలంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 18న జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకొంది.
ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార- ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ‘‘దేశవ్యాప్తంగా 1951 నుంచి 1967 వరకు అన్ని ఎన్నికలూ ఏకకాలంలో నడిచాయి. ఆ తర్వాత ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మేలని 1999లో లా కమిషన్ పేర్కొంది. 2015లో పార్లమెంటరీ కమిటీ కూడా అదే విషయాన్ని సిఫార్సు చేసింది. ఆ అంశానికి దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభించింది. కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా నివేదికలోని సిఫార్సులను ఆమోదించింది’’ అని వైష్ణవ్ వెల్లడించారు. రాజకీయ పార్టీల్లో అత్యధికం ఈ విధానానికి మద్దతు పలికినట్లు చెప్పారు. ఈ విధానం మన ప్రజాస్వామ్యాన్ని, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ అంతా పూర్తయితేనే కానీ ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చెప్పలేమన్నారు. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు ఏం అవసరమో కేంద్రం అది చేస్తుందన్నారు. ఆ దిశలో తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ఇది ఒకటి అని అభివర్ణించారు. సర్వసమ్మతి సాధించిన తర్వాత దీనికి అవసరమైన చట్టాలు తీసుకొస్తామన్నారు. సంప్రదింపుల ప్రక్రియను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. ఉన్నతస్థాయి కమిటీ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టినప్పుడు దేశంలో 80 శాతం మంది ఈ విధానానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పారు. అప్పట్లో వ్యతిరేకించిన పార్టీలు తమ వైఖరిని మార్చుకునేలా వాటిపై ఇప్పుడు ఒత్తిడి వచ్చే అవకాశం ఉందన్నారు.

