కిసాన్ మాన్ ధన్ యోజన: అన్నదాతలకు పెన్షన్ భరోసా
ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎం-కేఎంవై) దేశవ్యాప్తంగా భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ (ఎస్ఎంఎఫ్ లు) సామాజిక భద్రతను కల్పిస్తోంది. 2019 సెప్టెంబర్ 12న ఈ పథకం ప్రారంభమైంది. ఈ వృద్ధాప్య పెన్షన్ పథకం స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ (వాటా-ఆధారిత) పెన్షన్ పథకం. ఈ కార్యక్రమం కింద అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలవారీ పెన్షన్ రూ.3,000 చెల్లిస్తారు. రైతులు తమ పని సంవత్సరాల్లో పెన్షన్ నిధికి తమ వాటాను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి సమాన వాటా నెలవారీగా జమ అవుతుంది. వృద్ధాప్యంలో రైతులకు భద్రత కల్పించడంలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ పథకం అమలులోకి వచ్చి అయిదేళ్లు పూర్తి అయింది.
ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎం-కేఎంవై) కింద చిన్న, సన్నకారు రైతులు పెన్షన్ నిధికి నెలవారీ చందా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల లోపు రైతులు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అరవై ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న రైతులు, పథకం మినహాయింపు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే నెలవారీ పెన్షన్ రూ.3,000 పొందుతారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) పెన్షన్ నిధిని నిర్వహిస్తుంది. కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సిలు), రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధిదారులుగా నమోదు చేసుకోవచ్చు.
రెండు హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి ఉండి, 2019 ఆగస్ట్ 1 నాటికి రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత భూ రికార్డులలో పేర్లు ఉన్న రైతులందరూ ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు. 6 ఆగస్టు 2024 నాటికి మొత్తం 23.38 లక్షల మంది రైతులు ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద 3.4 లక్షల రిజిస్ట్రేషన్లతో బీహార్ అగ్రస్థానంలో ఉండగా, 2.5 లక్షల రిజిస్ట్రేషన్లతో జార్ఖండ్ రెండో స్థానంలో ఉంది. ఇంకా ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో వరుసగా 2.5 లక్షలు, 2 లక్షలు, 1.5 లక్షల మంది రైతులు ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద ఈ రాష్ట్రాలలో పెద్దయెత్తున నమోదులు జరగడం రైతులకు సామాజిక భద్రత కల్పించడంలో పథకం పరిధిని, ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఈ విస్తృతమైన ప్రజాదరణ చిన్న, సన్నకారు రైతులలో పీఎం-కేఎంవై పథకం పట్ల పెరుగుతున్న అవగాహన, ఆమోదాలను కూడా వెల్లడిస్తోంది.
పీఎం-కేఎంవై ప్రధాన ప్రయోజనాలు
- కనీస పెన్షన్ హామీ: పథకంలోని ప్రతి చందాదారునికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ వస్తుంది.
- కుటుంబ పెన్షన్: చందాదారుడు తాను పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే, అతని జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్‌గా చందాదారు పొందుతున్న మొత్తంలో 50 శాతం సమానమైన, అంటే నెలకు రూ.1,500 కుటుంబ పెన్షన్‌కు అర్హులు. జీవిత భాగస్వామి అప్పటికే పథకం లబ్ధిదారు కానట్లయితే మాత్రమే ఇది వర్తిస్తుంది. కుటుంబ పెన్షన్ ప్రయోజనం జీవిత భాగస్వామికి మాత్రమే ఇస్తారు.
- పీఎం-కిసాన్ ప్రయోజనం: చిన్న, సన్నకారు రైతులు పీఎం-కిసాన్ కింద కేంద్రం ఇచ్చే డబ్బు నుంచి పథకానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. దీని కోసం, అర్హత కలిగిన రైతులు తప్పనిసరిగా ఎన్రోల్మెంట్-కమ్-ఆటో-డెబిట్-మాండేట్ పత్రంపై సంతకం చేసి సమర్పించాలి. ఇది వారి పీఎం-కిసాన్ ప్రయోజనాలు జమ అయ్యే బ్యాంక్ ఖాతా నుంచి వారి వాటా చెల్లింపు నిమిత్తం ఆటోమేటిక్ డెబిట్‌కు అధికారం ఇస్తుంది.
- ప్రభుత్వ సమాన వాటా: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సహకార శాఖ, రైతు సంక్షేమ శాఖ ద్వారా అర్హులైన చందాదారులు చెల్లించిన సమాన మొత్తాన్ని పెన్షన్ నిధికి జమ చేస్తుంది.
- నెలవారీ వాటా చెల్లింపు: నెలవారీ చెల్లించే మొత్తం రూ.55 నుంచి రూ.200 వరకు, పథకంలోకి ప్రవేశించే సమయంలో రైతు వయసు ఆధారంగా ఉంటుంది.
ఎలా నమోదు చేసుకోవాలి?
పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులైన రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)ని సందర్శించాలి లేదా రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రభుత్వాలు నియమించిన నోడల్ ఆఫీసర్ (పీఎం-కిసాన్)ని సంప్రదించాలి. www.pmkmy.gov.inలో స్కీమ్ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.
రిజిస్ట్రేషన్ సమయంలో లబ్ధిదారు ఈ కింది సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది:
- రైతు / జీవిత భాగస్వామి పేరు, పుట్టిన తేదీ
- బ్యాంకు ఖాతా నెంబర్
- ఐఎఫ్ఎస్సి/ఎంఐసిఆర్ కోడ్
- మొబైల్ నెంబర్
- ఆధార్ నెంబర్
పెన్షన్ పథకం నుంచి బయటకు రావచ్చా?
- అర్హుడైన సభ్యుడు పథకంలో చేరిన తర్వాత పదేళ్ళలోపు బయటికి రావాలనుకుంటే అతను అప్పటివరకు చెల్లించిన అతని వాటాను పొదుపు ఖాతాల్లో మొత్తాలకు బ్యాంకులు చెల్లించే వడ్డీ కలిపి చెల్లిస్తారు.
- సభ్యుడు పదేళ్ళ తర్వాత, 60 ఏళ్ళ లోపు బయటికి వస్తే అతను చెల్లించిన మొత్తంతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తారు. పెన్షన్ నిధిపై వచ్చిన వడ్డీ, బ్యాంకు పొదుపు ఖాతా వడ్డీ ఇందులో ఏది ఎక్కువ ఉంటే ఆ రేటున వడ్డీ చెల్లిస్తారు.
- ఒక వేళ దురదృష్టవశాత్తూ సభ్యుడు క్రమం తప్పకుండా తన వాటా చెల్లిస్తూ మరణిస్తే అతని భార్య వాటా చెల్లిస్తూ సభ్యురాలిగా కొనసాగవచ్చు. లేదా అప్పటి వరకు సభ్యుడు చెల్లించిన వాటా, వడ్డీ తీసుకుని బయటికి రావచ్చు. అప్పటివరకు పెన్షన్ నిధికి జమ పడిన వడ్డీ రేటు లేదా పొదుపు ఖాతా వడ్డీ, ఏది ఎక్కువ ఉంటే ఆ రేటును వడ్డీ చెల్లిస్తారు.
- సభ్యుడు, అతని జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే మిగిలిన కార్పస్ (మూల నిధి) తిరిగి పెన్షన్ నిధికి జమవుతుంది.
అయిదు సంవత్సరాలలో పీఎం-కేఎంవై దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు గణనీయమైన సాధికారతను కల్పించింది. పీఎం-కేఎంవై ముఖ్య విజయాలలో ఒకటి రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం. వీరిలో చాలామంది వ్యవసాయంలో సంక్షోభాలు, ఒడిదుడుకుల కారణంగా ఆదాయాల్లో హెచ్చుతగ్గుల కారణంగా అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం వారికి బాసటగా నిలిచింది. విశ్రాంత రైతులకు పెన్షన్ సదుపాయం కల్పించడం ద్వారా ఈ పథకం గ్రామీణ జనాభాకు సామాజిక భద్రత విషయంలో గణనీయమైన అంతరాన్ని పరిష్కరించింది. గత అయిదేళ్లలో ఈ పథకం సాధించిన విజయం ఈ దేశ అన్నదాతకు జీవన నాణ్యతను పెంపొందించడంలో మోదీ ప్రభుత్వం ఎంత కీలక పాత్ర పోషించిందో తెలియజేస్తోంది.

