మహాత్ముడి ఆశయాలకు రూపం నరేంద్రభాయ్
మహాత్మా గాంధీ, లేదా బాపూజీ అని నేను పిలుచుకునే వ్యక్తి మా తాత. నేను 19 సంవత్సరాల వయస్సు వరకు ఆయనతో జీవించాను. ఈ సంవత్సరం నాకు 95 ఏళ్లు నిండాయి. ప్రధానమంత్రి మోదీ, గాంధీజీ గురించి నా ఆలోచనలను రాయడం నాకు అత్యవసరంగా అనిపిస్తోంది. ఎందుకంటే వయోజనురాలిగా వారిద్దరిని గమనించిన ఒక గాంధీజీ కుటుంబ సభ్యురాలిగా నా అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి రాబోయే తరాలకు ఉండవచ్చు. నరేంద్రభాయ్‌తో నా అనుబంధం సవాళ్లతో కూడిన ఎమర్జెన్సీ కాలంలోనే మొదలైంది. నరేంద్రభాయ్ అప్పుడు చురుకైన, యువ ఆరెస్సెస్ ప్రచారక్.
1970వ దశకంలో మతవాదం దేశాన్ని దెబ్బతీస్తోంది. గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన నేను పాకిస్తాన్ నుంచి భారీ చొరబాట్ల కారణంగా సరిహద్దు జిల్లాలలో జరుగుతున్న జనాభా మార్పు గురించి చాలా ఆందోళన చెందాను. అస్సాంలోకి వలసలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోలేదు. అయితే ఆ చిన్న వయసులో కూడా నరేంద్రభాయ్ ఇలాంటి విషయాలను ఎలా పట్టించుకున్నదీ నాకు స్పష్టంగా గుర్తుంది. ఆయన జాతీయ సమస్యల గురించి ఆలోచించే మనిషన్నది సుస్పష్టం. వర్తమాన రాజకీయాలు ఆయన దృష్టిని మళ్లించలేవు. ఆ రోజుల్లో కూడా గ్రామీణ భారతంలో మహిళలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు, వారి కుటుంబాలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి సవాళ్లపై ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ప్రధానమంత్రి అయిన వెంటనే ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జాతీయ పరిశుభ్రత ఆవశ్యకతను స్పష్టంగా చెప్పారు. ఆయన స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు, ఇది భారతదేశం అంతటా మహిళల పారిశుధ్యం, గౌరవం, భద్రతను పెంచింది.
మా తాత ‘జన్ ఆందోళన్’ను విశ్వసించారు. స్థిరమైన సామాజిక మార్పునకు ప్రజా ఉద్యమం, భాగస్వామ్యం పునాదిగా ఉండాలి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ వీటన్నిటిలో నరేంద్రభాయ్ ‘సబ్’ (అందరూ లేదా సమష్టి) అనే పదానికి ప్రాధాన్యమిచ్చారు. ఇవి ఆయనకు ఇష్టమైన పదాలే కాదు, ఆయనకు అవి చోదక శక్తులు. ‘వికసిత్ భారత్ కూడా ఆ భావానికి కొనసాగింపే. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ‘మానవత్వమే ముఖ్యం’ అనే స్పూర్తితో ఆయన ప్రదర్శించిన నాయకత్వం మన దేశ హద్దులకే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచాన్ని ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధికరణం 370 బంధనాల నుంచి విముక్తి చేసేందుకు ఆయన ఏటికి ఎదురీదారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ఎజెండాను ఒక క్రమపద్ధతిలో ఆయన పూర్తి చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఇందుకు ఒక ఉదాహరణ. ఈ గొప్ప సనాతన ధర్మ భూమిలో షిర్డీ సాయినాథ్, శ్రీ రమణ మహర్షి వంటి అనేక మంది మహానుభావుల ఆధ్యాత్మిక శక్తి ద్వారా రాజకీయ స్వాతంత్య్రం సాధించుకున్నాం. గాంధీజీ దీనికి నాయకత్వం వహించి ఒక సాధనంగా ఉపకరించారు. దశాబ్దాల తరువాత, వలసవాద మనస్తత్వం నుంచి మనల్ని విడిపించడానికి నరేంద్ర భాయ్ సాధనంగా మారడం యాదృచ్ఛికం కాదు.
రెండవ స్వాతంత్య్ర పోరాటం
మా తాత ఎప్పుడూ చెప్పేవారు, ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు ముందు మీలో రావాలి అని. ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నుంచి భారత ప్రధాని వరకు నరేంద్రభాయి ప్రయాణాన్ని నిశితంగా గమనించిన నేను, మనం ప్రేమించే భారత్‌లో మనందరం కోరుకున్న మార్పునకు ఆయన ప్రతిరూపమని నిస్సందేహంగా చెప్పగలను. బాపూజీ, నరేంద్ర భాయ్‌ల మధ్య అత్యంత అద్భుతమైన సారూప్యత ఏమిటంటే, వారి ప్రజా జీవితాలు సనాతన ధర్మపు ఆధ్యాత్మిక మూలంలో బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. వారిద్దరూ స్థితప్రజ్ఞులు-పూలూ, రాళ్ళూ రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. అంతిమంగా సత్యం గెలిచి తీరుతుందని తెలుసు కాబట్టే అది జరిగే వరకు ఓపికగా ఎదురు చూస్తారు. తన రాజకీయ ప్రత్యర్థుల నిర్దాక్షిణ్యమైన దాడుల నడుమ నరేంద్రభాయ్ పాటించే మౌనాన్ని ఇది వివరిస్తుంది. ఇది ఒక రాజ రుషి లక్షణం.
ధర్మ పునరుద్ధరణకు ముందు ఎల్లప్పుడూ ఒక మథనం ఉంటుందని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ప్రతికూలత అటువంటి మథనపు మొదటి ఫలం, ఈ ప్రతికూల శక్తులు సత్యాన్ని వ్యతిరేకిస్తాయి. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను సైతం పణంగా పెడుతున్నారు. అటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి అన్నిటి కంటే పేదలు, దేశం ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలంటే ఆ వ్యక్తి అధికారంపై ఎటువంటి వ్యామోహం లేని, అవినీతి మచ్చ లేని వ్యక్తి అయి ఉండాలి. ఈ రోజు బాపూజీ జీవించి ఉంటే నరేంద్రభాయికి ఆయన గొప్ప మద్దతుదారుగా ఉండేవారని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన పేరును సొంతం చేసుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం మనల్ని విభజించడానికి ఆ పేరును దుర్వినియోగం చేయడమే తమ జీవిత ధ్యేయంగా పెట్టుకున్న వారి గురించి మనల్ని బాపూజీయే మొదట హెచ్చరించి ఉండేవారు. గాంధీజీ ఆశయాలను ఆధునిక భారత్ అభివృద్ధి ఎజెండాలో చేర్చడం ద్వారా నరేంద్రభాయ్ వాటికి పునరుజ్జీవం కల్పించిన విషయం గాంధీజీ విమర్శకులకు, అనేకమంది నరేంద్రభాయ్ విరోధులకు ఆశ్చర్యం కలిగిస్తుందేమో. నరేంద్రభాయ్ పాలనలో ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ విధానాలుగా మారాయి. అలా చేయడం ద్వారా గాంధీజీ వారసత్వం మన దేశ ఆలోచనాసరళిలోకి బలంగా, నిరంతరాయంగా చొచ్చుకుపోయేలా ఆయన చేశారు. మా తాత వలె నరేంద్రభాయ్ కూడా ప్రజల పరిశీలన అనే పరీక్షకు నిలబడవలసి ఉంటుంది. కానీ, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా, మీ పనిని చేయడం, ఫలితాన్ని సత్యానికి వదిలివేయడం ముఖ్యం. ఇది అంతిమంగా విజయం సాధిస్తుంది. అంతిమంగా చరిత్ర బాపూజీ, నరేంద్రభాయిల పట్ల దయతో కూడిన తీర్పు ఇస్తుందని నాకు నమ్మకం ఉంది.
సుమిత్రా గాంధీ కులకర్ణి,
మహాత్మా గాంధీ మనవరాలు

