పీఎం విద్యాలక్ష్మి: విద్యార్థులకు మరొక ‘మోదీ కీ గ్యారంటీ’
దేశ జనాభాలో 60 కోట్లకు మందికి పైగా 18-35 సంవత్సరాల వయసు వారు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి శాతం 43. అంటే జనాభాలో ఈ వయసు వారు అత్యధికంగా ఉన్న దేశం ప్రపంచంలో భారతదేశమే అవుతుంది. నూతన విద్యా విధానం 2020లో లక్షించిన విధంగా ఉన్నత విద్యాసంస్థల్లో స్థూల నమోదు నిష్పత్తి (జిఈఆర్) ని ప్రస్తుతం ఉన్న 28 శాతం నుంచి 2035 నాటికి 50 శాతానికి పెంచాలంటే ఈ వయసు జనాభానే కీలకం. అంతేగాక భారత్ లో పని చేసే జనాభా 15-64 వయసు వారిలో 68 శాతం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభా ప్రయోజనం ఎన్నో సంవత్సరాలు కొనసాగదు. ఇప్పుడు ఉన్న యువత క్రమంగా వయసు పెరిగి వారి ఉత్పాదకత తగ్గిపోతుంది. సరిగ్గా ఈ కారణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ కు ఇప్పుడుగల సువర్ణావకాశాన్ని అమృతకాల్ గా అభివర్ణించారు. స్వయం సమృద్ధికి దోహదం చేసే చర్యల ద్వారా 2014 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
యువతకు అవసరమైన నైపుణ్యాలు కల్పించి వారిలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించి సృజనాత్మక ఆలోచన ప్రక్రియలను వారిలో పెంచి వారిని సాధికారీకరించినప్పుడు మాత్రమే ప్రధానమంత్రి నిర్దేశించిన ఈ సమున్నత లక్ష్యం నెరవేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం గల యువతకు చాలా డిమాండ్ ఉంది. మారుతున్న ఉద్యోగాల స్వభావానికి అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను సంతరించుకోవడం, పెంచుకోవడం, వేరే రంగాలకు మళ్లటానికి అవసరమైన ప్రావీణ్యాన్ని సంపాదించడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగేది గనుక నైపుణ్యాలన్న యువతకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే గత పదేళ్ళ కాలంలో దేశంలో సంభవించిన ఆర్థిక మార్పుల కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగి దాంతోపాటే జీవన వ్యయాలు కూడా పెరిగాయి. సహజంగానే చదువులకయ్యే ఖర్చు కూడా పెరిగింది. యువతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ఎన్ఈపి-2020 అమలు కోసం పలు విధానాలు రూపొందించింది.
సమగ్ర విద్య కోసం విభిన్న అంశాలతో కూడిన పాఠ్య ప్రణాళికలు, వినూత్న బోధనా విధానం, ప్రయోగాత్మక అభ్యసనం, వ్యాపార శిక్షణ, క్షేత్రస్థాయి అధ్యయనాలు, క్రెడిట్లతో కూడిన అకడమిక్ బ్యాంకు, వెసులుబాటును బట్టి ఒక కోర్సును ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనసాగించడం లేదా నిలిపివేయడం, ఒకే సమయంలో రెండు డిగ్రీలు చేసే పద్దతి, భారతీయ పరిజ్ఞాన వ్యవస్థకు ప్రాధాన్యం, విశ్వజనీన మానవ విలువలు మొదలైనవి ఈ కార్యక్రమాలలో ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యల జాబితాలో తాజాగా ఇప్పుడు పీఎం విద్యాలక్ష్మి పథకం చేరింది. దీని కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎటువంటి హామీ లేని రుణాలను కల్పిస్తారు. ఇది ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అమలయ్యే పథకం. దేశానికి దీపావళి బహుమతిగా 2024 నవంబర్ 5న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పీఎం విద్యాలక్ష్మి పథకం ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ, ఎటువంటి అవరోధాలు లేకుండా విద్యను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది.
ఇది సరళమైన, పారదర్శకమైన, విద్యార్థులకు స్నేహపూర్వకమైన పథకం. దేశంలోని ఉత్తమమైన 860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభ గల విద్యార్థులకు సులభంగా రుణాలు అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది పూర్తిగా డిజిటల్ పద్ధతిలో అమలు జరుగుతుంది. విద్యార్థులు రుణాలకు దరఖాస్తు చేసుకొని తమ దరఖాస్తు ఏ దశలో ఉన్నది ఎప్పటికప్పుడు గమనించే అవకాశం ఈ సింగిల్ విండో విధానంలో అందుబాటులో ఉంది. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం విషయంలో చేయూత అందించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది.
ఇప్పుడు వాటికి అదనంగా పీఎం విద్యాలక్ష్మి పథకం ఏడాదికి లక్ష మంది విద్యార్థులకు ఆసరా అందిస్తుంది. ఈ పథకం పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల జాబితాను ప్రతిఏటా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల ఆధారంగా నవీకరిస్తారు. ఈ పథకం కింద నాణ్యమైన, ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఎటువంటి పూచీకత్తులు, హామీదారులు లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. నూటికి నూరు శాతం ట్యూషన్ ఫీజులు, చదువుకయ్యే ఇతర ఖర్చులను రుణంగా ఇస్తారు. ఈ పథకం కింద చెల్లించని రుణాల్లో 75 శాతం వరకు 7.5 లక్షల పరిమితికి లోబడి కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు రుణ హామీ ఇస్తుంది. దీనివల్ల బ్యాంకులు నిర్భయంగా ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కింద రుణాలు అందజేస్తాయి. వార్షిక కుటుంబాల ఆదాయం 8 లక్షల కంటే ఎక్కువ కలిగి ఏ ప్రభుత్వ స్కాలర్షిప్ కిందా వడ్డీ రాయితీ పొందని విద్యార్థులకు 10 లక్షల రూపాయల రుణం వరకు మారటోరియం కాలంలో ఈ పథకం కింద మూడు శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది.
ఏడాదికి రు 4.5 లక్షల రూపాయల లోపు కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులకు పూర్తిగా వడ్డీ రాయితీ కల్పిస్తారు. ఈ వడ్డీ రాయితీని ఈ-వోచర్, కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ వాలెట్ ద్వారా చెల్లిస్తారు. 2024-25 నుంచి 2030-31 వరకు ఈ పథకం అమలుకు గాను 3,600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ కాలంలో విద్యాలక్ష్మి పథకం కింద 7 లక్షల మంది కొత్త విద్యార్థులు వడ్డీ రాయితీ పొందుతారని అంచనా. ఇప్పటికే ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష ప్రోత్సాహణ్ ( పీఎంయుఎస్పి) కింద కేంద్ర ప్రభుత్వం విద్యా రుణాలకు వడ్డీ రాయితీ కల్పిస్తోంది కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు పీఎం విద్యాలక్ష్మి పథకం కింద కూడా రాయితీ కల్పిస్తున్నారు. పిఎం యుఎస్పి-సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సిఎస్ఐఎస్) కింద, ఆమోదం పొందిన విద్యాసంస్థల్లో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు చేస్తున్న విద్యార్థులకు వారి కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల లోపు ఉంటే 10 లక్షల రూపాయల వరకు విద్యా రుణాలపై మారటోరియం కాలంలో నూటికి నూరు శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పీఎం విద్యాలక్ష్మి పథకం యువతను, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారిని తమకు నచ్చిన విద్యను అభ్యసించేందుకుగాను అవసరమైన ఆర్థిక మద్దతు అందించడం ద్వారా సాధికారీకరించడానికి ఉద్దేశించిన పథకం. నాణ్యమైన విద్యను, సాంకేతిక, వృత్తిపరమైన విద్యను ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థలలో అర్హులైన విద్యార్థులు అభ్యసించేందుకు పీఎం యూఎస్పీతో సమన్వయంతో ఈ పథకం అమలు జరుగుతుంది.
ఈ కొత్త పథకం ప్రతిభ గల విద్యార్థులకు నాణ్యమైన విద్యను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా వారు రుణాల విషయంలో ఎటువంటి మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా చదువులపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు తోడ్పడుతుంది. నూతన విద్యా విధానం-2020 అమలు దిశలో విద్యార్థులే కేంద్ర బిందువుగా ఈ పథకాన్ని ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను అభినందించాలి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ‘మోదీ కీ గ్యారెంటీ’. నిజానికి ఇది చదువుల తల్లి సరస్వతి, సంపాదన తల్లి లక్ష్మిల సంగమం. సరిగ్గా ఇటువంటి సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నందునే దేశంలోనూ వెలుపలా మోదీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
రాఘవేంద్ర పి తివారి,
వైస్ ఛాన్సలర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్

