లక్ష బుల్‌డోజర్లు పెట్టినా… ఒక్క ఇల్లూ కూల్చనివ్వం¡
లక్ష బుల్‌డోజర్లు పెట్టినా మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క పేదోడి ఇల్లును కూడా కూలగొట్టనివ్వమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కిస్తాం.. అడ్డొమొచ్చినవారిని తొక్కిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఎప్పుడు బుల్డోజర్లతో తమ ఇండ్లు కూల్చుతారేమోననే భయంతో స్థానిక ప్రజలు బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రేవంత్ రెడ్డి…! దేశ వ్యతిరేక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులపై బుల్డోజర్లు ఎక్కించాలి. పేద ప్రజలపై కాదు.’’ అని హెచ్చరించారు. సీఎం రేవంత్ ఇండ్లు కూల్చుతామని ప్రకటించిన తర్వాత, ఆ భయం, ఆవేదనతో సుమారు 9 మంది గుండెపోటుతో మరణించారని తెలిపారు. పేదల పైన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని… అందుకే పేదల ఇండ్లు కూల్చుతోందని విమర్శించారు. ఇండ్లు కూలగొట్టే కార్యక్రమాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. పేదల ఇండ్లు కూలగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనను విరమించుకోవాలన్నారు. మూసీ నదికి రెండువైపుల రిటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీల్లో పాదయాత్ర చేయాలని అన్నారు.
మూసీలో నిద్రించండి అని… సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరించిన కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేయండి.. కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి! అనే నినాదంతో మూసీ పరివాహక ప్రాంతంలో కిషన్ రెడ్డి సహా బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు మూసీ నిద్ర నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని 20 బస్తీల్లో నవంబర్ 16న రాత్రి బస చేసిన బిజెపి నాయకులు అక్కడే నిద్రపోయారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ క్రమంలో అనేక మంది బాధితులు బిజెపి నాయకుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్బంగా బస్తీ ప్రజలు, బాధితులు మా ఇళ్ళు మక్కావాలి.. మా ఇళ్ళు కులగొట్టడానికి వీళ్ళేదంటూ నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. పేదల ఇండ్లు కూలగొట్టి మూసీ సుందరీకరణ.. మూసీ పునరుద్ధరణను చేస్తామంటే ఊరుకోమని స్థానిక ప్రజలు హెచ్చరించారు. అడ్డుకుంటే బుల్ డోజర్లతో తొక్కేస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాధిత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్ని బులడోజర్లు వచ్చినా వేనక్కి తగ్గేదే లేదని, వాటికీ అడ్డంగా పడుకుంటామని, చావడానికైనా సిద్దమే కానీ మా ఇళ్ళు కూల్చడానికి వీళ్లేదని తేల్చి చెప్పారు.
అంబర్ పేట నియోజకవర్గంలోని తులసీరాం నగర్ బస్తీలో ఆంబోజి శంకరమ్మ ఇంట్లో రాత్రి బస చేసిన కిషన్ రెడ్డి స్థానికులతో కలిసి నిద్ర చేశారు. శంకరమ్మ భర్త రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన నలుగురు కుమారులు నాలుగు ఫ్లోర్లలో నివాసముంటున్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసముంటున్నామని, ఈ పరిస్థితిలో మా ఇల్లు కూల్చితే ఎక్కడివెళ్లి బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలి కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఇల్లు కట్టించలే.. కనీసం భూమిపూజ కూడా చేయలే. పేదల ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం లక్షా యాభై వేల కోట్లు సోనియా గాంధీ ఇస్తదా…రాహుల్ గాంధీ ఇస్తడా..?? అవసరమైతే ఇండ్లలో పని చేసే మా పేద మహిళల డబ్బులను కూడా మూసీ బ్యూటిఫికేషన్ కోసం ఇస్తం. అంతే కానీ పేదల ఇండ్లు కూలగొట్టే ఆలోచనలను ఉపసంహరించుకోవాలని రేవంత్ ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకు రక్షణగా ఉండాలి. బుల్డోజర్ పెట్టి మీ ఇండ్లు కూలగొడుతా, మిమ్మల్ని తొక్కిస్తా, పేగులు మెడలేసుకుంటా, కండ్లు పీకి గోలీలాడుతా అని మాట్లాడవచ్చా..? మూసీ సుందరీకరణకు బిజెపి వ్యతిరేకం కాదు. రిటైనింగ్ వాల్ ఎంత అవసరమో అంతవరకు కట్టండి. ఆక్రమణదారులు మూసీని ఆక్రమించారు… ఆ స్థలాలను రక్షించండి కానీ, పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లను మాత్రం కూలగొట్టకండని మనవి చేస్తున్నా.
మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. గండిపేట్ నుండి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా పరిపాలన అన్నారు. కాని, పేదల ఇండ్లు కూల్చే కార్యక్రమానికి పూనుకున్నారు. ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా..? రాష్ట్రంలో ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఏ ఒక్క కాలనీలో కూడా శంకుస్థాపన చేయలేదు. కాని, మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చుతోంది. మూసీ సుందరీకరణ- పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తి కావాలంటే వేలాది మంది పేదల ఇండ్లు నేలమట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదలకు నిలువనీడ లేకుండా చేయాల్సి వస్తుంది. నగరంలో సుమారు కోటి మంది ఉపయోగిస్తున్న వాటర్ నుంచి వస్తున్న డ్రైనేజీ మూసీలో కలుస్తున్నది. హైటెక్ సిటీ, బోరబండ, ముషీరాబాద్, సనత్ నగర్…. ఇలా అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు మూసీలోనే కలుస్తున్నది. ముందు డ్రైనేజీ నీరు మూసీలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కుత్బుల్లాపూర్ నుంచి మొదలు అనేక ప్రాంతాల్లో పరిశ్రమలు, మల్టీ నేషనల్ కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యం మూసీలో కలుస్తున్నది. ముందు ఇండ్లు కూలగొట్టడం కాదు.. మూసీలో కలుస్తున్న కాలుష్యం, డ్రైనేజీ వాటర్ రాకుండా ఆపాలి. మూసీ ప్రక్షాళన కోసం చేస్తున్న ప్రాజెక్టు డీపీఆర్ కు ఎంత ఖర్చవుతుంది..? నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ప్రజలకు తేల్చాలి. ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికేనా..? కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్మాణం కోసమేనా..? ప్రభుత్వం స్పష్టం చేయాలి.
మూసీ నిద్ర చేశాం.. ఇక్కడ ఎటువంటి దుర్గంధం రావడం లేదు. ఏ ఒక్కరు కూడా తమ ఇల్లు ఖాళీ చేసి.. మరోచోట ఇల్లు కావాలని అడగలేదు. రేవంత్ రెడ్డికి ఏ రాత్రి ఏ కల వచ్చిందో కానీ… రెక్కాడితే డొక్కాడని పేదలు నివాసముంటున్న జాగపైన కన్నుపడింది. వేలాది మంది పేదలను నిరాశ్రయులను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఏండ్ల తరబడి కూలీ చేసుకుని, కష్టపడి ఇండ్లు కట్టుకున్నాం.. ఆ ఇండ్లను కూలగొడితే ఎక్కడికి పోవాలంటూ ప్రజలు బాధపడుతున్నరు. గతంలో కేసీఆర్ కూడా మూసీని కొబ్బరినీళ్లలా మారుస్తమని చెప్పి ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. గతంలో ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామని చెప్పి గులాబీ గ్రాఫిక్స్ చూపించారు. పదేళ్ల పాలనలో కనీసం ట్యాంక్ బండ్ ను కూడా ప్రక్షాళన చేయలేదు. వందేళ్ల క్రితం నిజాం కూడా మూసీ చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టాడు. నిజాం మాదిరిగానే మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టి మూసీ సుందరీకరణ చేయండి. పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్తీల్లో మూసీ బ్యూటిఫికేషన్ చేస్తే.. మా బిజెపి శ్రేణులంతా శ్రమదానం కూడా చేస్తరు.’’ అని అన్నారు.
బిల్డర్లకు భూములు కట్టబెట్టేందుకే: ఈటల
ఎల్బీనగర్ నియోజకవర్గం ఫణిగిరి కాలనీలోని మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో పేదలకు హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఉరివేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి నీకు నడమంత్రాన ఈ పదవి వచ్చింది. బీఆర్ఎస్ తప్పు చేస్తే వారిని ఓడగొట్టాలని కసితో నీకు ఓట్లు వేశారు. కానీ సంవత్సర కాలంగా ప్రశాంతత లేకుండా చేశావు. పేదల బ్రతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి ప్రేమ మూసీ పక్కన ఉన్న ప్రజల మీదనో, నల్గొండ ప్రజానీకం మీదనో కాదు.. ఆయన ప్రేమ బిల్డర్లకు భూములు కట్టబెట్టే ప్రేమ. ఆయనకు కనిపిస్తుంది తెలంగాణ ప్రజలు కాదు.. వేల కోట్ల రూపాయలు. తెలంగాణను దోచుకుని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కోసం డబ్బులు పంపిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. మీరు పాదయాత్రలు చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే ప్రయత్నం చేస్తే.. కేసీఆర్ కి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరిస్తున్నాము.’’ అని అన్నారు. ‘‘మొన్ననే డీపీఆర్ కి డబ్బులు విడుదల చేశాము డీపీఆర్ రావడానికి 18 నెలల టైం పడుతుంది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీపీఆర్ తయారు కానప్పుడు ఏ ధైర్యంతో ఫణిగిరి కాలనీలో RBX అని మార్కింగ్ చేశారు. మీరు పెట్టిన హింసకు తాళలేక లక్ష్మమ్మ అనే ఆవిడ హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయింది. నాగిరెడ్డి అనే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కూకట్పల్లి నల్లచెరువులో బుచ్చమ్మ అనే మహిళ.. పిల్లలకు పంచిన ఆస్తి పోతుందనే ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంది.
కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు, డ్రైనేజీ కలిసి మూసీ కంపుగా తయారయింది. ముందు అవి రాకుండా చేయాలి కదా. అవి చేయకుండా ఇళ్లను కూలగొట్టడం ఏంటి? ఈ ముఖ్యమంత్రి కి ఏం పిచ్చి పట్టింది, మా వెంట ఎందుకు పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. చైతన్యపురికో, రామంతపూర్ కి రావడానికి రేవంత్ రెడ్డికి ముఖం లేదు. నల్గొండ వెళ్లి అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఉద్యోగులకు జీతాలు లేవు, మధ్యాహ్న భోజనానికి డబ్బులు లేవు కానీ లక్షన్నర కోట్లు ఎక్కడివి..? ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు కాబట్టి వాటిని పక్కదోవ పట్టించడానికి మూసీ ప్రక్షాళన తెరమీదకు తెచ్చారు.’’ అని అన్నారు.

