‘మహా’ విజయం.. సుపరిపాలనకు పట్టం
మహారాష్ట్ర బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ కు జై కొట్టింది. మరోసారి బిజెపికి పట్టం కట్టింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహా యుతి కూటమి అఖండ విజయం సాధించింది. 288 సీట్ల అసెంబ్లీలో నాలుగింట మూడొంతులకుపైగా స్థానాలను దక్కించుకుంది. కూటమిలోని బిజెపి 149 స్థానాల్లో బరిలోకి దిగి ఏకంగా 132 స్థానాల్లో గెలిచింది. అంటే.. దాదాపు 90 శాతం విజయాన్ని (స్ట్రైక్ రేట్) సాధించింది. ఇక, కూటమిలోని ఏక్‌నాథ్ శిందే శివసేన పార్టీ 81 స్థానాల్లో పోటీ చేసి 57 సీట్లను దక్కించుకుంటే.. అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసి 41 సీట్లలో విజయం సాధించింది. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగగా 23న ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చరిత్రలోనే అతి ఎక్కువ సీట్లు సాధించింది. 2014లో 122, 2019లో 105 సీట్లు దక్కగా ఈ సారి 132 స్థానాలు దక్కించుకుంది. గత 50 ఏళ్లలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన తర్వాత ఇంతటి ఘనవిజయం ఎన్నడూ దక్కలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది! కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన సీట్లను కలిపినా అర్ధ సెంచరీ దాటలేదంటే కాషాయ సునామీని అర్థం చేసుకోవచ్చు! వందేళ్ల కాంగ్రెస్ పార్టీ.. మరాఠా యోధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన కలిసి పోటీ చేస్తే.. ఆ కూటమికి వచ్చిన సీట్లు బిజెపి కన్నా తక్కువ. బిజెపి మాత్రమే కాదు ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీ అయిన ఏక్‌నాథ్ శిందే ఆధ్వర్యంలోని శివసేనకు వచ్చిన సీట్ల కంటే కూడా తక్కువ! ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్ పార్టీకి వచ్చిన సీట్ల కంటే కాస్త ఎక్కువ! మహావికాస్ ఆఘాడీలోని మూడు పార్టీలు ఉమ్మడిగా ఎన్డీఏలోని ఒక పార్టీతో పోటీ పడే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అతి తక్కువగా కేవలం 16 సీట్లతోనే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది! ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు పోటీ పడితే.. కాంగ్రెస్ ఐదో స్థానంలో నిలిచింది! ఇంకా చెప్పాలంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లతో పోల్చినా మూడో వంతుకు పడిపోయింది! ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది!
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బిజెపి ఆశించిన ఫలితాలు దక్కలేదు. 48 లోక్‌సభ సీట్లలో బిజెపికి 9 సీట్లు వచ్చాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంవీఏ పైచేయి సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బిజెపి-శిందే సర్కారు అప్రమత్తమైంది. ప్రజల నాడిని గమనించి మరిన్ని సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. లాడ్కి బహిన్ యోజనను ప్రవేశపెట్టి.. రూ.2.5 లక్షల వార్షికాదాయం ఉండే మహిళలకు నెలకు రూ.1500 ఇస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే దీనిని రూ.2100 చేస్తామని ప్రకటించింది! తాము అధికారంలోకి వస్తే ఈ పథకం కింద రూ.3000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినా మహిళలు నమ్మలేదు. అలాగే, లడ్కా బౌ అనే మరో పథకం కింద నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంతోపాటు శిక్షణ సమయంలో స్టైపెండ్‌నూ ఇస్తోంది. ముంబై నగరం చుట్టూ ఉన్న ఐదు టోల్ గేట్ల ద్వారా ప్రవేశాన్ని ఉచితం చేసింది.
ముఖ్యంగా రైతులకు ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇస్తున్న రూ.12,000ను రూ.15,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతోపాటు కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) అనుబంధంగా రేట్లలో తేడాను 20శాతం వరకు కవర్ చేసేలా ధరల మద్దతు పథకాన్ని తెస్తామని హామీ ఇచ్చింది. బీద రైతులకు మేలు జరిగేలా అక్షయ అన్న యోజన స్కీంను ప్రవేశపెడతామంది. దీనిలో బియ్యం, జొన్నలు, శనగ నూనె, ఉప్పు, పంచదార, పసుపు, ఆవాలు, కారం వంటివి ప్రతి నెలా ఇస్తామని పేర్కొంది. వీటితోపాటూ నదీ జలాల మళ్లింపు చేపట్టి పొలాలకు నీరు అందిస్తామని ప్రకటించింది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించి వారిని ప్రసన్నం చేసుకుంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం (ఆ తర్వాత సుప్రీం కోర్టు వాటిని నిలిపివేసింది)తో ఓబీసీల్లో కొన్ని వర్గాలు మహా యుతి కూటమిపై కినుక వహించారు. వారంతా ఎంవీయే కూటమికి మొగ్గు చూపే అవకాశం కనిపించింది. ముస్లింలతో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ‘ముస్లిం-దళిత్-మరాఠా’ వ్యూహం పన్నింది. దీనికి ప్రతిగా కుల సమీకరణాల్లోనూ బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బిజెపి నేతలు ఓబీసీల్లోని మాలి, ధంగర్, వంజరి వంటి బీసీ కులాల నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి వారిని ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు. ఏక్‌నాథ్ శిందే స్వయంగా మరాఠా నేత కావడంతో మరాఠాలంతా మహా యుతికి జైకొట్టారు. ఇటు ఓబీసీలనూ ఆకర్షించారు. దీంతో కాంగ్రెస్ ‘ముస్లిం-దళిత్-మరాఠా’ వ్యూహం పని చేయలేదు. విడిపోతే పడిపోతాం, ఐక్యంగా ఉంటే క్షేమంగా ఉంటామనే నినాదాలు మెజారిటీ ప్రజలను ఆలోచింపచేశాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో 11 జిల్లాలున్న విదర్భలో విజయాన్ని అధికారానికి ద్వారంగా భావిస్తారు. ఇక్కడ 62 స్థానాలున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడ బిజెపి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతింది. కాంగ్రెస్‌కు 10 లోక్‌సభ నియోజకవర్గాలు దక్కాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. మరోసారి బిజెపి ఇక్కడ పట్టు బిగించింది. రెండు పార్టీలు.. ముఖాముఖి తలపడ్డ స్థానాల్లో మహాయుతి భారీగా విజయం సాధించింది. ఈ ప్రాంతం వ్యవసాయాధారితమైంది. పత్తి, సోయాబీన్ ప్రధాన పంటలు. ఇక్కడి రైతులు కాంగ్రెస్ ను విశ్వసించలేదు. విదర్భ ప్రాంతంలోని నాగ్‌పుర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ సంస్థ ప్రభావం అక్కడా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై బలంగా పని చేసింది. మొత్తానికి మహారాష్ట్రలో శిందే నేతృత్వంలోని సంక్షేమ పాలన, కేంద్రంలో నరేంద్ర మోదీ అభివృద్ధి, బిజెపి సంస్థాగత నిర్మాణం, పదునైన వ్యూహాలు వెరసి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి.
అస్థిరత సృష్టించాలని చూసే శక్తులకు గుణపాఠం
మహారాష్ట్రలో ‘మహాయుతి’ అఖండ విజయం స్థిరత్వానికి ప్రజలు ఇచ్చిన ఆమోదమని, అస్థిరత సృష్టించాలని చూసే శక్తులకు నేర్పిన గుణపాఠంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో నవంబర్ 23న సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. అభివృద్ధి సందేశాన్ని ఆమోదించిన మహారాష్ట్ర ఓటర్లు అబద్ధాలు, మోసాల రాజకీయాలను ఘోరంగా ఓడించారన్నారు. మహారాష్ట్ర అన్ని రికార్డులను బ్రేక్ చేసిందన్న మోదీ.. గత 50 ఏళ్లలో ఏ పార్టీ గానీ, ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి గానీ ఇంతటి ఘనవిజయం సాధించలేదన్నారు. ‘ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం’ (ఏక్ హై తో సేఫ్ హై) అనే నినాదం ఇప్పుడు దేశానికి మహా మంత్రంగా మారిందని చెప్పారు.
అర్బన్ నక్సలిజంతో దేశానికి సవాలుగా మారిన కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ దేశం వెలుపల ఉందని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్న చిన్న వర్గాలుగా విభజించాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు గట్టి చెంపదెబ్బగా పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను ‘ఇండియా’ కూటమి అర్థం చేసుకోలేకపోయిందని తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగమే ప్రజలకు ఆమోదయోగ్యమైనదని.. ప్రపంచంలోని ఏ శక్తీ ఆర్టికల్ 370ను పునరుద్ధరించలేదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాల రాజకీయాలకు వక్ఫ్‌బోర్డే ఓ ఉదాహరణ అని ప్రధాని విమర్శించారు.
కాంగ్రెస్ అసత్యాలను ప్రజలు నమ్మలేదు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశానికి ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కాంగ్రెస్ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినా కూడా అక్కడి ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ కే అత్యధిక ఓట్లు, సీట్లతో మరోసారి పట్టం కట్టారన్నారు. మహారాష్ట్ర విజయం అనంతరం నవంబర్ 23న హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలోనూ నాయకులు సంబరాలు జరపుకున్నారు. మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘బిజెపి వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేసి కొంత లబ్ధి పొందారు. కానీ, కేవలం 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవం అర్థమైంది. ఇంత పెద్ద విజయం అందించారు. మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయినప్పుడు జరిగిన ఎన్నికల తర్వాత మహాయుతి కూటమికి ఇంత పెద్ద విజయం రావడం ఇదే మొదటిసారి. దేశంలో కులం, భాష, మతం పేరుతో కాంగ్రెస్ అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టింది. దేశంలో అనేక రకాల నష్టాలకు కారణం కాంగ్రెస్. రాహుల్ గాంధీకి ఈమధ్య మతిమరుపు ఎక్కువ పెరిగింది. దేశంలో అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలన వెలగబెట్టిందనే విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నాడు. కానీ, కాంగ్రెస్ దేశానికి అనేక నష్టాలు చేసి… బిజెపినే కారణం అంటూ తప్పుడు ప్రచారంతో వితండవాదం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ చిలకపలుకులకు మహారాష్ట్ర ప్రజలు ఏమాత్రం స్పందించలేదు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకులు విషప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మలేదు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో మహాయుతి కూటమి విజయం సాధించింది.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మహారాష్ట్రలో అత్యధిక మెజారిటీతో మూడవసారి అధికారంలోకి వచ్చాం. గోవా రాష్ట్రంలో అధికంగా ఓట్లు, సీట్లు సాధించడంతో పాటు, గుజరాత్ లో వరుసగా ఐదారు సార్లు, హర్యానాలో రెండవసారి, మహారాష్ట్రలో మూడవసారి, మధ్యప్రదేశ్ లో అనేక దఫాలుగా, ఉత్తరప్రదేశ్ లో రెండవసారి, ఉత్తరాఖండ్ లో రెండవసారి, అస్సాంలో రెండవసారి అధికారంలోకి వచ్చాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి మూడవసారి అధికారంలోకి వచ్చాం. నేడు దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టిన కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈసారి శివసేన లాంటి పార్టీలతో కలిసి పోటీ చేసినా కనీసం గతం కంటే సగం సీట్లు కూడా గెలవలేకపోయింది. ఎన్నికల ఫలితాలకు ముందే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు కాంగ్రెస్ 4 ప్రత్యేక విమానాలను బుక్ చేసుకుంది. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ మరోసారి నవ్వులపాలైంది. బాలాసాహెబ్ థాక్రే గారి రాజకీయ వారసత్వం ఉద్ధవ్ థాక్రే కు లేదని నిరూపితమైంది. ఉద్ధవ్ థాక్రేకు వచ్చిన సీట్లలో కొన్ని సీట్లు కూడా శివసేన ఓట్లు కాదు. శివసేన వ్యతిరేకతతో వచ్చినవి అవి. నిజమైన శివసేనకు సంబంధించిన ఓట్లన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి వచ్చినవి. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేసిన ఉద్ధవ్ థాక్రేకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎదురుతిరిగారో… నేడు మహారాష్ట్ర ప్రజలు కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలేదు. బాలాథాక్రే సిద్ధాంతాలను, ఆలోచనలు, స్ఫూర్తికి అనుగుణంగా తీర్పునిచ్చారు. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. దేశంలో ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో ప్రజల మద్దతు కూడగట్టాం. హర్యానాలో అత్యధిక సీట్లతో మరోసారి బిజెపి ప్రభుత్వం వచ్చింది.’’ అని అన్నారు

