ఏడాది పాలన విజయోత్సవాలు కాంగ్రెస్ దివాలాకోరుతనమే
ఎన్నికల వేళ ముందూ వెనుకా చూసుకోకుండా ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించడం… అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం అధికారమే పరమావధిగా భావించే కాంగ్రెస్ కు వెన్నెతో పెట్టిన విద్య. ఎన్నికల వేళ 6 గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్ల పేరిట గుప్పించిన హామీలు, వాగ్దానాలు అమలు చేయలేక రేవంత్ సర్కార్ పెద్దఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది.
గత కేసీఆర్ ప్రభుత్వంపై అగ్గి మీద గుగ్గిలంలా ఉన్న ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మి హస్తం గుర్తుకు ఓటేస్తే… కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించామా అని ప్రజలు పశ్చాత్తాపపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది పాలన పూర్తవుతున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ గ్యారెంటీ అమలుకు నోచుకోవడం లేదు. అది కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూనే మరోవైపు బస్సులను తగ్గించారు, ట్రిప్పులను కుదించారు. దీంతో ఆర్టీసీపైనే ఆధారపడే సామాన్యుడికి అవసరానికి బస్సులు రావడం లేదు. మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఆర్థిక సాయం హామీకి ఇంతవరకు అతీగతీ లేదు. రూ.500కే గ్యాస్ సిలిండర్ కొంతమందికే అందుతోంది. ఉచిత విద్యుత్ నూ కొందరికే వర్తింప చేసి చేతులు దులిపేసుకుంది. రైతు భరోసా పేరుతో రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15,000 చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చి అది ఇవ్వకపోగా, అమలులో ఉన్న రూ.10,000 సాయానికీ బందు పెట్టింది. వ్యవసాయ కూలీలకు చేస్తానన్న రూ.12,000 ఆర్థిక సాయం అటకెక్కింది. వరికి రూ.500 బోనస్ అని ఇప్పుడు సన్నొడ్లకే అని మెలిక పెట్టింది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్య భరోసా కార్డు, నెలకు రూ.4000 పెన్షన్ వంటి హామీలేవీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనికి తోడు లగచర్లలో గిరిజనుల భూములు లాక్కోవడం, తమ భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులపై పోలీసులతో దాడులు చేయడం, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చడం, గురుకులాల్లో వరుసగా విషాహారం ఘటనలు, నిరుద్యోగుల అడ్డా అయిన అశోక్ నగర్ ను దిగ్బంధించడం వంటి ఘటనలతో ముఖ్యమంత్రి, మంత్రులే కాదు ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు సైతం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవు. 6 గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని క్షేత్రస్థాయి కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తమ నిస్సహాయతను వెల్లడిస్తున్నారు.
కాంగ్రెస్ అలవికాని హామీల అమలులో వైఫల్యం ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ పడుతోంది. తెలంగాణతో పాటు కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ గ్యారెంటీలను ప్రజలు విశ్వసించలేదు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగానే వాగ్దానాలు ఇవ్వాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గ్యారెంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేమని అంగీకరించడమే మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల పరమార్థం.
వరుస వైఫల్యాలతో పలచన అవుతున్నా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు పేరిట ఏడాది పాలన సంబురాలు నిర్వహించడం కాంగ్రెస్ దివాలాకోరుతనానికి మరో నిదర్శనం. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడల్లో ఇదో భాగం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోనే ఎండగడుతూ బిజెపి తెలంగాణ తెలంగాణవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 6 అబద్ధాలు.. 66 మోసాలు పేరిట కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై చార్జ్ షీట్ ను విడుదల చేసింది. హైదరాబాద్ లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. నియోజకవర్గ స్థాయిలోనూ ర్యాలీలు, సభలతో క్షేత్రస్థాయి ప్రజలకు చేరువవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు బిజెపినే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతి బిజెపి కార్యకర్తా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, అదే సమయంలో గత బీఆర్ఎస్ పాలన చీకట్లను గుర్తు చేయాలి. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా బిజెపినే ప్రత్యామ్నాయం అన్న సందేశం సమర్థంగా ప్రజలకు చేరవేయాలి.

