assembly

ధరణిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?

రణి పేరుతో దేశంలోనే అతి పెద్ద కుంభకోణం జరిగిందని, దాని విలువ రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని ఉప ముఖ్య మంత్రి భట్టి చెప్పారని, మరి దీని పై సీబీఐ విచారణకు ఎందుకు కోరడం లేదని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిటింగ్ జడ్జితోనైనా విచారణ జరిపించాలని, ధరణిలో జరిగిన అవినీతి ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభలో భూభారతి బిల్లుపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై గళమెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఒక రోజు ఎడ్లబండిపై అసెంబ్లీకి వెళ్లారు. డిసెంబర్ 20న ధరణిపై జరిగిన చర్చలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ “కేసీఆర్, కుటుంబ సభ్యులు ధరణి ద్వారా భూములు దోచుకున్నారంటూ 2023 డిసెంబరులో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఎన్నికల సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వాటిని కక్కించి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామనీ అప్పుడు చెప్పారు. ఆది ఎంతవరకు వచ్చింది? ధరణితో జరిగిన తప్పులను భూభారతి ద్వారా సరిదిద్దుతామన్నారు… అదెప్పుడు పూర్తవుతుందో చెప్పాలి. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి భూములను రక్షిస్తామని కూడా మీరు చెప్పారు.. అది కూడా ఎప్పుడు పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలి. నిషేదిత జాబితాలో ఉన్న పట్టా భూములను వంద రోజుల్లో తొలగిస్తామన్నారు కదా… అదింకా పూర్తికాలేదు. పేదలను బెదిరించి లక్షల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు రాయించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ భూముల వివరాలను ఎప్పటిలోపు వెల్లడిస్తారో చెప్పాలి. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 24 లక్షల అసైన్డ్ భూములుండేవి. అవి 5 లక్షలకు ఎలా తగ్గాయో బహిర్గతం చేయాలి” అని మహేశ్వర్ రెడ్డి డిమాండు చేశారు.

డిసెంబర్ 17న రాష్ట్ర ఆర్థిక స్థితిపై జరిగిన చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికీ ఎడాపెడా అప్పులు చేస్తోందని విమర్శించారు. ‘‘ఏడాదిలోనే రూ. 1.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా బ్యాంకులో తనఖా పెట్టి అప్పులు తీసుకుంది. FRBM నుంచి తప్పించుకోవడానికి ఇదో ఎత్తుగడ. ఇన్ని అప్పులు చేసినా ఆరు గ్యారంటీలు అమలు కాలేదు. మళ్లీ, మళ్లీ అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని మరింత దివాలా తీయించొద్దు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై మేం అన్నివిధాలా ఒత్తిడి తెస్తాం.’’ అని ఆయన అన్నారు.

రైతుభరోసాకు ఆంక్షలొద్దు: పాయల్ శంకర్

డిసెంబర్ 20న బిజెపి శాసనసభ ఉప పక్షనేత పాయల్ శంకర్ రైతు భరోసా స్వల్ప వ్యవధి చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రైతుల కష్టానికి తగిన ఫలం దక్కడం లేదు. ఫాంహౌజ్ లలో మాదిరిగా రైతుల జీవితాలు ఉండడం లేదు. ఆరుగాలం శ్రమిస్తున్న వారు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. రైతుభరోసా, రుణమాఫీకి ఆంక్షలు తగవు. 5 ఎకరాలకు పరిమితం చేయాలనే ఆలోచన సరి కాదు. 10 అంతకంటే ఎక్కువ ఎకరాలు సాగు చేసే రైతులు కేవలం 64 వేల మంది మాత్రమే. వారికీ సాయం అందజేయాలి. రాష్ట్రంలో రుణమాఫీ పథకం సరిగా అమలు కాలేదు. పీఎం కిసాన్ నిధులు అందిన వారికీ రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. అందరికీ రుణమాఫీ చేయాలి. అన్నదాతలకు ఉచిత వైద్యసౌకర్యం కల్పించాలి. వ్యవసాయ విద్యార్థులకు పూర్తిస్థాయి బోధనా రుసుము చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు రోడ్లు నిర్మించాలి” అని అన్నారు. చాలా మంది రైతుల భూములకు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. దీన్ని ప్రభుత్వం అధ్యయనం చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. ఇక రైతులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, కార్పొరేట్ హాస్పిటళ్లలో రైతుకు ప్రత్యేక వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక వాళ్ల పిల్లలకు విద్యాసంస్థల్లో స్పెషల్ కోటా ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అప్పుడే సమాజంలో రైతుకు గౌరవం పెరుగుతుందని చెప్పారు.

గోషామహల్ మైదానంలో ఉస్మానియా వద్దు: రాజాసింగ్

ఉస్మానియా ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న స్థలంలోనే పునర్ నిర్మించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన డిసెంబర్ 17న మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ మైదానంలో నూతనంగా నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొన్నారు. గోషామహల్ మైదానంలో ఆస్పత్రిని నిర్మిస్తే స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.

అధికార పార్టీ నియోజకవర్గాలకే నిధులు: ధన్‌పాల్

రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సీడీపీ నిధులు విడుదల చేయలేదన్నారు. ఈ ఫండ్ ఎప్పుడు విడుదల చేస్తారో సర్కార్ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.