Modi

ప్రతిభను ప్రోత్సహించేలా విద్యావ్యవస్థ

భారతీయ యువత ప్రస్తుతం నూతన ఆత్మవిశ్వాసంతో ఉందని, వారు ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి, నవ భారత్ ను నిర్మించడానికి యువ ప్రతిభను ప్రోత్సహించడం కీలకమని అన్నారు. ఆ బాధ్యత విద్యావ్యవస్థపై ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో రోజ్‌గార్ మేళా ద్వారా నియామకాలు పొందిన 71,000 మందికి పైగా యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ 23న నియామక పత్రాలను అందించారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాల్లో అభ్యర్థులు ఈ నియామక పత్రాలు అందుకున్నారు.
కొత్తగా నియమితులైన వారు దేశవ్యాప్తంగా హోం వ్యవహారాలు, పోస్టల్ విభాగం, ఉన్నత విద్యావిభాగం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ రోజ్‌గార్ మేళాల ద్వారా భారతీయ యువ ప్రతిభను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. గడచిన ఏడాదిన్నర కాలంలోనే 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా ఉందని తెలిపారు. దేశంలో వివిధ రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మొబైల్ తయారీలో రెండో అతిపెద్ద వ్యవస్థగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. పునరుత్పాదక విద్యుత్తు, ఆర్గానిక్ వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ రంగం, పర్యాటకం, ఆరోగ్యం రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ నూతన అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించే ఈ-నామ్ పథకం నూతన ఉపాధి అవకాశాలకు మార్గం తెరచింది. ఇథనాల్ మిశ్రమంలో పెరుగుదల రైతులకు లబ్ధి చేకూర్చడంతో పాటు చక్కెర రంగంలో ఉద్యోగాలను సృష్టించింది. దాదాపుగా 9,000 వరకు రైతు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోలు)ను ఏర్పాటు చేయడం ద్వారా మార్కెట్ సౌలభ్యం పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల సృష్టి ఎలా జరిగిందో ప్రధానమంత్రి వివరించారు. అలాగే వేల సంఖ్యలో ధాన్యం గోదాములను నిర్మించే బృహత్తర పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది గణనీయమైన స్థాయిలో ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తుంది. డ్రోన్ దీదీ, లఖ్‌పతి దీదీ, బ్యాంకు సఖి యోజన తదితర కార్యక్రమాలు వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. నారీశక్తి వందన్ అధినియం ద్వారా అసెంబ్లీలు, లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని, తద్వారా మహిళల నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి అన్నారు.

యువత సామర్థ్యం అపారం: కిషన్ రెడ్డి

మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల నిధులతో దేశంలో జాతీయ రహదారులు, రైల్వే వ్యవస్థ అభివృద్ధి చేస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో జరిగిన రోజ్ గార్ మేళాలో పాల్గొన్నారు. వివిధ విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రక్షణ రంగంలో ఎగుమతులు 2014లో రూ.900 కోట్లు ఉంటే.. ఇప్పుడు దాదాపుగా రూ.15వేల కోట్ల ఎగుమతులు చేస్తున్నాం. 75 దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. దీని ద్వారా కూడా ఉపాధి గణనీయంగా పెరిగింది. ప్రతి రంగంలోనూ PLIలు ఇవ్వడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతోపాటు, ఉపాధి కల్పన కూడా గణనీయంగా పెంచేందుకు కేంద్రం పని చేస్తోంది. దేశంలో మొత్తం వాణిజ్య ఎగుమతులు 2021-22లో 418 బిలియన్ డాలర్లు. నెలకు దాదాపు 35 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు 2021-22లో నమోదయ్యాయి. ఇవి కాకుండా సేవల ఎగుమతుల కూడా దాదాపు 250 బిలియన్ డాలర్లకు పైగానే నమోదయ్యాయి. ఇవన్నీ కేంద్రం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారతదేశ యువతలో శక్తి సామర్థ్యాలు అపారంగా ఉన్నాయి. అందుకే వారి శక్తి సామర్థ్యాలకు నైపుణ్యమనే ఆయుధాన్ని అందించడం ద్వారా అద్భుతాలు సాధించే దిశగా మోదీ సర్కారు పని చేస్తోంది. మోదీ ప్రభుత్వం కృషితో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారతదేశం ఎదుగుతున్న క్రమంలో ప్రతి రంగం ఆర్థికంగా సమృద్ధి సాధించాలనే సంకల్పంతో మోదీ ప్రభుత్వం పని చేస్తోంది.’’ అని అన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య: బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రీయల్ అకాడమీలోని అంతరిక్ష కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించిన రోజ్ గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని అన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువత ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో తినడానికి తిండి లేక పస్తులుంటూ, ఒక్క పూట భోజనమే తింటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు. ఈ తరుణంలో మోదీ ప్రభుత్వం కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండటం హర్షణీయమన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ప్రధానమంత్రి మోదీ మాట ఇచ్చారని, దానికి కట్టుబడి నేటి వరకు ‘రోజ్ గార్ మేళా’ పేరుతో 9.25 లక్షల మందిని నియామక పత్రాలను అందజేశామన్నారు. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71 వేల మందికి నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.