Ambedkar

కక్షగట్టి అంబేద్కర్‌ను ఓడించిన నెహ్రూ

1951-1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ఇద్దరు నాయకులను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. వారిలో ఒకరు అప్పుడప్పుడే బలం పుంజుకుంటున్న జనసంఘ్, దాని నాయకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. నెహ్రూ ‘జనసంఘ్‌ను అణిచివేస్తానని’ ప్రతిజ్ఞ చేస్తూ బహిరంగంగానే ముఖర్జీపై దాడులకు దిగారు. ఇక రెండో వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్‌ను ఏవిధంగానైనా ఓడించే పనిని నెహ్రూ తనకు విశ్వసనీయులైన కమ్యూనిస్టు మిత్రులకు అప్పగించారు. జవహర్‌లాల్ నెహ్రు తన రాజకీయ, మేధో ప్రత్యర్థుల విషయానికి వస్తే నిజంగా మరుగుజ్జే. తాను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరూ నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ పరిషత్‌లో తన సహచరులుగా ఉంటూ స్వేచ్ఛా భారత రాజ్యాంగ సౌధాన్ని నిర్మించడంలో తమ వంతు సహకారం అందించారనే విషయాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోలేదు.

అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ఇద్దరినీ ఓడించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. వారి పార్లమెంటరీ నైపుణ్యాలు, భారతదేశంలో కొత్త రాజకీయాల కోసం వారు చేసే కృషి ఆయనకు నచ్చలేదు. కమ్యూనిస్టులు మినహా ప్రత్యర్థులు ఎవరూ లేని కొత్త పార్లమెంటును ఏర్పాటు చేయాలని ఆయన కోరుకున్నారు. కన్నూర్‌లో కమ్యూనిస్టు నాయకుడు ఏ.కే. గోపాలన్‌పై నెహ్రూ అభ్యర్థిని నిలబెట్టలేదు. ముఖ్యంగా సర్దార్ పటేల్ మరణానంతరం వామపక్షాలతో ఈ మైత్రి మరింత గాఢమైంది. నెహ్రూ ఎన్ని ప్రయత్నాలు చేసినా డాక్టర్ ముఖర్జీ తన దక్షిణ కలకత్తా సీటు నుంచి విజయం సాధించారు. ఆయన పార్టీ అయిన జనసంఘ్ జాతీయ పార్టీగా అస్తిత్వం నిలుపుకోగలిగింది. బాబాసాహెబ్ ఉత్తర బొంబాయి సీటులో ఓడిపోయారు. నెహ్రూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నియమించిన కమ్యూనిస్టుల కుతంత్రాలే ఆయన ఓటమిలో కీలక పాత్ర నిర్వహించాయి. డాక్టర్ అంబేద్కర్ ఆరోగ్యం పాడైపోవడం వల్ల ఆయన ఎక్కువగా తిరగలేక పోతున్నారని నెహ్రూకి తెలుసు. అయినా ఆయన అంబేద్కర్ ఓటమికి కమ్యూనిస్టు మిత్రులతో సహా అన్ని ఆయుధాలనూ ప్రయోగించారు. రాజ్యాంగాన్ని రూపొందించే బృహత్తరమైన యజ్ఞంలో డాక్టర్ అంబేద్కర్ పూర్తిగా అలసిపోయారని, ఆయనకు మద్దతు ఇవ్వడం తనకు ఒక నైతిక బాధ్యత అని నెహ్రూ భావించలేదు. డాక్టర్ అంబేద్కర్ తన ఓటమి గురించి మాట్లాడుతూ “ఇది (కమ్యూనిస్టు అగ్రనేత) ఎస్.ఏ. డాంగే కుతంత్రాల వల్లే జరిగింది,” అని బాధపడ్డారని ఆయన జీవిత చరిత్రకు సంబంధించి అత్యంత ప్రామాణికమైన రచయితలలో ఒకరైన ధనంజయ్ కీర్ వెల్లడించారు. ప్రచార సమయంలో డాంగే ‘మీ ఓట్లు చెల్లకుండా చేసుకోండి గాని డాక్టర్ అంబేద్కర్‌కు మాత్రం ఓటు వేయకండి.’ అని ఒక దుర్మార్గపు నినాదాన్ని ఇచ్చారు.

డాక్టర్ అంబేద్కర్‌ అభిప్రాయంలో కమ్యూనిజం అంటే ‘కార్చిచ్చు లాటింది’. అది తన దారిలో వచ్చే ప్రతి దానిని కాల్చివేస్తుంది. నెహ్రూ నేర్పుగా ఆ కార్చిచ్చుకు ఆజ్యం పోశారు. డాక్టర్ సవితా అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్‌తో తన జీవిత స్మృతులను గుర్తుచేసుకుంటూ, ఈ మొదటి ఎన్నికలలో నెహ్రూ ఆ నియోజకవర్గంపై ఎలా డేగ కన్ను వేసిందీ, ఎస్.కే. పాటిల్ (ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడు), కమ్యూనిస్టు నాయకుడు ఎస్.ఏ. డాంగేలు ఎలా కలిసి పని చేసిందీ వివరించారు. “’నెహ్రూ, ఎస్‌.కే. పాటిల్, డాంగే సందర్భానికి తగ్గట్టు వ్యూహరచన చేయాలని నిర్ణయించుకున్నారని, అయితే డాక్టర్ అంబేద్కర్‌ను గెలిపించకూడదని నిర్ణయించుకున్నారని’ సవితా అంబేద్కర్ రాశారు. “రాజ్యాంగ నిర్మాత డాక్టర్ సాహెబ్ ఓడిపోయారు. అది సాహెబ్‌ను మానసికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.” సవితా అంబేద్కర్ వర్ణించారు. కాంగ్రెస్ కుట్రలే భారత రాజ్యాంగ నిర్మాత ఓటమికి కారణమయ్యాయి. ఉద్దేశపూర్వకంగా ఆయనను కాంగ్రెస్, కమ్యూనిస్టులు కుట్ర పన్ని ఓడించాయి. ఈ మొదటి ఓటమి పార్లమెంటుకు తిరిగి రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న అంబేద్కర్ ను తీవ్రంగా నిరాశపరిచింది. పార్లమెంటును తన సహజ కార్యక్షేత్రంగా ఆయన భావించారు. దేశ పునరుజ్జీవనం కోసం ఆయన తన మిగిలిన జీవితకాలంలో ఉత్తమమైన సేవలను అందించగల వేదికగా అయన పార్లమెంటును పరిష్కరించారు. “ఎన్నికల్లో ఈ ఘోర పరాజయం, అప్పటికే క్షీణించిన ఆయన ఆరోగ్యంపై అత్యంత హానికరమైన ప్రభావం చూపింది. ఆయన మళ్ళీ దిగులు, నిరాశ, నిస్పృహ, అచేతనత్వాలకు గురయ్యారు,” అని సవితా అంబేద్కర్ రాశారు.

భండారా స్థానం నుండి లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలలో నెహ్రూ, కాంగ్రెస్ బాబాసాహెబ్‌ను రెండోసారి ఓటమికి గురిచేశారు. ఈ ఎన్నికలకు బాబాసాహెబ్ తన ఎన్నికల కన్వీనర్‌గా యువ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దత్తోపంత్ టెంగ్డేను నియమించుకున్నారు. టెంగ్డే తరువాతి రెండు సంవత్సరాలు బాబాసాహెబ్ సహాయకుడిగా సన్నిహితంగా పని చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్‌ను స్థాపించారు. నిజానికి భండారా ఉపఎన్నికలు కాంగ్రెస్‌కు బాబాసాహెబ్ విషయంలో గతంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి, తన సంకుచితత్వాన్ని వదిలిపెట్టి ఉదాత్తతను చాటుకోడానికి ఒక అవకాశం ఇచ్చాయి. అయినా నెహ్రూ బాబాసాహెబ్‌పై గుడ్డి వ్యతిరేకతను కొనసాగించారు. రాజ్యాంగకర్తను సముచిత గౌరవంతో తిరిగి పార్లమెంటుకు ఆహ్వానించే విశాల హృదయాన్ని కాంగ్రెస్ ప్రదర్శించి ఉండాల్సిందని డాక్టర్ సవితా అంబేద్కర్ ఎంతో ఆవేదనతో రాశారు. దేశహితం కోసం బాబాసాహెబ్‌ను లోక్‌సభకు ఎన్నుకునే అవకాశం నెహ్రూ కల్పించి ఉండాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ డాంగే లాంటి వ్యక్తితో చేయి కలిపి సాహెబ్‌ను ఓడించేందుకు తన శక్తినంతా ఉపయోగించి అన్ని రకాల కుతంత్రాలకు దిగింది. కాంగ్రెస్‌కు దేశ సంక్షేమం కంటే పార్టీ ప్రయోజనాలే ఎక్కువని ఇది రుజువు చేసింది. భండారా ఎన్నికల సమయంలో డాక్టర్ అంబేద్కర్ నెహ్రూ, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు ఆయన జీవిత చరిత్రను కీర్‌ రాశారు. “ప్రజలకు ప్రతిపక్షం తరఫున ప్రత్యామ్నాయ దృక్పథాన్ని అందించేందుకు వీలుగా” తాను ఎన్నికల్లో పోరాడుతున్నానని డాక్టర్ అంబేద్కర్ భండారా ఉప ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో రాజీకి సిద్ధమైతే ఆయన పార్లమెంటులో ప్రవేశించడం కష్టమై ఉండేది కాదని, కాంగ్రెస్‌తో రాజీ పడకూడదని బాబాసాహెబ్ దృఢంగా నిర్ణయించుకున్నారని, తద్వారా తన చివరి సంవత్సరాల్లో రాజకీయ అవమానాలను ఎదుర్కొన్నారని కీర్ తెలిపారు. అందువల్ల ఇప్పుడు నెహ్రూ వారసులు రాజ్యాంగాన్ని చేత్తో పట్టుకుని నీతులు చెబుతుంటే అత్యంత హాస్యాస్పదంగా ఉంటుంది. వారి చర్యను ఓడిపోయిన రాజకీయ ముఠా నాయకుల అసంబద్ధమైన, నిస్పృహతో కూడిన చేష్టగా మాత్రమే పరిగణించాలి.

అనిర్బన్ గంగూలీ,
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు