ఒక దేశం – ఒక ఎన్నిక: విప్లవాత్మక సంస్కరణ
భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో వినూత్న మార్పులకు నాంది పలికే ప్రతిపాదన “ఒక దేశం – ఒకే ఎన్నిక”. ఈ సంస్కరణ ఆవశ్యకత, ప్రయోజనాలు, దీని విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కొత్త దిశగా నడిపించగల విప్లవాత్మక అడుగుగా ప్రశంసిస్తున్నారు.
“ఒక దేశం – ఒకే ఎన్నిక” అంటే ఏమిటి?
ప్రస్తుతం భారత్లో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలు, ఇతర సంస్థల ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి. “ఒక దేశం – ఒకే ఎన్నిక” అంటే, ఒకేసారి దేశవ్యాప్తంగా పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలను నిర్వహించడం. ఇది గతంలో ఉన్న విధానానికి తిరిగి చేరిక చేయడమే అని చెప్పవచ్చు.
ఈ పథకం ఆవశ్యకత
- ఎన్నికల వ్యయం తగ్గింపు: ప్రతి ఎన్నికకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. “ఒక దేశం – ఒకే ఎన్నిక” వలంల ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది. ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు, పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో వినియోగించవచ్చు.
- నిరంతర అభివృద్ధికి సహకారం: తరచూ ఎన్నికలు జరగడం వల్ల పథకాల అమలు నిలిచిపోతుంది. ఇంకా ప్రభుత్వం దృష్టి అభివృద్ధి కార్యక్రమాల నుంచి ఎన్నికల ప్రచారాలపైకి మళ్లుతుంది. ఒకే ఎన్నిక జరిగితే ప్రభుత్వం పూర్తి సమయాన్ని అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించగలదు. పాలనా వ్యవస్థ నిరంతరాయంగా పని చేయగలదు.
- ప్రజాస్వామ్య విలువల బలోపేతం: తరచూ ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మధ్య అధిక పోటీ, ప్రతిస్పందనల వల్ల ప్రజాస్వామ్యానికి చెడు ప్రభావం పడుతోంది. ఒకే ఎన్నిక వల్ల ఈ పరిస్థితిని నివారించవచ్చు.
- శక్తి, మనోబలం దృఢీకరణ: ఎన్నికల నిర్వహణలో లక్షలాది సిబ్బంది, భద్రతా దళాలు పాల్గొంటాయి. తరచూ జరిగే ఎన్నికలు ఈ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతాయి. ఒకే ఎన్నిక వల్ల ఇది తగ్గుతుంది.
- ప్రజల ఇబ్బందులు తగ్గింపు: ప్రజలు అనేక ఎన్నికల కారణంగా తరచూ ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఒకే ఎన్నిక నిర్వహణ ప్రజలకు సౌలభ్యం కలిగిస్తుంది.
“ఒక దేశం – ఒకే ఎన్నిక” అనే ప్రతిపాదన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ సంస్కరణపై దేశవ్యాప్తంగా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.
సవాళ్లు
- రాజ్యాంగ సంబంధమైన సవాళ్లు: ప్రస్తుత రాజ్యాంగంలోని నిబంధనలను మార్పు చేయాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలలో మద్దతు అవసరం.
- రాష్ట్రాల అభిప్రాయాలు: అన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాలి. ప్రాంతీయ పార్టీలు, రాజకీయ నాయకులు విభేధించే అవకాశం ఉంది.
- లాజిస్టికల్ సమస్యలు: దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదనపై భారతదేశం ఉత్సాహంగా స్పందిస్తోంది. ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఇది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఒక ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తోంది. “ఒక దేశం – ఒకే ఎన్నిక” అమలయితే భారత ప్రజాస్వామ్యానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.
జీ.వెంకన్న నాయక్,
బిజెపి నాయకులు

