Rann Utsav

రణ్ ఉత్సవ్: ఒక జీవితకాల అనుభవం

భారతదేశం పశ్చిమ అంచున కచ్ ఉంది. ఇది గొప్ప వారసత్వంతో కూడిన మంత్రముగ్ధమైన భూమి. ఎంతో ప్రసిద్ధి చెందిన విస్తారమైన ఉప్పు ఎడారి వైట్ రణ్ కచ్‌లోనే ఉంది. ఇది వెన్నెలలో ప్రకాశిస్తుంది, మరో లోకపు అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న కళలు, హస్తకళలకు కూడా సమానంగా ప్రసిద్ధి చెందింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇది ఇతర ప్రాంతాల వారిని ప్రేమగా ఆహ్వానించి ఆదరించే ప్రజలకు నిలయం. వారు తమ మూలాల గురించి గర్విస్తారు, ప్రపంచంతో మమేకం కావడానికి ఉత్సుకతతో ఉంటారు. మంచి మనస్సు గల కచ్ ప్రజలు ప్రతి సంవత్సరం రణ్ ఉత్సవ్ కోసం తమ తలుపులను తెరుస్తారు. ఈ ప్రాంతం ప్రత్యేకత, అద్భుతమైన సౌదర్యం, శాశ్వత స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది ఈ నాలుగు నెలల వేడుక.

కచ్‌ను సందర్శించి రణ్ ఉత్సవ్‌ను ఆస్వాదించాలని మీ అందరినీ, కష్టపడి పనిచేసే వృత్తి నిపుణులను, వారి కుటుంబాలను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను. 2024 డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ రణ్ ఉత్సవ్ 2025 ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఇక రణ్ ఉత్సవ్‌లోని టెంట్ సిటీ 2025 మార్చి వరకు తెరిచి ఉంటుంది. రణ్ ఉత్సవ్ జీవితకాల అనుభవంగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వైట్ రణ్ అద్భుతమైన నేపథ్యంలో టెంట్ సిటీ సౌకర్యవంతమైన బసను ఆడిస్తుంది. సేదతీరాలనుకునే వారికి ఇది సరైన, చక్కటి ప్రదేశం. చరిత్ర, సంస్కృతిలోని కొత్త కోణాలను తెలుసుకోవాలనుకునేవారికి కూడా ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది. రణ్ ఉత్సవ్ కార్యకలాపాలలో పాల్గొనడంతో పాటు, మీరు వీటిని చేయవచ్చు:

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం (సింధు లోయ నాగరికతతో ముడిపడి ఉన్న) ధోలావీరా సందర్శనతో మన ప్రాచీనగతంతో అనుసంధానం అవ్వండి. 

కాలా దుంగార్‌లోని విజయ్ విలాస్ ప్యాలెస్‌ను సందర్శించడం ద్వారా ప్రకృతితో అనుసంధానం అవ్వండి. తెల్లని ఉప్పు పాన్లతో కూడిన ‘రోడ్ టు హెవెన్’ భారతదేశంలో అత్యంత సుందరమైన రహదారి. ఇది సుమారు 30 కిలోమీటర్ల పొడవు ఉంది. ఖావ్డాను ధోలావీరాతో కలుపుతుంది.

లఖ్ పత్ కోటను సందర్శించడం ద్వారా మన మహిమాన్వితమైన సంస్కృతితో అనుసంధానం కండి.

మాతా నో మాధ్ ఆశాపుర ఆలయంలో ప్రార్థించి ఆధ్యాత్మిక మూలాలతో అనుసంధానం అవ్వండి.

క్రాంతి తీర్థంలోని శ్యాంజీ కృష్ణవర్మ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించి మన స్వాతంత్య్ర పోరాటంతో మమేకం అవ్వండి.

అన్నింటికంటే ముఖ్యంగా, మీరు కచ్ హస్తకళల ప్రత్యేక ప్రపంచాన్ని పరిశీలించవచ్చు, ప్రతి ఉత్పత్తి ప్రత్యేకమైనది, కచ్ ప్రజల ప్రతిభను సూచిస్తుంది.

కొంతకాలం క్రితం, 2001 జనవరి 26 భూకంపం సమయంలో మనం కోల్పోయిన వారి స్మారక చిహ్నమైన స్మృతి వనాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. యునెస్కోలో ప్రిక్స్ వెర్సైల్స్ 2024 వరల్డ్ టైటిల్ – ఇంటీరియర్స్‌ను గెలుచుకోవడం ద్వారా ఇది అధికారికంగా ప్రపంచంలోని అత్యంత అందమైన మ్యూజియంగా గుర్తింపు పొందింది! ఈ ఘనత సాధించిన భారతదేశపు ఏకైక మ్యూజియం కూడా ఇదే. ఎన్నో సవాళ్లతో కూడుకున్న వాతావరణంలో కూడా మనుషులు అలా పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారగలరు, ఎలా ఎదగగలరు అనేదానికి ఇది ఒక ప్రతీకగా మిగిలిపోతుంది.

అప్పటికి, ఇప్పటికి తేడాను తెలిపే ఒక సన్నివేశం:

సుమారు 20 సంవత్సరాల క్రితం, మిమ్మల్ని కచ్‌కు ఆహ్వానిస్తే, ఎవరో మీతో జోక్ చేస్తున్నారని మీరు అనుకుంటారు. అన్నింటికీ మించి, భారతదేశంలోని అతిపెద్ద జిల్లాలలో ఒకటిగా ఉన్నప్పటికీ కచ్ చాలావరకు విస్మరణకు గురైంది. దాని మానాన దాన్ని వదిలేశారు. కచ్ సరిహద్దులో ఒక వైపు రేగిస్థాన్ (ఎడారి), మరోవైపు పాకిస్తాన్ ఉన్నాయి. 1999లో సూపర్ సైక్లోన్, 2001లో భారీ భూకంపం సంభవించాయి. కరవు సమస్య పునరావృత్తమవుతూనే ఉంది. అందరూ కచ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కానీ వారు కచ్ ప్రజల సంకల్పాన్ని తక్కువగా అంచనా వేశారు. కచ్ ప్రజలు తమ సత్తా ఏమిటో చూపించారు, 21 వ శతాబ్దం ప్రారంభంలో, వారు చరిత్రలో సాటిలేని పథాన్ని ఎంచుకున్నారు. అందరం కలిసి కచ్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాం. విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం, అదే సమయంలో కచ్ యువత పని కోసం తమ ఇళ్లను విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా జీవనోపాధిని కల్పించడంపై దృష్టి పెట్టాం. 21 వ శతాబ్దం మొదటి దశాబ్దం చివరి నాటికి నిరంతర కరవులకు పేరుమోసిన భూమి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. మామిడితో సహా కచ్ నుంచి పండ్లు విదేశీ మార్కెట్లకు చేరాయి. కచ్ రైతులు బిందు సేద్యం, ఇతర పద్ధతులను నేర్చుకున్నారు. ఇది ప్రతి నీటి బొట్టును సంరక్షించి గరిష్ట ఉత్పాదకతను నిర్ధారించింది.

గుజరాత్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయడంతో జిల్లాలో పెట్టుబడులు పెరిగాయి. సముద్ర వాణిజ్య కేంద్రంగా ఈ ప్రాంతం ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి కచ్ తీరాన్ని కూడా ఉపయోగించాం. 2005లో కచ్‌లో ఇంతకుముందు కనిపించని పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి 2005లో రణ్ ఉత్సవ్ ప్రారంభమైంది. ఇది ఇప్పుడు ఒక శక్తిమంతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. రణ్ ఉత్సవ్ అనేక దేశీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ టూరిజం సంస్థ 2023 ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రతి సంవత్సరం రణ్ ఉత్సవ్ జరిగే ధోర్డో గ్రామం ఎంపికైంది. సాంస్కృతిక సంరక్షణ, సుస్థిర పర్యాటకం, గ్రామీణాభివృద్ధికి గానూ ఈ గ్రామం ఈ గుర్తింపు పొందింది. అందువల్ల, త్వరలోనే కచ్‌లో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను! కచ్‌ను సందర్శించడానికి ఇతరులను ప్రేరేపించడానికి మీ అనుభవాలను సోషల్ మీడియాలో కూడా పంచుకోండి.

నరేంద్ర మోదీ,
భారత ప్రధానమంత్రి

Tags: