dadi

బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి

Cong attackతెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హింసా రాజకీయాలకు తెరతీసింది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్న రేవంత్ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ లో బిజెపిపై దాడులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ గూండాలు జనవరి 7న బిజెపి రాష్ట్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. నగరం నడిబొడ్డున కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సంచరించే బిజెపి కార్యాలయానికి కాంగ్రెస్ గూండాలు రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో రాగలిగారంటే వారికి పోలీసుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కాంగ్రెస్ గూండాలు రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో బిజెపి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బిజెపి కార్యాలయానికి తగిన భద్రత కల్పించకపోవడం, కార్యాలయం మీదికి దూసుకొస్తోన్న కాంగ్రెస్ గూండాలను నిలవరించకపోవడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండే ఈ దాడి చేయిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

కాంగ్రెస్ గూండాలు బిజెపి కార్యాలయంపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. కర్రలతో పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు ఆసుపత్రిపాలయ్యారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ కూ గాయాలయ్యాయి. ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి నందరాజ్ రక్తమోడాడు. అనేక మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. దిల్లీలో ఓ బిజెపి నేత రమేశ్ భిదూరీ అప్రయత్నంగా అన్న మాటలను సాకుగా చూపి బిజెపి కార్యకర్తలపై దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా భౌతిక దాడికి దిగడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి పరాకాష్ట. రమేశ్ భిదూరీ హుందాగా తప్పును ఒప్పుకొని, తను అన్న మాటలను ఉపసంహరించుకొని, క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కాంగ్రెస్ తమ గూండాలను బిజెపి కార్యాలయంపై దాడికి ఉసిగొల్పిందంటే వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తికి అద్దం పడుతుంది.

బిజెపి ఎంపీ వ్యాఖ్యలపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటే కర్రలు, రాళ్లు, కోడిగుడ్లు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నీతినిజాయితీ, క్రమశిక్షణకు కట్టుబడిన బిజెపి కార్యకర్తలు పరిణతితో వ్యవహరించి, సంయమనం పాటించి పరిస్థితి చేయిదాటకుండా చూశారు. బిజెపి కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి వేరేలా ఉండేది. బెదిరింపులు, దాడులతో బిజెపిని భయపెట్టాలని కాంగ్రెస్ అనుకుంటే అవివేకమే అవుతుంది. తుపాకీ తూటాలనే ఎదుర్కొన్న చరిత్ర బిజెపి కార్యకర్తలకు ఉంది. ఇలాంటి దాడులను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి దాడులతో బిజెపి కార్యకర్తలు మరింత దూకుడుతో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాస్వామ్యయుతంగానే ఎండగడతారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక, ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి నీచపు ఎత్తుగడలకు పాల్పడుతుందని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తప్పేమీ కాదు, కానీ ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. నిరసనలు, ఆందోళనల పేరిట దాడులకు తెగబడడం ఏమాత్రం సమర్థనీయం కాదు. పైగా అధికారంలో ఉన్న పార్టీ మరింత బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలి, కానీ ఆ విచక్షణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఏమాత్రం లేకుండాపోయింది. కాంగ్రెస్ గూండాలు బిజెపి కార్యాలయంవైపు దూసుకొస్తుంటే పోలీసులు ఎక్కడ? ఎందుకు వారిని అడ్డుకోలేకపోయారు? ఇంటెలిజెన్స్ ఎందుకు విఫలమైంది? బిజెపి ప్రజాస్వామ్యయుత నిరసనకు పిలుపిచ్చినా, ఎవరైనా రాష్ట్ర మంత్రులు పర్యటనలకు వస్తున్నా… బిజెపి నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధం చేసే పోలీసులు కాంగ్రెస్ గూండాల విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. హోం శాఖను కూడా తన వద్ద ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలతోనే చూసిచూడనట్టు వ్యవహరించారా? అన్న అనుమానాలు సహజంగా వస్తున్నాయి.

nanduతెలంగాణలో ఈ తరహా దాడి జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి హింసాయుత రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్. రాజకీయాల కోసం 1991లో హైదరాబాద్ లో మత ఉద్రిక్తతలు సృష్టించిన నీచ చరిత్ర కాంగ్రెస్ కుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలంగాణలో హింసా రాజకీయాలు పెచ్చరిల్లాయి. ఇవి రాష్ట్రానికి, సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచివి కావు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకోవాలి. ప్రతికార దాడులతో ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజల దృష్టిలో మరింత పలచన అవడం ఖాయం.

 పిరికిపిందల చర్య: కిషన్ రెడ్డి

బిజెపి తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్సుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపిందల చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘‘పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బిజెపి కార్యాలయంపై దాడికి పాల్పడటం దుర్మార్గం. కాంగ్రెస్ గూండాలు కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదు. ఇలాంటి రాజకీయాలకు మేం పూర్తి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయి. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న తరుణంలో.. అసహనంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బిజెపి కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచే విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్ కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరుగలేని పరిస్థితులు ఏర్పడుతాయి. రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను. మా సహనాన్ని అసమర్థతగా భావించొద్దు. మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించం. అలాగని మాపై దాడులు చేస్తే సహించం. ఎవరి వ్యాఖ్యలైనా మీకు నచ్చకపోతే.. నిరసన తెలియజేయండి అంతే కాని.. కార్యాలయంపై భౌతికంగా దాడి చేయడం, రాళ్లు, కర్రలతో దాడికి దిగడం సరికాదు. తన వ్యాఖ్యలకు దిల్లీకి చెందిన మాజీ ఎంపీ రమేశ్ భిదూరీ గారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. అసహనంతో దాడులు చేయడం సరైనదేనా.. గతంలోనూ ప్రధానమంత్రికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు.. తీవ్ర అసహనంతో.. తక్కువ కులం వాడు, చాయ్ అమ్ముకునే వ్యక్తి ఎలా ప్రధాని అవుతారు, మౌత్ కా సౌదాగర్, హిట్లర్ వంటి ఎన్నో అవాకులు, చెవాకులు పేలారు. దీన్ని ఖండిస్తూ బిజెపి ఎక్కడైనా దాడులు చేసిందా? ఈ వ్యాఖ్యలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక్కసారైనా క్షమాపణలు చెప్పారా? అలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు.’’ అని అన్నారు.

Kasamచిల్లర రాజకీయాలు మానుకోవాలి: డి.కె. అరుణ

బిజెపి రాష్ట్ర కార్యాలయంపై  కాంగ్రెస్ దాడిని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ తీవ్రంగా ఖండించారు. ‘‘తెలంగాణలో ఇలాంటి గూండా రాజకీయాలు సాగవు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబడ్దార్… ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బాధ్యులను ఎవ్వరినీ వదిలేదు లేదు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. దీని వెనుక రేవంత్ కుట్ర దాగి ఉంది. సీఎం రేవంత్ బాధ్యత వహించాలి. పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహారించాలి, ఏవ్వరినీ వదలొద్దు.’’ అని డి.కె. అరుణ అన్నారు.

పోలీసులు ప్రేక్షకపాత్ర: డా.కె. లక్ష్మణ్

బిజెపి రాష్ట్ర కార్యాలయంపై, బిజెపి కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడిన ఘటనను రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో బిజెపి కార్యాలయానికి వస్తున్నారనే సమాచారం తెలిసినా, దాడికి పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలకు బిజెపి పూర్తి వ్యతిరేకమని తెలిపారు. హింసాత్మక దాడులకు పాల్పడటం కాంగ్రెస్ రాజకీయ సమాధికి గోతులు తవ్వుకున్నట్లేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు, దౌడులు, దౌర్జన్యాలకు బిజెపి కార్యకర్తలు భయపడరనేది గుర్తుపెట్టుకోవాలని లక్ష్మణ్ హెచ్చరించారు.

మా సహనాన్ని పరీక్షించవద్దు: ఈటల

బిజెపి రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ‘‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మీ ఇంటిలిజెన్స్ పని చేస్తుందా లేదా? పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంసృతి సిగ్గుచేటు. మీ పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? బిజెపి కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. గుండాల మాదిరిగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి.’’ అని హెచ్చరించారు.

కాంగ్రెస్ పతనం మొదలైంది: రఘునందన్

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ ‘‘ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలి. ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారు. గతంలో తమ సొంత ముఖ్యమంత్రిని దించడం కోసం చెప్పులు వేయడం, మత కల్లోలాలు సృష్టించడం వారి చరిత్రలో భాగమే. నకిలీ గాంధీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ కొందరు రౌడీషీటర్లు కాంగ్రెస్ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి కార్యాలయంపై దాడులకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పతనం బిజెపి కార్యాలయంపై దాడితో మొదలైందని గుర్తుపెట్టుకోండి.’’ అని అన్నారు. బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు కాంగ్రెస్ గూండాల దాడులను తీవ్రంగా ఖండించారు.

నందురాజ్‌ను పరామర్శించిన సంజయ్

BSK Visit nanduకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో గాయపడిన దళిత కార్యకర్త నందురాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. పాతబస్తీలో బహదూర్‌పురాలోని నందు ఇంటికి వెళ్లిన బండి సంజయ్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తలకు గాయం కావడంతో చికిత్స తీసుకున్నట్లు నందు వివరించారు. ఈ సందర్భంగా దాడి ఘటన పూర్వాపరాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. నందురాజ్ త్వరగా కోలువాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దాడులపై ఆయన స్పందిస్తూ ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్  నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇనుప రాడ్లు, రాళ్లు, గుడ్లు, కర్రలతో బిజెపి కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటు. నిన్న జరిగిన ఘటనను చూస్తే….కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై బిజెపి ఎప్పటి కప్పుడు నిలదీస్తుంటే ఓర్వలేక ఈ దాడులు చేయించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం పని చేయాలి. కాని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే ఇటువంటి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం.’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలున్న పార్టీ బిజెపి. కాంగ్రెస్ మూకల దాడులకు భయపడే ప్రసక్తే లేదు. మా కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు. మా కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ పునాదులుండవ్. అసలు కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరని గుర్తుంచుకుంటే మంచిది. కాంగ్రెస్ నేతల దాడులకు, బెదిరింపులకు బిజెపి లొంగదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి  తీసుకెళ్లి ఎండగడతాం.  ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.’’ అని పేర్కొన్నారు.