One Nation One Election

ఒక దేశం – ఒక ఎన్నిక: విప్లవాత్మక సంస్కరణ

భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో వినూత్న మార్పులకు నాంది పలికే ప్రతిపాదన “ఒక దేశం – ఒకే ఎన్నిక”. ఈ సంస్కరణ ఆవశ్యకత, ప్రయోజనాలు, దీని విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కొత్త దిశగా నడిపించగల విప్లవాత్మక అడుగుగా ప్రశంసిస్తున్నారు.

“ఒక దేశం – ఒకే ఎన్నిక” అంటే ఏమిటి?

ప్రస్తుతం భారత్‌లో పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలు, ఇతర సంస్థల ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి. “ఒక దేశం – ఒకే ఎన్నిక” అంటే, ఒకేసారి దేశవ్యాప్తంగా పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలను నిర్వహించడం. ఇది గతంలో ఉన్న విధానానికి తిరిగి చేరిక చేయడమే అని చెప్పవచ్చు.

ఈ పథకం ఆవశ్యకత

  1. ఎన్నికల వ్యయం తగ్గింపు: ప్రతి ఎన్నికకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. “ఒక దేశం – ఒకే ఎన్నిక” వలంల ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది. ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు, పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో వినియోగించవచ్చు.
  2. నిరంతర అభివృద్ధికి సహకారం: తరచూ ఎన్నికలు జరగడం వల్ల పథకాల అమలు నిలిచిపోతుంది. ఇంకా ప్రభుత్వం దృష్టి అభివృద్ధి కార్యక్రమాల నుంచి ఎన్నికల ప్రచారాలపైకి మళ్లుతుంది. ఒకే ఎన్నిక జరిగితే ప్రభుత్వం పూర్తి సమయాన్ని అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించగలదు. పాలనా వ్యవస్థ నిరంతరాయంగా పని చేయగలదు.
  3. ప్రజాస్వామ్య విలువల బలోపేతం: తరచూ ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మధ్య అధిక పోటీ, ప్రతిస్పందనల వల్ల ప్రజాస్వామ్యానికి చెడు ప్రభావం పడుతోంది. ఒకే ఎన్నిక వల్ల ఈ పరిస్థితిని నివారించవచ్చు.
  4. శక్తి, మనోబలం దృఢీకరణ: ఎన్నికల నిర్వహణలో లక్షలాది సిబ్బంది, భద్రతా దళాలు పాల్గొంటాయి. తరచూ జరిగే ఎన్నికలు ఈ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతాయి. ఒకే ఎన్నిక వల్ల ఇది తగ్గుతుంది.
  5. ప్రజల ఇబ్బందులు తగ్గింపు: ప్రజలు అనేక ఎన్నికల కారణంగా తరచూ ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఒకే ఎన్నిక నిర్వహణ ప్రజలకు సౌలభ్యం కలిగిస్తుంది.

“ఒక దేశం – ఒకే ఎన్నిక” అనే ప్రతిపాదన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ సంస్కరణపై దేశవ్యాప్తంగా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.

సవాళ్లు

  1. రాజ్యాంగ సంబంధమైన సవాళ్లు: ప్రస్తుత రాజ్యాంగంలోని నిబంధనలను మార్పు చేయాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంట్‌లో, రాష్ట్ర అసెంబ్లీలలో మద్దతు అవసరం.
  2. రాష్ట్రాల అభిప్రాయాలు: అన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాలి. ప్రాంతీయ పార్టీలు, రాజకీయ నాయకులు విభేధించే అవకాశం ఉంది.
  3. లాజిస్టికల్ సమస్యలు: దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదనపై భారతదేశం ఉత్సాహంగా స్పందిస్తోంది. ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఇది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఒక ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తోంది. “ఒక దేశం – ఒకే ఎన్నిక” అమలయితే భారత ప్రజాస్వామ్యానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.

జీ.వెంకన్న నాయక్,
బిజెపి నాయకులు