Delhi results

హస్తినలో కాషాయ జెండా రెపరెపలు

స్తినలో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. దేశ రాజధాని దిల్లీలో కమలం వికసించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించింది. 70 సీట్లు ఉన్న దిల్లీ అసెంబ్లీలో 48 చోట్ల బిజెపి అభ్యర్థులు విజయం సాధించి గెలుపు బావుటా ఎగరేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ విజయదుందుభి మోగించిన బిజెపి ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది. దీంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినా దిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే వ్యథ తీరిపోయింది. ఆప్‌ నేతలపై వచ్చిన ఆరోపణలు, ఇటీవలి కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ప్రకటించిన ఆదాయపు పన్ను వరాలు, దిల్లీ అభివృద్ధికి ప్రధాని మోదీ స్వయంగా ఇచ్చిన హామీలు.. ఇలాంటివన్నీ ఓటర్ల మది దోచుకున్నాయి. ఆ దెబ్బకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా ఆ పార్టీ సీనియర్‌ నేతలు- మనీశ్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్, సోమనాథ్‌ భారతి, సౌరభ్‌ భరధ్వాజ్‌ వంటివారంతా పరాజితులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఆప్‌ 12 ఏళ్ల పాలనకు తెరపడింది. దిల్లీని 15 ఏళ్లపాటు ఏలిన కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఒక్కచోటైనా బోణీ కొట్టలేకపోయింది. ఆ పార్టీ తరఫున బరిలో దిగిన సందీప్‌ దీక్షిత్‌ (మాజీ సీఎం షీలా దీక్షిత్‌ తనయుడు), అల్కా లాంబా వంటివారంతా ఓడిపోయారు.

దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగగా 8న ఫలితాలు ప్రకటించారు. బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్‌ వర్మ తనయుడు పర్వేశ్‌ వర్మ న్యూదిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను 4,089 ఓట్ల తేడాతో ఓడించారు. కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, వర్మకు 30,088 ఓట్లు వచ్చాయి. జంగ్‌పురలో బిజెపి అభ్యర్థి తర్వీందర్‌సింగ్‌ చేతిలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా 675 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. షాకుర్‌ బస్తీలో సత్యేందర్‌ జైన్‌ 19వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికలతో కలిపి కాంగ్రెస్‌ పార్టీకి వరసగా మూడు అసెంబ్లీ సమరాల్లో ఓటమి మిగిలినట్లయింది. ఒక్కటంటే ఒక్కస్థానం కూడా ఆ పార్టీకి దక్కలేదు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వంతో బిజెపి తిరుగులేని విజయం సాధించింది. పక్కా లోకల్‌ ప్రణాళిక.. ఆప్‌పై అవినీతి ఆరోపణల ప్రచారం.. మోదీ కరిష్మా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆదాయపు పన్ను మినహాయింపులతోపాటు సంక్షేమం, అభివృద్ధి నినాదాలు బిజెపిని గెలిపించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే దిల్లీ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చేసిన డబుల్‌ ఇంజిన్‌ ప్రచారం బాగా పని చేసింది. అంతేకాదు, బూత్‌ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో బిజెపి ప్రణాళికలు వేసింది. ప్రతి బూత్‌లో కనీసం 50శాతం ఓట్లు, అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన కంటే 20వేల ఓట్లను అధికంగా సాధించాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఈ మేరకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సిటింగ్‌ ఎంపీలైన పర్వేశ్‌ వర్మ, రమేష్‌ బిధూరిలకు టికెట్లు ఇవ్వకుండా వారిని 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తురుపు ముక్కలుగా ప్రయోగించింది. వారు స్థానికంగా విస్తృతంగా తిరిగారు. ఒకరిని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై, మరొకరిని ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీపై నిలబెట్టి ఆప్‌ అగ్ర నేతలు బయటి వ్యవహారాలపై ఎక్కువ దృష్టి సారించకుండా కట్టడి చేసే ప్రయత్నం చేసింది. ఆరెస్సెస్‌ నిగూఢంగా చేసిన ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. ఆ సంస్థ వాలంటీర్లు ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. దిల్లీలోని సమస్యలను వారికి వివరించి బిజెపివైపు మొగ్గు చూపేలా చేశారు.

ఆప్ అగ్ర నేతలపై మద్యం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు, వారంతా జైలుకెళ్లి రావడం, పార్టీ అధినేత కేజ్రీవాల్‌ సకల సౌకర్యాలతో భారీగా ఖర్చు చేసి రాజ మహల్‌లాంటి ఇంటిని నిర్మించుకోవడం, పాలన విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో తరచూ వివాదాలు, ఇండియా కూటమిలో చీలికలు వంటివి ఆప్‌ పరాజయానికి కారణంగా చెప్తున్నారు. ఇది పార్టీ ఏర్పాటయ్యాక ఎదురైన అత్యంత ఘోర ఓటమి కావడం గమనార్హం. అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన నేతలంతా ఓడిపోయారు. దీంతో నైతికంగా విజయం సాధించామని చెప్పుకోవడానికీ ఆ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2022లో కేజ్రీవాల్‌కు కుడిభుజంలాంటి సత్యేంద్ర జైన్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో తొలిసారి ఆ పార్టీకి షాక్‌ తగిలింది. అదే ఏడాది మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోదియా, మరో నేత సంజయ్‌ సింగ్‌లు జైలుకెళ్లారు. దీంతో ఆప్‌ నైతిక బలాన్ని కోల్పోయింది. తమ అరెస్టులు రాజకీయ కక్ష సాధింపన్న ఆప్‌ సమర్థనలను ప్రజలు విశ్వసించలేదు.

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 6శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ నెగ్గలేదు. ఎంత ఘోరంగా ఓడిందంటే చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. కొన్ని చోట్లయితే నాలుగో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్‌ చాలా స్థానాల్లో బలమైన అభ్యర్థులనే నిలబెట్టినప్పటికీ వారెవ్వరూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. కమ్యూనిస్టులు, ఎంఐఎం తదితర పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

రెట్టించిన వేగంతో దిల్లీలో అభివృద్ధి

‘‘దేశ రాజధానిలో ప్రజలు ‘ఆప్‌-దా’(ముప్పు)ను బయటకు పంపారు. పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి దిల్లీకి విముక్తి లభించింది. పదేళ్లపాటు కొందరు అహంకారంతో పాలించారు. ఇక నుంచి వికాస్, విజన్, విశ్వాస్‌ నినాదాలతో దిల్లీలో పరిపాలన సాగిస్తాం.’’ అని దిల్లీ చారిత్రాత్మక విజయం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రెట్టించిన వేగంతో దిల్లీలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. దిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 8న నిర్వహించిన సంబరాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ యమునా నదిని శుద్ధి చేసేందుకు అన్ని చర్యలూ చేపడతామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం, పర్యావరణ కాలుష్యం వంటి పురపాలన సంబంధ సమస్యలను పరిష్కరించి దిల్లీని భవిష్య నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంత సమయం పట్టినా, ఎంత శక్తిని వెచ్చించాల్సి వచ్చినా యమునా నదికి సేవ చేయడానికి తాను అన్ని ప్రయత్నాలూ చేస్తానని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా దిల్లీ, దాని చుట్టూ ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, ఇది రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని వ్యాఖ్యానించారు. 

ఆలయాల చుట్టూ తిరుగుతూ బిజెపి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి కాంగ్రెస్‌ విఫలయత్నం చేసిందని, చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకుందని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇండియా కూటమి సభ్యులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీకి దిగారు. వాళ్లు కాంగ్రెస్‌ను ఓడించగలిగినా ఆప్‌ను గెలిపించలేకపోయారు. కాంగ్రెస్‌ తాను మునుగుతూ తన మిత్రపక్షాలనూ ముంచుతోంది. అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన ఆప్‌ అత్యంత అవినీతికర పార్టీగా మారింది. ఆప్‌ ప్రభుత్వ పనితీరుపై కాగ్‌ నివేదికను అసెంబ్లీ తొలి భేటీలోనే పెడతామని హామీ ఇస్తున్నా.’’ అని అన్నారు. తాను మాట్లాడుతున్న సమయంలో ఓ కార్యకర్త అసౌకర్యంగా కనిపించడంతో ప్రసంగాన్ని ఆపేసిన మోదీ.. అతడికి తాగునీరు అందించాలని అక్కడున్న వారిని కోరారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించారు.

‘‘దిల్లీలో అబద్ధాల ఆప్‌ పాలన ముగిసింది. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను ఎల్లవేళలా తప్పుదారి పట్టించలేరని ఓటర్లు నిరూపించారు. యమునా నది కాలుష్యం, అపరిశుభ్ర తాగునీరు, దెబ్బతిన్న రోడ్లు, పొంగి పొర్లుతున్న మురుగు కాలువలు, నిత్యం తెరిచే ఉంచే మద్యం దుకాణాలపై దిల్లీ ప్రజలు తమ స్పందనను ఓటు ద్వారా తెలియజేశారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం దిల్లీ అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తుంది.’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.

సరైన సమయంలో సరైన తీర్పు 

దిల్లీలో బిజెపి విజయంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే, అది కేజ్రీవాల్ గానీ, రాహుల్ గాంధీ గానీ, కేసీఆర్ గానీ ఎవరూ మార్చలేరు. సరైన సమయంలో ప్రజలు తీర్పు ఇస్తారని ఈరోజు మరోసారి నిరూపితమైంది. దోపిడీ పాలనను కొనసాగించిన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారు. హర్యానా బిజెపి ప్రభుత్వం యమునా నదిలో విషం కలిపిందని నీచపు ఆరోపణలు చేసి దిగజారారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జైల్లో నుంచే పరిపాలన చేసిన ఏకైక సీఎం కేజ్రీవాల్. అవినీతి ఆరోపణలతో, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే లిక్కర్ కేసులో జైలుకెళ్లి.. స్వాతంత్ర్య పోరాటం చేసిన మాదిరిగా జైలునుంచే పరిపాలన చేసి దుర్మార్గపు ఆలోచనతో కేజ్రీవాల్ పనిచేశారు. అందుకే కేజ్రీవాల్ డ్రామాలకు ప్రజలు అర్థం చేసుకుని తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే జాలి కలుగుతోంది. దిల్లీలో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. 2014, 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పెద్దసున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి, తెలంగాణ అభివృద్ధి చేస్తున్నామంటూ ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 16 సీట్లు గెలుచుకోగా, దిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండుసున్నా వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి విజయం సాధించడం ఖాయం.’’ అని అన్నారు.