బిజెపి ఒక్క దెబ్బకు రెండు (ఆప్, కాంగ్రెస్) పిట్టలు
1993లో మళ్లీ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1998లో జరిగిన రెండో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షీలా దీక్షిత్ నాయకత్వంలో 48 శాతం ఓట్లతో 52 స్థానాలతో గెలిచిన కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అది మొదలు వరుసగా మూడు సార్లు ‘తగ్గేదేలే’ అన్నట్టు 40 శాతం ఓట్లతో గెలిచి, ఇప్పుడేమో వరుసగా మూడోసారి ఖాతా కూడా తెరవకుండా ‘నెగ్గేదేలే’ అన్నట్టు ఘోర పరాభవం పాలై ఉనికి కోల్పోయింది. దిల్లీని అప్రతిహతంగా ఏలిన హస్తం పార్టీకి మూడుసార్లు సున్నా సీట్లతో రిక్తహస్తాలు మిగిలిపోవడం దేశ రాజధానిలోనే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇది దేశంలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదనడానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. బిజెపిపై కోపంతో, హిందూ వ్యతిరేక ఎజెండాతో, దేశ విచ్ఛిన్న కార్యకలాపాలతో, దిగజారి దేశద్రోహ పార్టీలతో కూడా జతకట్టడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడానికి, ఇప్పుడు దిల్లీలో ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణాల్లో కొన్ని. ఇవే కాకుండా దశాబ్ద కాలంగా ప్రపంచంలోనే నెంబర్ 1 నాయకుడిగా గుర్తింపు పొందిన మోదీ నాయకత్వంలో బిజెపి ప్రపంచ నెం.1 పార్టీగా ఎదగడం… మరోవైపు తెలివి, సామర్థ్యం, నిలకడ, దేశభక్తి వంటివేవీ లేని రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి దిగజారడం మరో కారణం.
2013లో అరంగేట్రంలోనే అదిరిపోయే ఫలితాలు సాధించి, దివాళాకోరు కాంగ్రెస్ మద్దతుతో దిల్లీ రాష్ట్రం గద్దెనెక్కి, 2015 మధ్యంతరం ఎన్నికల్లో రికార్డు స్థాయి 67 (95 శాతం పైగా)స్థానాలు, 2020లో బంపర్ మెజారిటీ 62 (88 శాతం పైగా) స్థానాలతో మరోసారి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ కు ఈసారి దిల్లీ ప్రజలు చెంప చెల్లుమనిపించేలా తీర్పునిచ్చారు. మొదట్లో వల్లించిన ఢాంబికపు ఆదర్శాలకు సంపూర్ణంగా తిలోదకాలిచ్చి, తలకెక్కిన పొగరుతో ‘‘ఆప్ ను ఓడించడానికి మోదీ ఎన్నో జన్మలు ఎత్తాలి’’ అన్న అహంకారి కేజ్రీవాల్ తో సహా ఆప్ ముఖ్య నాయకులు కూడా ఓడిపోయారు. 2/3 వంతు స్థానాలు కోల్పోయింది. ఇంతకుముందు 95 శాతం పైగా స్థానాలు గెలిచిన పార్టీ 1/3 స్థానాల లోపుకు పడిపోయింది. గత ఎన్నికల్లో పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యతిరేక ఖలిస్థాన్ తో కుమ్మక్కై దేశ భద్రతకే ముప్పుగా మారిన కేజ్రీవాల్, దేశానికి కాంగ్రెస్ లానే మరో ప్రమాదకారి అన్న విషయాన్ని బిజెపి గ్రహించింది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆప్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో, ప్రభావవంతమైన వ్యూహాలతో, కార్యకర్తల సంపూర్ణ కృషితో ఒక్క దెబ్బకు రెండు పిట్టలతో బిజెపి ఘన విజయం సాధించింది.
కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు, గోబెల్స్ విష ప్రచారం, అవకాశవాద పొత్తులు, విదేశీ శక్తుల హస్తంలతో… ఎన్నికల విజయాలు అన్ని వేళలా రావు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బిజెపి అఖండ విజయాలకు, కాంగ్రెస్ ఘోర ప్రభావాలకు స్పష్టమైన సంకేతంగా రాజకీయ పండితులు భావిస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి, గారడీ మాటల బూటకపు హామీల రేవంత్ రెడ్డి హర్యానాలో అడుగిడినా, మహారాష్ట్రలో ప్రచారం చేసినా, దిల్లీలో మ్యానిఫెస్టో విడుదల చేసినా… కాంగ్రెస్ ఓటమి ఖాయమని, సెంటిమెంటుపరంగా కూడా కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డితో దౌర్భాగ్యం స్పష్టమవుతోంది. ఈ దిల్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు బిజెపికి అందలం, కేజ్రీవాల్ పార్టీ పరాజయంతో పాటు ఎమ్మెల్యేగానూ ఓడిన పరాభవం, రాహుల్ గాంధీ పార్టీకి వరుసగా మూడోసారి రేవంత్ రెడ్డి ఎప్పుడూ చూపించే గాడిద గుడ్డు లభించింది.

