MLC victory

మండలి ఎన్నికల్లో బిజెపి విజయ దుందుభి

శాసనమండలి ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. మూడు స్థానాల్లో రెండింటిని కైవసం చేసుకొని ఆధిపత్యాన్ని చాటుకుంది. అధికార కాంగ్రెస్ సిటింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో చిన్నమైల్‌ అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గంలో మల్క కొమరయ్య జయకేతనం ఎగురవేశారు. చిన్నమైల్‌ అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఈ ఫలితం తేలింది. ఇక్కడ కాంగ్రెస్‌ తన సిటింగ్‌ సీటును కోల్పోయింది. ఉమ్మడి కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య పీఆర్టీయూ(టీఎస్‌) అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

అంజిరెడ్డి జయకేతనం

ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 56 మంది బరిలో నిలిచారు. మొత్తం 3,55,159 మంది ఓటర్లున్నారు. ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్‌లో 2,52,029 మంది ఓటేశారు. లెక్కింపు సమయంలో 28,686 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,23,343 ఓట్ల నుంచి గెలుపు కోటాను 1,11,672గా అధికారులు నిర్ణయించారు. మొత్తం 11 రౌండ్లలో లెక్కింపు కొనసాగగా తొలి రౌండ్‌ నుంచి బిజెపి అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 75,675 ఓట్లతో బిజెపి మొదటి స్థానంలో ఉండగా 70,565 ఓట్లతో కాంగ్రెస్, 60,419 ఓట్లతో బీఎస్పీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి 98,637 ఓట్లు సాధించగా, నరేందర్‌రెడ్డి 93,531 ఓట్లు పొందారు.

గెలుపు కోటాను చేరాలంటే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ చేపట్టారు. ఇలా 53 మందిని ఎలిమినేట్‌ చేశారు. మూడోస్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వరకు వారు సాధించిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను గణించారు. ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకింత పైచేయి సాధించినా మొత్తంగా బిజెపి అభ్యర్థి 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బిజెపి అభ్యర్థి గెలుపు ఖరారైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పమేలా సత్పతి ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అంజిరెడ్డి 1978లో మొదట ఆర్‌ఎస్‌ఎస్‌లో, తర్వాత ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. 1993లో ఎస్సార్‌ ఇండస్ట్రీని స్థాపించారు. ఎస్సార్‌ ట్రస్టు పేరిట విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వ బడులు, కళాశాలల్లో తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చారు. 2009 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా గెలిచి శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు. అంజిరెడ్డి సతీమణి గోదావరి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 

కొమరయ్య ఘన విజయం

ఉమ్మడి కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీపడగా తొలి ప్రాధాన్య ఓట్లతోనే బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందారు. మొత్తంగా ఈ స్థానంలో 25,041 ఓట్లు పోలవగా 24,144 చెల్లుబాటయ్యాయి. 897 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పోలైన ఓట్లలో 50 శాతానికి మించి(12,074) ఓట్లు విజేతకు రావాల్సి ఉండగా కొమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. వంగ మహేందర్‌రెడ్డి 7,182, వై.అశోక్‌కుమార్‌ 2,621, కూర రఘోత్తమ్‌రెడ్డి 428, తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి 320, యాటకారి సాయన్న 293, మామిడి సుధాకర్‌రెడ్డి 153, ఎల్‌.సుహాసిని 78, గవ్వల లక్ష్మి 41, ముత్తారం నర్సింహస్వామి 31, కంటె సాయన్న 12, జగ్గు మల్లారెడ్డి 10, సిలివేరి శ్రీకాంత్‌ 7, చాలిక చంద్రశేఖర్‌ 6, వేముల విక్రమ్‌రెడ్డి 3 ఓట్లు సాధించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి గెలుపొందిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మల్క కొమరయ్య విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఆశయంతో పల్లవి విద్యా సంస్థలు ప్రారంభించారు. కుమారుడు, కుమార్తె విద్యాసంస్థలను పర్యవేక్షిస్తుంటారు. హైదరాబాద్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్స్‌ పర్యవేక్షణ కొమరయ్యనే చూస్తారు. పార్టీలో చురుగ్గా వ్యవహరించిన కొమరయ్యను పార్టీ ఎమ్మెల్సీ బరిలోకి దింపింది. భారీ ఆధిక్యంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికి 2,289 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. యూటీఎఫ్‌నకు చెందిన సిటింగ్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన రెండు ఎమ్మెల్సీ స్థానాలను బిజెపి తన ఖాతాలో వేసుకోవడంతో పార్టీ కార్యకర్తలు సంతోషంతో ఉప్పొంగిపోయారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం, కరీంనగర్ ఎంపీ క్యాంప్ కార్యాలయం సహా వివిధ జిల్లా గెలుపు సంబురాలు జరుపుకొన్నారు. ఆనందంతో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.

బిజెపినే ప్రత్యామ్నాయం: కిషన్ రెడ్డి

ఈ విజయంపై రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందిస్తూ ‘‘తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటింది. ఈ విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరికీ, ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించడం, ఇదే నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలవడం గర్వకారణం. ఈ విజయాన్ని సాధించేందుకు పాటుపడిన మేధావులకు, పట్టభద్రులకు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. మేధావులు మొదలుకుని అన్ని వర్గాలు, తెలంగాణ ప్రజలు బిజెపి వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో బిజెపి ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయం ఒక నిదర్శనం. రాష్ట్రంలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, తెలంగాణ ప్రజలు బిజెపి వెంటే నిలబడ్డారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల బిజెపి గెలవడం, మరోచోట ఉపాధ్యాయ సంఘం విజయం సాధించడం.. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసహనానికి, బిజెపి పట్ల పెరుగుతున్న ఆదరణకు ఓ ఉదాహరణ. ఉపాధ్యాయులు మల్క కొమురయ్యని గెలిపిస్తే, పట్టభద్రులు చిన్నమైల్ అంజిరెడ్డిని విజయతీరాలకు చేర్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో విజయం సాధించడం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు రాజీలేని పోరాటం చేస్తాం. ఈ విజయంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.

ఓటర్లే గెలిచారు: బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ ‘‘బిజెపి విజయానికి అహర్నిశలు పని చేసిన కార్యకర్తలందరికీ హ్యట్సాఫ్. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు శిరస్సు వంచి వందనాలు చెబుతున్నా. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది నాలుగో విజయం. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతోపాటు టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు సాధించాం. నరేంద్రమోదీ నీతి, నిజాయితీ పాలనను, తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులను గుర్తించడంతోపాటు కార్యకర్తలు చేసిన పోరాటాలును గుర్తు చేసుకుని అద్బుతమైన విజయాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు డబ్బు సంచులు పంచారు. మేం ఓటర్లను నమ్ముకున్నాం. నోట్ల సంచులు ఓడిపోయాయి. ఓటర్లే గెలిచారు. ఈవీఎంలను మేనేజ్ చేసి బిజెపి గెలుస్తుందని పదేపదే దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీకి నేను సవాల్ విసురుతున్నా… ఈవీఎంల ద్వారా మాత్రమే కాదు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా బిజెపియే గెలిచింది. దీనికేం సమాధానం చెబుతారు? బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేసినా, డబ్బు సంచులను పంచినా ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినా వారి కుట్రలు ఫలించలేదు. మార్పు కోరుతున్న ప్రజలకు బిజెపి దిక్సూచిలా కన్పించింది. ఇకపై ఏ ఎన్నికలు జరిగినా విజయపరంపర బిజెపిదే. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ గెలుపు బిజెపిదే. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నం. ఇకనైనా కాంగ్రెస్ దిగిరావాలి. రాష్ట్రంలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు.’’ అని అన్నారు.