కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య పొత్తును బయట పెట్టిన చెన్నై మీటింగ్

టాలియన్ రాజకీయ తత్వవేత్త నికోలో మాకియవెల్లి ప్రకారం రాజకీయాల్లో మోసాలు, దగాలు విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేస్తున్నవి అవే. లోపాయకారి అవగాహనతో ప్రజలను దగా చేయడంలో ఈ రెండు పార్టీలకు దశాబ్దాల చరిత్ర ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమం రావడానికి ముఖ్య కారణాలైన సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయం మొత్తం కాంగ్రెస్ పాలనలోనే జరిగింది. ఈ అంశాలపై తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ బయటకు పోరాటం చేస్తున్నట్టు నటిస్తూనే లోలోపల కాంగ్రెస్ తో అవగాహన ఏర్పర్చుకున్నట్లు గత చరిత్ర స్పష్టం చేస్తుంది. 2004 లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పొత్తుతో మొదటిసారి బహిర్గతమైంది. అది ఎన్నికల వరకే ఉండకుండా కేంద్రంలోను, రాష్ట్రంలోను సమైక్య ప్రభుత్వాల ఏర్పాటుతో పోతిరెడ్డిపాడు కాలువతో తెలంగాణకు దగా చేయడం వరకు వెళ్లింది.

తెలంగాణ ఉద్యమం పేరుతో వందల కోట్ల ఆదాయం సమకూరుతుండడంతో కేసీఆర్ అమెరికాలో ఉన్న తన కొడుకును పిలిపించుకున్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఈ తండ్రీకొడుకులు వందల కోట్ల రూపాయల నిధులు వసూలు చేసిన విషయం బహిరంగ రహస్యమే. కేటీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసిన కేసులు కూడా బుక్ అయ్యాయి, అయితే కేసీఆర్ కు కాంగ్రెస్ తో ఉన్న లోపాయకారి ఒప్పందం వల్ల ఆ కేసులు రద్దయ్యాయి. ఈ లోపాయకారి వ్యవహారాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు నరనరాన జీర్ణించుకుపోయాయి.

2014 తర్వాత తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం కూడా కాంగ్రెస్ భావజాలాన్నే ప్రతిబింబిస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎన్నికైన పదవులకు రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, 2023 ఎన్నికల తర్వాత అదే రీతిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడాన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కాంగ్రెస్ అనుబంధ గ్రూపుగా ఏర్పడిన విషయం అందరికీ విదితమే. తెలంగాణకు తీవ్రంగా నష్టం కలిగించే పనులు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను దగా చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు జిత్తులతో అసెంబ్లీ లోపల, బయటా తాము బద్ధ శత్రువులం అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూనే వస్తున్నారు. ఈ రెండు పార్టీల లోపాయకారి ఒప్పందాలకు, మిగతా వ్యవహారాలకు ఎంఐఎం ముఖ్యపాత్ర వహిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో అనుమానాలు ఉన్న తెలంగాణ ప్రజలు గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వలేదు. ఈమధ్యనే జరిగిన విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పోటీ చేయలేని పరిస్థితికి తెచ్చి, కాంగ్రెస్ పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఓడించి, మూడింట రెండు స్థానాల్లో బిజెపికి పట్టం కట్టి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల అపనమ్మకాన్ని, బిజెపి పట్ల విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేశారు. గత హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది.

లోపాయకారి ఒప్పందాలతో తెలంగాణలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దేశ వ్యతిరేక నిర్ణయాల్లో కూడా కలిసి పని చేస్తాయని ఇటీవల మరోసారి బహిర్గతమైంది. తమిళనాడులో అసమర్థ, అవినీతి పాలన వల్ల తమ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న స్టాలిన్, ఆ ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రెండు దేశ వ్యతిరేక అంశాలను ఎత్తుకున్నాడు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తండ్రి కరుణానిధికి గతంలో రాజ్యాంగ కాపీలను తగులబెట్టిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు తమిళనాడులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నాయకత్వంలో బిజెపి దూకుడును తట్టుకోలేక ఈ దేశద్రోహ ఎత్తుగడలకు స్టాలిన్ పూనుకోవడం, దానికి నిస్సిగ్గుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వంతపాడడం, ఈ పార్టీల నీచనైజాన్ని, అవకాశవాద రాజకీయాలను, లోపాయకారి ఒప్పందాలను మరోసారి బహిర్గతం చేసింది. తెలంగాణలో అసెంబ్లీ లోపల, బయటా మాటకారులైన రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఒక పార్టీని మరొకటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆస్కార్ లెవల్లో నటిస్తున్నప్పటికీ ఈ చెన్నై సమావేశంతో ఈ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందంలో ఉన్నాయని మరోసారి స్పష్టమైంది. అవసరాల కోసం బాహాటంగా కలుస్తాయని, తమ రాజకీయ స్వార్థం కోసం దేశ వ్యతిరేక చర్యలనైనా సమర్థిస్తాయనీ రుజువైంది. ఈ విషయాలన్నింటినీ తెలంగాణలో ఉన్న జాతీయభావ వ్యక్తులు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానికి సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని, డబుల్ ఇంజన్ సర్కార్ తో తెలంగాణను అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో తెలంగాణ బిజెపి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.