వక్ఫ్ సవరణ ఎవరికీ వ్యతిరేకం కాదు
అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు వక్ఫ్ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పేద ముస్లింల హితం కోసమే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. మసీదుల నిర్వహణ వేరు, వక్ఫ్ భూముల నిర్వహణ వేరని, ఈ రెండింటిని కలిపి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హితువు పలికారు. వక్ఫ్ బోర్డు పరిధిలో మసీదులు ఉండవని, వాటికి వేరే కమిటీలు ఉన్నాయన్నారు. ఈ రెండింటి మధ్య లింక్ పెట్టొద్దన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి ప్రజల మద్దతు పొందేలా పని చేయాలని బిజెపి కార్యకర్తలను అభ్యర్థించారు. ఏప్రిల్ 17న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో “వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్”పై కార్యశాల నిర్వహించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, “వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్” రాష్ట్ర కన్వీనర్ డా. గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, బిజెపి జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, శాసనసభ్యులు అభయ్ పాటిల్, శాసనమండలి సభ్యులు మల్క కొమరయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఏప్రిల్ 20 – మే 5, 2025 మధ్య జన జాగరణ అభియాన్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవ సమాచారం అందించడంతో పాటు చట్టంలోని నిజమైన ఉద్దేశ్యాలను వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యశాల నిర్వహించారు.
ఈ కార్యశాలలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘వక్ఫ్ చట్టాన్ని సవరించి పేద ముస్లింలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని గతంలో ఇచ్చిన హామీ మేరకే బిజెపి ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లును రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుమారు 25 రాష్ట్రాల్లో పర్యటించి, కోటి మందికి పైగా మేధావులు, ప్రజల అభిప్రాయాలను సేకరించింది. అనంతరం కమిటీకి వచ్చిన సూచనల ఆధారంగా నివేదిక సమర్పించి, పార్లమెంటులో 21 గంటల పాటు చర్చ జరిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేశాం, శాంతి నెలకొంది. బ్రిటిషర్ల హయాంలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని 1954లో పునః ప్రవేశపెట్టారు. 1995లో మరింత మార్పులు చేశారు. అయితే, 2013లో యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టి వక్ఫ్ చట్టంలో మార్పులు చేసింది. వక్ఫ్ బోర్డు అధికారాలను అపరిమితంగా విస్తరించి, భూములను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించారు. దేశంలో రైల్వే, రక్షణ శాఖల తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూముల ఆదాయం పేద ముస్లింలకు ఉపయోగపడలేదు. వక్ఫ్ బోర్డు లాభం మజ్లిస్ పార్టీ నాయకులు, మతపెద్దలు, ల్యాండ్ గ్రాబర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే పొందారు. పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి ఎంత మేలు జరిగిందో అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీ చెప్పగలరా? వాస్తవానికి వక్ఫ్ బోర్డు ఆదాయం పేద ముస్లింలకు ఉపయోగపడడం లేదు. 2006లో వక్ఫ్ ఆస్తుల పరిమాణం 4.9 లక్షల ఎకరాలు కాగా, ఆదాయం రూ. 160 కోట్లు మాత్రమే వచ్చింది. 2013లో అది రూ.166 కోట్లకు మాత్రమే చేరింది. భూముల విలువ పెరిగినా వక్ఫ్ బోర్డు ఆదాయం ఎందుకు పెరగలేదో సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం వక్ఫ్ ఆస్తులను సక్రమంగా వినియోగిస్తే ప్రతి సంవత్సరం రూ.12 వేల కోట్ల ఆదాయం రావచ్చు. ఈ ఆదాయాన్ని పేద ముస్లింలకు వినియోగించవచ్చు. గతంలో వక్ఫ్ భూములపై కొంతమంది రాజకీయ, మత నాయకుల పెత్తనం ఉండేది. వారు లాభాన్ని దొడ్డిదారిన వినియోగించేవారు. ఇకపై వక్ఫ్‌గా క్లెయిమ్ చేసే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించి, సర్వే చేసి, వాటి హక్కును నిర్ధారించాల్సి ఉంటుంది. వక్ఫ్ చట్టంపై కొందరు నాయకులు మతాల మధ్య ఘర్షణలు రేపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో వక్ఫ్ బోర్డు పరిధిలో 77 వేల ఎకరాల భూమి, 35 వేల ఆస్తులు ఉన్నాయి. వాటి ఆదాయ వివరాలు రేవంత్ రెడ్డి, ఓవైసీ చెప్పాలి. పేద ముస్లింలకు ఎంత సహాయం చేశారో చెప్పాలి. వక్ఫ్ ఆస్తులను కాంగ్రెస్ ముస్లిం నాయకులు, మజ్లిస్ నేతలు తమ రాజకీయ అధికారం పెంచుకునేందుకు వినియోగించుకున్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో బినామీ పేర్లతో వందల కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. వాటి ఆదాయం దారుస్సలాంకు ఉపయోగబడుతోంది. పేద ముస్లింలకు ప్రయోజనం చేకూరడం లేదు. అందుకే వక్ఫ్ సవరణ చట్టం ద్వారా పారదర్శకతతో కూడిన మార్పులు తీసుకువచ్చాం. ఇకపై వక్ఫ్ భూములన్నింటినీ డిజిటలైజ్ చేసి, ప్రతి సంవత్సరం ఆడిట్ చేసి, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ధైర్యముంటే ఓవైసీ, కాంగ్రెస్ నాయకులు గత 75 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలి.
ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వమే. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మెజారిటీ ముస్లిం సమాజం స్వాగతిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టంలో మార్పులు చేసింది. అసదుద్దీన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ముస్లింల ఓటుబ్యాంకు కోసం తప్పుడు ప్రచారం చేస్తూ, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతుగా ముస్లిం సమాజం పెద్ద సంఖ్యలో మోదీకి అండగా నిలుస్తోంది.’’ అని అన్నారు.

