పర్యావరణ సవాళ్లకు దీటుగా స్పందిస్తున్న భారత్
భూమిపై జీవులు మనుగడ సాగించాలంటే నిజంగా ఏం కావాలి? దీనికి సరళమైన సమాధానం పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి సురక్షితమైన నీరు, తినడానికి పోషకాహారం, బతకడానికి వీలుగా ప్రకృతి వనరుల లభ్యత. ఇవి విలాసాలు కావు, జీవితానికి పునాదులు. ఈ నిత్యావసరాలను తరతరాలుగా, ఎప్పుడూ డిపాజిట్ చేయకుండానే ఉపసంహరించుకునే వ్యవస్థ, లేదా ఏదైనా “బ్యాంకు” ఉందా? దీనికి సమాధానం ఉంది, అదే ప్రకృతి – మనలో చాలా మంది దీనిని భూమాత అని పిలుస్తారు. వేలాది సంవత్సరాలుగా, ఈ జీవ గ్రహం నిశ్శబ్దంగా మనం పీల్చే గాలిని శుభ్రపరిచే అడవులు, మన దాహార్తిని తీర్చే నదులు, మన పంటలను పోషించే నేల, మన పరిశ్రమలు, సాంకేతికతలకు మూలాధారమైన ఖనిజాలను అందించింది. మనల్ని పోషించే ప్రతి వనరు ఈ ఏకైక, స్వీయ-నియంత్రణ వ్యవస్థ నుంచి ప్రవహిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ సమతూకం ప్రమాదంలో పడింది.
భూమాతను వన్ వే బ్యాంకు ఖాతాగా మార్చాం, ఏమీ ఇవ్వకుండానే విత్‌డ్రా చేసుకుంటున్నాం. వినియోగం, దురాశ, ప్రకృతి అనంతమనే భ్రమతో మానవాళి పర్యావరణ ‘ఓవర్ డ్రాఫ్ట్’ యుగంలో ప్రవేశించింది. అడవులు ప్రమాదకర స్థాయిలో కనుమరుగవుతున్నాయి. సముద్రాలు ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయి. చాలా నగరాల్లో గాలి పీల్చడానికి పనికి రానంతగా కలుషితమైపోయింది. భూగర్భ జలాల నిల్వలు తగ్గిపోతున్నాయి. భూసారం తగ్గుతోంది. వరదలు, కార్చిచ్చులు, వడగాలులు వంటి విపత్తులతో వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. ప్రకృతి ఇప్పుడు నిశ్శబ్దంగా లేదు. భూమాత ఆగ్రహం కనిపిస్తోంది. మన అత్యాశను భూమి ఇక భరించదు. భవిష్యత్ తరాల కోసం భూమి పర్యావరణ వ్యవస్థలను, వనరులను పరిరక్షించాల్సిన మానవాళి బాధ్యతను గుర్తు చేయడానికి, మనం 192 దేశాలతో కలిసి ఏప్రిల్ 22ను ఎర్త్ డే (ధరిత్రి దినోత్సవం) జరుపుకొంటున్నాం. భూమి ఆరోగ్యం గురించి ఆత్మావలోకనం చేసుకోవడం, తీవ్రమైన పర్యావరణ అంశాలపై జాగృతం చేయడం, వాతావరణ మార్పులను, కాలుష్యాన్ని, జీవవైవిద్య క్షీణతను నివారించే సుస్థిరమైన విధానాల ప్రాముఖ్యతని నొక్కి చెప్పడం ఈ భూమాత దినోత్సవ లక్ష్యం. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అనేక అంతర్జాతీయ విధానాలకు ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. 1970లో ప్రారంభమైనప్పటి నుంచీ, ఈ ఉద్యమం పర్యావరణ విధానాలను ప్రభావితం చేసింది, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించింది, కీలకమైన ఒప్పందాలకు ప్రేరణ ఇచ్చింది. ఎర్త్ డే లేదా ధరిత్రి దినోత్సవం తరచుగా సోషల్ మీడియా పోస్టులు, చెట్లు నాటే కార్యక్రమం, పాఠశాల స్కిట్లు వంటి ప్రతీకాత్మక కార్యకలాపాలకు పరిమితం అవుతుంది. ఇవి కూడా ముఖ్యమే అయినప్పటికీ, ఈ రోజు కేవలం అటువంటి అవగాహన కార్యక్రమాలకు మాత్రమే ఉద్దేశించింది కాదు. ఆత్మపరిశీలన చేసుకోవడానికీ, అవసరమైన చర్యలు చేపట్టడానికి, ప్రకృతి వనరుల దోపిడీ నుంచి వాటిని సుస్థిరమైన పద్ధతిలో నిర్వహించడానికి నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భం. ఈ గ్రహంతో మన సంబంధాన్ని మౌలికంగా పునఃసమీక్షించుకోవాలి. చాలా కాలంగా మనం ప్రకృతిని కేవలం ఒక వనరుగా మాత్రమే చూస్తున్నాం – జయించడానికి, తవ్వడానికి, మచ్చిక చేసుకోవడానికి, దోపిడీ చేయడానికి. కానీ ప్రకృతి మనకు భిన్నమైనది కాదు. అది మనమే. చెట్లు విడుదల చేసే ఆక్సిజన్‌ను పీల్చుకుంటాం. నదులు, జలాశయాల్లో నిల్వ ఉన్న నీటిని తాగుతాం. ఆహారాన్ని పెంచడానికి, వ్యాధులను నివారించడానికి మనం స్థిరమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడతాం. మనం భూమికి హాని చేసినప్పుడు, మనకు మనమే హాని చేసుకున్నట్టే. పర్యావరణ బ్యాంకు ఎండిపోతే, ఏళ్ల తరబడి మనం విత్‌డ్రా చేసుకున్న మొత్తాన్ని జమ చేయడం ప్రారంభించాలి.
140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ సుస్థిరత భూమాత పరిరక్షణ దిశగా కీలకమైన చర్యలు తీసుకుంటుంది. 2021లో గ్లాస్ గో కాప్-26 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచామృతం పేరుతో ఐదు అంశాల ఎజెండాను ప్రకటించారు. 2017 నాటికి నికర శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం దేశ ఇంధన అవసరాల్లో 50% 2030 నాటికి సంప్రదాయేతర లేదా పునరుత్పాదక వనరుల ద్వారా తీర్చుకోవడం, ఆర్థిక వ్యవస్థలో కార్బన్ సాంద్రతను 45 శాతం తగ్గించడం ఈ ఎజెండాలో ఉన్నాయి. ఇవి నిజంగా సాహసోపేతమైన లక్ష్యాలు. మాటల నుంచి బాధ్యతాయుతమైన కార్యాచరణకు భారత సిద్ధంగా ఉందని ఈ లక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.
సౌర విద్యుత్తు భారతదేశపు శక్తివంతమైన పర్యావరణ పరిష్కారాలలో ఒకటిగా ఆవిర్భవించింది. ఫ్రాన్స్ తో కలిసి భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి అంతర్జాతీయ ఇంధన దౌత్యం రూపురేఖలనే మార్చి వేస్తోంది. జాతీయ సౌర విద్యుత్తు కార్యక్రమం పీఎం-కుసుం రైతులు సౌర ఇంధన నీటిపారుదల వ్యవస్థలను ఉపయోగించే అవకాశాలకు పెంపొందిస్తుండగా మరోవైపు గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో విస్తారమైన సౌర విద్యుత్ పార్కులు భారత్ గృహ రంగానికి, పరిశ్రమలకు విద్యుత్ అందించే విధానాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. దేశ పునరుత్పాదక విద్యుత్తులో సౌర విద్యుత్ వాటా ఇప్పటికే 15% దాటింది. అది ఇంకా పెరుగుతోంది. ఇక విద్యుత్ వాహనాల రంగంలో భారతదేశం శరవేగంగా పురోగతి సాధిస్తోంది. ఫేమ్ వంటి రాయితీ పథకాల ద్వారా ప్రభుత్వం విద్యుత్ వాహనాలను చౌకగా విస్తారమైన శ్రేణుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తోంది. భారతీయ రైల్వేలు 2013 నాటికి నెట్ జీరో కాలుష్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. మరోవైపు నగరాలు ప్రజా రవాణా వ్యవస్థను విస్తరిస్తూ స్వచ్ఛంద వ్యవస్థలపై పెట్టుబడులను పెంచుతున్నాయి. వీటివల్ల కాలుష్యం తగ్గటమే కాకుండా దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాలపై మనం ఆధారపడటం తగ్గుతుంది. అయితే పర్యావరణ పరిరక్షణకు పచ్చదనానికి మించి ఇంకా అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారత్ జీవవైవిద్య వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమాలు స్పష్టమైన విజయాలు సాధించాయి. ప్రాజెక్టు టైగర్, ప్రాజెక్టు ఎలిఫెంట్ ఈ విజయాలకు నిదర్శనాలు. వన్యప్రాణులు నివసించే ప్రదేశాలపై దృష్టి కేంద్రీకరించి, అమలు చేసిన ఈ వ్యూహాలు ఆయా వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరగడానికి దోహదం చేశాయి. నేడు ప్రపంచ పులుల్లో 75% భారతదేశంలోనే ఉన్నాయి. వరదలు, కరువులకు సహజమైన నిరోధకాలుగా ఉపయోగపడే చిత్తడి నేలలను భారత్ పరిరక్షిస్తుంది. గ్రీన్ ఇండియా కార్యక్రమం పరిమాణాత్మకంగానే కాక పర్యావరణ నాణ్యత పరంగా కూడా అడవుల విస్తరణకు కృషి చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం మనల్ని వేధిస్తోంది, అయితే జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ఎన్సిఏపి వంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాయు కాలుష్యాలను గమనిస్తూ స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నగరాలకు నిధులు అందిస్తోంది. మొదట్లో పారిశుధ్యంపై దృష్టి కేంద్రీకరించిన స్వచ్ఛభారత్ అభియాన్ ఇప్పుడు తన పరిధిని విస్తరించి ప్లాస్టిక్ వ్యర్థాల విభజన, వ్యర్థాలను ఎరువులుగా మార్చే ప్రక్రియలపై దృష్టి సారిస్తోంది. నీటి వనరుల పరిరక్షణకు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. జల శక్తి అభియాన్, అటల్ భూ జల యోజన, నమామి గంగే వంటి కార్యక్రమాల కింద నదీనదాలను పునరుజ్జీవింప చేసేందుకు బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
పర్యావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వ్యవసాయ రంగం నేడు పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది. పరంపరాగత కృషి వికాస యోజన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. సూక్ష్మ నీటిపారుదల పర్యావరణ మార్పులకు అనుగుణమైన సాగు పద్ధతులు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి దీని ఫలితంగా పర్యావరణంపై వ్యవసాయం ప్రభావం తగ్గిపోతున్నది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అవసరమైన చట్టాలను తీసుకువస్తుంది. అత్యంత కీలకమైన పర్యావరణ పరిరక్షణ చట్టం మొదలుకొని ఈ వేస్ట్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత గృహ నిర్మాణ నిబంధనల వరకు భారతదేశపు చట్టాలు సమకాలీన సవాళ్లను ఎదురుకోవడానికి అనుగుణంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (లైఫ్) వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ప్రభుత్వ విధానం మాత్రమే కాదని అది మన దైనందిన జీవితంలో ఒక భాగం అని మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం లోపాలను కూడా విస్మరించకూడదు. పర్యావరణ చట్టాల అమలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు. వాతావరణ మార్పుల నిరోధానికి తీసుకోవలసిన చర్యలు అవసరమైన స్థాయిలో ఉండడం లేదు. ఇప్పటికీ అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు మధ్య పోటీ అనేది ఒక వాస్తవంగానే ఉంది. ముఖ్యంగా పట్టణాలకు ప్రణాళికల రూపకల్పనలో ఇది కనిపిస్తుంది. అక్రమ నిర్మాణాలు, అడవుల నిర్మూలన, కాలుష్యం అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు నిబంధనలు అమల్లో ఉన్న వీటిని అరికట్టలేకపోతున్నాం. అయితే పర్యావరణ స్పృహ పెరగడం ఒక ఆశావహమైన పరిణామం. పర్యావరణ పరిరక్షణ అనేది గతంలో ఏదో ఒక చిన్న వర్గానికి మాత్రమే పరిమితమై ఉండే అంశం, కానీ ఇప్పుడు ప్రజల్లో దీని పట్ల అవగాహన బాగా పెరిగింది. పరిపాలనలో మౌలిక సదుపాయాల ప్రణాళికల రచనలు వ్యాపార వ్యూహాలలో పౌరుల అంతరంగంలో ఇది ఒక ప్రధాన అంశంగా మారింది. తరగతి గది నుంచి కంపెనీల బోర్డు రూముల వరకు మనం ప్రకృతితో సామరస్యంతో జీవించాలి, దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనే భావన వ్యాపించింది.
ధరిత్రి దినోత్సవం రోజున చెట్లు నాటడం మంచిదే. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. కానీ మనం ఇంకా ముందుకు వెళ్లాలి. వినియోగాన్ని తగ్గించుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలను వాడాలి. సుస్థిరతకు ప్రాధాన్యమిచ్చే విధానాలను, నాయకులను బలపరచాలి. సెలవు దినాల్లోనే కాకుండా నిత్యజీవితంలో కూడా ప్రకృతితో మమేకం అవ్వాలి. భూవనరులను వాడుకునే వారిలాగా కాకుండా భూమాతను పరిరక్షించే వారిగా పిల్లలను తీర్చిదిద్దాలి. పరిశ్రమల నుంచి, ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి కూడా జవాబుదారీతనం డిమాండ్ రావాలి. హద్దు పద్దు లేని వనరుల దోపిడీని కొనసాగిస్తే ప్రకృతి సమతుల్యాన్ని తిరిగి సాధించడం చాలా కష్టం. మనం ప్రకృతి వనరుల బ్యాంకును దివాళా తీయిస్తే, ఆ తరువాత ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదు. మనకు నీడను ఇవ్వడానికి మరో గ్రహం లేదు.
రావు ఇంద్రజిత్ సింగ్,
గణాంకాలు కార్యక్రమాల అమలు, ప్రణాళిక శాఖ సహాయ మంత్రి

