Telangana formation day

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో అహింసాయుతంగా సాగిన ప్రబలమైన పోరాటంగా గుర్తించదగనిదని చెప్పారు. తెలంగాణ కోసం 1200 మందికిపైగా యువత, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగినట్లు గుర్తు చేశారు. అన్ని పార్టీలకన్నా ముందుగా బిజెపి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బిజెపినేనని పేర్కొన్నారు. గల్లీ నుంచి దిల్లీ దాకా బిజెపి పోరాడిందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం దేశ పార్లమెంట్లో గళమెత్తిందని తెలిపారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలకు మాత్రం ఆశించిన ఫలితాలు లభించలేదన్నారు. వేల కోట్ల రూపాయలు నీటి ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగమయ్యాయని మండిపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత ప్రజలు, మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడిపారని మండిపడ్డారు.గతంలో సోనియాగాంధీని “తెలంగాణ పాలిట దెయ్యం” అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాగానే ఆమెను దేవతగా పొగడటం ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ ఈ రోజు రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది టీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల వల్లే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండూ అవినీతి, కుటుంబ పార్టీలు, ప్రజలను మోసం చేసినవే అని విమర్శించారు. రాష్ట్రాన్ని పునఃనిర్మించాలంటే బిజెపినే ప్రత్యామ్నాయమని, నీతి, నిజాయితీ, అంకితభావంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇది బిజెపి మాట.. నరేంద్ర మోదీ మాట అని తెలిపారు. తెలంగాణలో బిజెపి జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మల్యాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం హైదరాబాద్‌లో సిటీ కాలేజ్ దగ్గర “ఇడ్లీ సాంబార్ గో బ్యాక్” ఉద్యమంతో మొదలైంది. ఆనాడు నిరంకుశ పాలకులు ఫైర్ చేస్తే ఏడుగురు విద్యార్థులు అమరులయ్యారు. 1969లో “మా ఉద్యోగాలు మాకు కావాలి” అని చెప్పి యావత్ తెలంగాణ కోసం చెన్నా రెడ్డి ఉద్యమించారు. ఆనాడు ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపి 369 మంది విద్యార్థులను బలిగొన్న నీచమైన చరిత్ర తెలంగాణ సమాజం మర్చిపోదు. 2001 ఉద్యమం తర్వాత రాజనాథ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ యాదగిరి రెడ్డి చనిపోయినప్పుడు “మీరు చావకండి, మేం ఉన్నాం, వి ఆర్ విత్ యు” అని చెప్పిన భరోసా మరువలేం. బిజెపి నిజాయితీగా సపోర్ట్ చేసినందువల్లే ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఆనాడు ఏ నీళ్లు కోసం, ఏ నిధుల కోసం, ఏ ఉద్యోగాల కోసం అని చెప్పి వేలాది మంది పిల్లలు తమ అమూల్యమైన ప్రాణాలు బలిపెట్టిండ్రో.. ఇవాళ ఆ చరిత్రకి, ఆ అమరత్వానికి, ఆ త్యాగాలకు సంబంధం లేకుండా ఎట్లా చూస్తున్నామో మనం చూస్తున్నాం. ఈ చారిత్రక సందర్భంలో బిజెపి నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు. 

బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం పోరాటంలో భాగంగా కిషన్ రెడ్డి నేతృత్వంలో పోరుయాత్రతో పాటు అనేక రకాలుగా పోరాటం చేయడం వల్లనే ప్రజల్లో భరోసా వచ్చింది. గ్రామ గామాన వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా పార్టీకి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపారు. ఎన్నో సిద్దాంత వైరుధ్యాలు ఉన్నా బిజెపి ఉద్యమ జేఏసీలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసింది.’’ అని అన్నారు. బిజెపి కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మోసపూరిత విధానాలతో కాలం గడుపుతూ.. 6 గ్యారెంటీలు, 420 హామీలు, బూటకపు వాగ్దానాలతో ప్రజలను గాలికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి.’’ అని అన్నారు.