మోదీ పాలన భారత్‌కు స్వర్ణయుగం
మోదీ 11 ఏళ్ల పాలన భారత్‌కు స్వర్ణయుగం లాంటిదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇదే వ్యవధిలో తెలంగాణకు సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీని మంజూరు చేయడమే కాకుండా రూ.12 లక్షల కోట్ల నిధులను కేటాయించారని, ఐఐఎం ఏర్పాటు ప్రతిపాదనలు కూడా ఉన్నాయని చెప్పారు. జూన్ 10న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన ‘వికసిత్ భారత్ కా అమృత్ కాల్: సేవా, సుశాసన్, గరీబ్ కల్యాణ్ కే 11 సాల్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత 11 ఏళ్ల మోదీ పాలన ఎంతో పారదర్శకంగా జరిగింది. ప్రజలే కేంద్ర బిందువుగా, వారిని భాగస్వాములను చేస్తూ పాలన కొనసాగిస్తున్నారు. 2014 కన్నా ముందు భారత్‌కు ప్రపంచ దేశాల్లో పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. మోదీ హయాంలో ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా దేశం ఎదిగింది. ఏకంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. లక్షకుపైగా అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కేంద్రం నుంచి రూపాయి విడుదలైతే వంద శాతం నిధులు కిందిస్థాయికి చేరుతున్నాయి. మావోయిస్టులు హింసామార్గాన్ని ఎంచుకున్నందుకే వారి ఏరివేత కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారత రాష్ట్రాలు విద్యలో, అభివృద్ధిలో చాలా ముందున్నాయి. హైదరాబాద్ ప్రగతిపథంలో దూసుకెళ్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం సాంకేతికతను సైతం ఆ రాష్ట్రానికి తెస్తున్నారు. బెంగళూరు, తమిళనాడు, కేరళల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయి’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బిజెపి ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

