Digital India

వికసిత్‌ భారత్‌కు డిజిటల్‌ పునాదులు

కొద్ది నెలల క్రితం దిల్లీలో ఒక ఐరోపా సీనియర్‌ మంత్రిని కలిశాను. ఇండియాలో డిజిటల్‌ పేమెంట్ల విప్లవాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయారు. విభిన్న భాషలు, భౌగోళిక పరిస్థితులు ఉన్న దేశంలో ఇదంతా ఎలా సాధ్యమైందని ఆమె ప్రశ్నించారు. నేను అయిదు వందల రూపాయల నోటు చూపించాను. దానిమీద పదిహేడు భాషల్లో నోటు విలువ రాసుంటుంది. ఇండియా వైవిధ్యానికి అది నిదర్శనం. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో సాంకేతికత ద్వారా ఈ వైవిధ్యమంతా అనుసంధానమై, దేశానికి గొప్ప బలంగా మారింది. 

డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి పదేళ్లు. కేవలం కొందరికి కాకుండా, ప్రతి ఒక్కరికీ మేలిమి సేవలందించే డిజిటల్‌ మౌలిక వ్యవస్థను తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ విస్పష్ట ఆలోచనతో పదేళ్ల క్రితం డిజిటల్‌ ఇండియా ప్రయాణం మొదలైంది. అది నేడు విశ్వవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తెస్తోంది. మన ‘ఆధార్‌’ ప్రపంచంలోనే అతి పెద్ద బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థ. ఇది 140 కోట్ల మందికి డిజిటల్‌ గుర్తింపును కల్పిస్తోంది. వేగంగా, నమ్మకంతో కూడిన అత్యవసర సేవలందించే క్రమంలో నిత్యం సగటున తొమ్మిది కోట్ల ఆధార్‌ ధ్రువీకరణలు జరుగుతున్నాయి. ఇక మన యూపీఐ ఆర్థిక లావాదేవీల తీరుతెన్నులనే మార్చేసింది. వీధి విక్రేతల నుంచి బడా వ్యాపారుల దాకా అందరూ చాలా తేలిగ్గా యూపీఐని వినియోగిస్తున్నారు. దేశీయంగా రోజూ సగటున 60 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్స్, విద్యా సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను డిజిలాకర్‌ కేవలం ఒక్క క్లిక్‌ దూరంలోకి తెచ్చింది. మొబైల్‌ వినియోగం విస్తృతం కాకుంటే ఇవన్నీ సాకారమయ్యేవి కావు. ప్రస్తుతం మన యూపీఐ విధానాన్ని ఏడు దేశాలు అనుసరిస్తున్నాయి. మరిన్ని దేశాలు దాన్ని అందిపుచ్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ప్రతి భారతీయుడికీ సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన యూపీఐ కార్యక్రమం ప్రస్తుతం ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

జన్‌ధన్‌ యోజన కింద 55 కోట్ల బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి. డీబీటీ పథకాల రూపంలో రూ.44 లక్షల కోట్లు నేరుగా వాటిలో జమయ్యాయి. 10కోట్లకు పైగా ఎల్‌పీజీ కనెక్షన్లు, వైద్య ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందాయి. జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ (జామ్‌) త్రయం ద్వారానే ఇదంతా సాధ్యమైంది. తద్వారా సంక్షేమ పథకాల్లో లోపాలు తగ్గాయి. పరిపాలనలో పారదర్శకత నెలకొంది. సేవలు త్వరితగతిన అందుతున్నాయి. మైగవ్, ఉమంగ్‌ లాంటి డిజిటల్‌ వేదికలు రెండు వేలకు పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయి. ‘భీమ్‌’ వ్యవస్థ 20భాషలో, ‘ఉమంగ్‌’ 13 భాషల్లో సేవలందిస్తున్నాయి. జాతీయ టెలీమెడిసిన్‌ వేదిక ఈ-సంజీవని 38 కోట్ల డాక్టర్‌ కన్సల్టేషన్లకు వీలు కల్పించింది. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక డిజిటల్‌ ఐడీని రూపొందించడమే ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) లక్ష్యం. 79కోట్లకు పైగా హెల్త్‌ ఐడీలు, ఆరు లక్షల ఆరోగ్య పరిరక్షణ నిపుణులు, 60 కోట్ల హెల్త్‌ రికార్డులు ప్రసుత్తం అనుసంధానమవడం హర్షణీయమే. తద్వారా బిహార్‌లో ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న ఓ మహిళ ఇంటి నుంచే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్‌ను సంప్రదించేందుకు వీలు కలుగుతోంది. ఇదే డిజిటల్‌ ఇండియా గొప్పదనం. దీక్ష, స్వయం, పీఎం ఈ-విద్య వంటి డిజిటల్‌ వేదికలు లక్షల మంది విద్యార్థులకు వారి ప్రాంతీయ భాషల్లోనే అందుబాటులో ఉన్నాయి. స్కిల్‌ ఇండియా డిజిటల్‌ హబ్‌ (SIDH), ఫ్యూచర్‌స్కిల్స్‌ ప్రైమ్‌ వేదికలు కృత్రిమ మేధ, సైబర్‌ భద్రత, బ్లాక్‌చెయిన్‌ సాంకేతికతల్లో నవతరానికి నైపుణ్యాలు నేర్పుతున్నాయి. వాతావరణ సమాచారం, నేల ఆరోగ్య కార్డులు, మార్కెట్‌ ధరలు రైతులకు నేడు డిజిటల్‌ రూపంలో అందుతున్నాయి.

దేశీయంగా డిజిటలీకరణ ఊపందుకొనేకొద్దీ, సైబర్‌ భద్రత సైతం బలోపేతమవుతోంది. సీఈఆర్‌టీ-ఇన్‌ లాంటి సంస్థలు, సైబర్‌ నేరాల హెల్ప్‌లైన్‌ 1930, డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ చట్టం 2023 వంటివి వినియోగదారుల గోప్యత, భద్రత పరంగా భారతదేశ నిబద్ధతకు అద్దం పడుతున్నాయి. తద్వారా డిజిటల్‌ సేవలను ప్రజలు పూర్తి నమ్మకంతో వినియోగించుకోగలుగుతున్నారు. 1.8 లక్షల స్టార్టప్‌లు, వందకు పైగా యూనికార్న్‌లతో ఇండియా నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థకు ఆలవాలంగా నిలుస్తోంది. డిజిటల్‌ ఇండియా పునాదిగా ఇవన్నీ ఎదిగాయి. ఏఐ మిషన్‌ సైతం శక్తిమంతమైన కంప్యూటర్‌ వ్యవస్థల వినియోగాన్ని సులభతరం చేస్తోంది. విస్తృత స్థాయిలో జీపీయూలు అందుబాటులోకి రావడం వల్ల స్టార్టప్‌లు, పరిశోధకులు, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.

ప్రధాని మోదీ ఇచ్చిన ‘మేకిన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ద వరల్డ్‌’ నినాదాలతో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్ల తయారీ ఊపందుకొంది. మన ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ విలువ రూ.12 లక్షల కోట్లు దాటిపోయింది. టెలికం మౌలిక వసతుల విస్తరణ సైతం దేశ పురోగతికి విశేషంగా అక్కరకొస్తోంది. చాలా ఏళ్ల తరవాత బీఎస్‌ఎన్‌ఎల్‌ మళ్లీ లాభాల్లోకొచ్చింది. ప్రస్తుతం 4జీ దాదాపు దేశవ్యాప్తంగా అందుబాటులోకొచ్చింది. 5జీ సేవల విస్తరణ వేగవంతమైంది. ఇవన్నీ తరవాతి దశ డిజిటల్‌ ఇండియాకు దన్నుగా నిలుస్తాయి. దేశీయంగా చిప్‌ తయారీ కలను ‘సెమీకండక్టర్‌ మిషన్‌’ వాస్తవరూపంలోకి తెస్తోంది. డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి పదేళ్లు పూర్తయిన తరుణంలో మొత్తం పరిణామం గర్వకారణం. పటిష్ట డిజిటల్‌ ఇండియా పునాదిపైనే వికసిత్‌ భారత్‌ మహా సౌధ నిర్మాణం జరుగుతోంది. ప్రతి పౌరుడి జీవితంలో సాంకేతికతను నిజమైన సహచరుడిగా నిలపడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. దేశీయంగా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న అంత్యోదయ లక్ష్యం మోదీ సర్కారుకు నిత్య మార్గదర్శకం.

అశ్విని వైష్ణవ్,
కేంద్ర ఐటీ, కమ్యునికేషన్లు, రైల్వే శాఖల మంత్రి