NRR

తెలంగాణలో అధికారమే బిజెపి లక్ష్యం

NRR 2తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమిష్టి కృషితో వందకు పైగా సీట్లను సాధించి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, జాతీయ నాయకత్వానికి కానుకగా ఇస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఇందుకోసం చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి కార్యకర్తా కృషి చేస్తాడని, సమయానుకూలంగా వ్యూహాలను రచిస్తూ, వాటిని పక్కాగా అమలు చేస్తూ ముందుకెళ్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన జనసందేశ్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తుందన్న దుష్ప్రచారం, సోషల్ మీడియా ట్రోలింగ్, పార్టీలో జరగబోయే చేరికలు.. ఇలా అనేక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ప్ర: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మీకు జనసందేశ్ తరఫున శుభాభినందనలు.. అత్యంత కీలకమైన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంపై మీరు ఎలా భావిస్తున్నారు?

జ: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం నిబద్ధతతో పార్టీ కోసం పని చేస్తూ వస్తున్న ఒక కార్యకర్తకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 14 రాష్ట్రాలలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, మరో ఆరు రాష్ట్రాలలో మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 14 కోట్ల సభ్యత్వాలతో దేశంలో, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత జనాదరణ ఉన్న పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైన డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయి మార్గదర్శనం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు దక్కడం అదృష్టంగా భావిస్తాను.

ప్ర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పుతూ మీకు ఏం చెప్పారు..? వారు మీపై పెట్టుకున్నా అంచనాలను అందుకునేందుకు మీరు ఏం చేయబోతున్నారు ?

జ: మంచి ప్రశ్న.. ముఖ్యంగా మా జాతీయ నాయకత్వం దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి తీసుకురావడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తోంది. దక్షిణాదిలో తెలంగాణ ముఖ్యమైన రాష్ట్రంగా పార్టీ భావిస్తోంది. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారంటే.. పార్టీ నాపైన పెద్ద బాధ్యతనే ఉంచిందనేది సత్యం. వారి అంచనాలను వమ్ము చేయకుండా పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేస్తూ, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమిష్టి కృషితో వందకు పైగా సీట్లను సాధించి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా ధ్యేయం. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసి జాతీయ నాయకత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలనేది నా ఆలోచన.

 ప్ర: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు వ్యక్తిగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటి..? దాని కోసం అనుసరించే మార్గాలు ఏమిటి?

జ: వ్యక్తిగతంగా నాకంటూ సొంత లక్ష్యాలు ఏమీ లేవు. గత 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో వివిధ హోదాలలో పనిచేస్తూ వచ్చాను. పార్టీ లక్ష్యాలే నా లక్ష్యాలుగా పని చేస్తూ వస్తున్నాను. నాది, మా నాయకులు, కార్యకర్తలు, పార్టీది.. అందరి లక్ష్యం తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడం. ఇందుకోసం చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి కార్యకర్తా కృషి చేస్తాడు. ఇందుకోసం సమయానుకూలంగా వ్యూహాలను రచిస్తూ, వాటిని పక్కాగా అమలు చేస్తూ మా లక్ష్యాన్ని చేరుకుంటాం.

ప్ర: కిషన్ రెడ్డి నుంచి మీరు బాధ్యతలు స్వీకరించారు.. అంతకుమందు బండి సంజయ్ కుమార్, దాని కంటే మందు డా. కె. లక్ష్మణ్.. అంతకుమందు చాలా మందే అధ్యక్షులుగా ఉన్నారు.. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి.. రాష్ట్ర అధ్యక్షుడిగా మీ శైలి ఎలా ఉంటుంది?

జ: నిజమే మీరు చెప్పింది కరెక్టే. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. నేను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూనే న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నాను, అలాగే నాకన్నా ముందు పని చేసిన అందరి అధ్యక్షుల సారథ్యంలో పని చేసే అవకాశం కూడా నాకు వచ్చింది. దగ్గరి నుంచి వారిని పరిశీలించే అవకాశమూ దక్కింది. ఎవరి శైలి ఎలా ఉన్నా, అందరినీ కలుపుకొనిపోతూ సైద్ధాంతిక నిబద్ధతతో పని చేశారు. నేనూ వారి మార్గంలోనే పార్టీ బలోపేతానికి, విస్తరణకు, అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.

ప్ర: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ ఎన్నికలలో బిజెపి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? పార్టీ వ్యూహమేంటి..?

జ: కచ్చితంగా గత అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా పార్టీ గెలుపొందుతూ వచ్చిందో అంతకుమించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. అన్ని స్థానిక సంస్థలలో పోటీ చేయడం, సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. దాదాపు అన్ని స్థానిక సంస్థల్లో వేరువేరు క్షేత్రస్థాయి సమస్యలున్నాయి. ఇప్పటికే వాటిని అనేక వేదికలపై లేవనెత్తుతున్నాం. వాటి పరిష్కారం చూపించి ప్రజల మనసులు గెలుచుకుంటాం. అంతేకాదు, గ్రామ పంచాయతీల్లో కానీ.. మున్సిపాలిటీల్లో కానీ.. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు, వీధి దీపాలు వంటి వన్నీ మోదీ ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయి. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే వారు బిజెపి వైపు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ, మహిళలు.. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన అవకాశాలు కల్పిస్తాం. రాబోయే స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలలో విజయదుందుభి మోగించబోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ప్ర: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది .. తెలంగాణలో మాత్రం ఇంకా అధికారానికి నోచుకోలేదు.. ఇంకెంత కాలం ఈ నిరీక్షణ..?

జ: పార్టీ కార్యకర్తలు కలలుగన్న అధికారం ఇంకా ఎంత దూరంలో లేదు.. ఒక అడుగు దూరం లోనే ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను సాధించి అధికారంలోకి వస్తుందని నేను, మా కార్యకర్తలే కాదు.. ప్రజలు కూడా ఆశిస్తున్నారు. దానికోసమే అహర్నిశలు మేం పని చేయబోతున్నాం.

ప్ర: 6 గ్యారంటీలు.. 60 వాగ్దానాలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ హామీలను విస్మరించింది. ఆ హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలాంటి పోరాటాలు చేయనున్నారు..?

జ: 6 గ్యారంటీలు.. 60 వాగ్దానాలు అంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 600 రోజులైనప్పటికీ వాటిని అమలు చేయకుండా కల్లబొలి మాటలు చెబుతూ కాలయాపన చేస్తోంది. తెలంగాణలోనే కాదు.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ 100 రోజులలో హామీలు నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేయక ప్రజలను మోసగిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేసేవిధంగా ప్రతి బిజెపి కార్యకర్త ఒక నిప్పురవ్వ వలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని గద్దె దించేవరకు పని చేస్తూనే ఉంటాం. అనేక రూపాల్లో మా పోరాటాలను, ఉద్యమాలను కొనసాగిస్తాం.

ప్ర: తెలంగాణ విషయానికి వస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు.. ఈ ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ తీవ్రమైన ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది.. ఈ నేపథ్యంలో ప్రజలకు బిజెపి ప్రత్యామ్నాయం అనుకోవచ్చా..?

జ: కచ్చితంగా.. కాంగ్రెస్ వైఫల్యాలే ప్రధాన అస్త్రంగా పల్లె నుండి పట్నం దాకా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్నో అవినీతి, అక్రమాలు చేసింది. సుసంపన్నమైన తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చింది. దానిని ఆసరా చేసుకొని, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతుంది. దీనిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు కచ్చితంగా వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించి తీరాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు.

ప్ర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి, బిజెపి సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేకమంది ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పట్ల మీ వైఖరి ఎలా ఉంటుంది..?

జ: భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం పని చేస్తున్న పార్టీ. నేషన్ ఫస్ట్ అనేది మా విధానం. దేశంలో నివసించే, దేశాన్ని గౌరవించే ప్రతి ఒక్కరిని తమ వారుగా భావించే పార్టీ. ఇంతకుముందు చెప్పినట్టు పాతనీరు కొత్తనీరు కలిసి ప్రవహించాల్సి ఉంటుంది. కొత్త నీరు వచ్చి పాత నీరుతో కలిసినప్పుడే ప్రాజెక్టులు నిండుతాయి, నదులు పొంగిపొర్లుతాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ పాత, కొత్త కలయికతో పని చేస్తుంది. భారతీయ జనతా పార్టీనీ అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా సమిష్టి కృషితో పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యకలాపాలను, సిద్ధాంతాలను నమ్మి వచ్చిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. త్వరలో వివిధ పార్టీల నుంచి బిజెపిలోకి పెద్ద మొత్తంలో వలసలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.

ప్ర: గత బీఆర్ఎస్ కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ కానీ.. మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందని ఒక దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు.. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి..?

జ: తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వీటన్నింటికీ లెక్కలున్నాయి. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం నీటిపారుదల, విద్యా, వైద్యం, సబ్సిడీలు మొదలైన వాటికి నిధులు ఏ విధంగా, ఎంత మొత్తంలో కేటాయించిందో అంకెలతో సహా వివరిస్తాం చర్చకు రమ్మని గతంలో బీఆర్ఎస్ కు సవాల్ విసిరాం. ఇప్పుడు కాంగ్రెస్ కు విసురుతున్నాం. అయినా వాళ్లు ఏనాడూ చర్చకు రాలేదు. కుక్క తోక వంకర అన్నట్టు గత బీఆర్ఎస్ పాడిన పాటనే ఈరోజు కాంగ్రెస్ పాడుతుంది. మోదీ ప్రభుత్వం నిర్మించిన రహదారులు, రైల్వేలు, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు.. ఇలా ఎన్నో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాలను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ వారి విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదు.

ప్ర: ఈ మధ్యలో సోషల్ మీడియాలో పార్టీపై, పార్టీ నాయకులపై విపరీతమైన ట్రోలింగ్, నెగిటివ్ క్యాంపెయిన్, దుష్ప్రచారం నడుస్తుంది. మీరు కూడా ట్రోలింగ్ బాధితులే, సోషల్ మీడియా ట్రోలింగ్ ను ఎలా ఎదుర్కొంటారు..?

 జ: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా దుష్ప్రచారాల ద్వారానే అధికారంలోకి రాగలమని ఒక దౌర్భాగ్యమైన ఆలోచనతో ఉన్నారు. అందుకే మాపై ఉన్నవి, లేనివి కల్పించి పెద్దఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక ఉదాహరణ తీసుకుంటే.. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఒక దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ ఎన్నో ఏళ్లుగా చేస్తూ వస్తుంది. కానీ ఈ దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదు, పైగా భారతీయ జనతా పార్టీపై నమ్మకం మరింత పెరిగేలా చేసింది. బిజెపి ఓబీసీ జాతీయ కమిషన్ కు చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లను పకడ్బందీగా అమలయ్యేలా చేసింది. రిజర్వేషన్లు లేని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించింది. మహిళా రిజర్వేషన్లు కల్పించి వారిని సముచిత స్థానంలో ఉంచింది. బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని మరో ప్రచారాన్ని కాంగ్రెస్ చేసింది. ఈరోజు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది ఎవరంటే అది బిజెపినే. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పీఠికను సవరించి, అందులో కొత్త అంశాలను చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు నా పైనా, పార్టీపైనా ఎలాంటి దుష్ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రజలే బుద్ధి చెప్తారు.

ప్ర: పార్టీ సంస్థాగత నిర్మాణంలో మీ ప్రాథమ్యాలు ఏమిటి?

జ: బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తాం. ఇప్పటికే 20వేలకు పైగా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటయ్యాయి. 911 మండలాలకు, 36 జిల్లాలకు అధ్యక్షులు ఎన్నికయ్యారు. వీటిని వంద శాతం చేసేందుకు ప్రయత్నిస్తాం. పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర కమిటీ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పిస్తాం. పార్టీ సీనియర్ నాయకుల నుంచి బూత్ కార్యకర్త వరకు సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్తాం. కొత్త, పాత అన్న తారతమ్యాలు లేకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేమంతా పని చేస్తాం. 

ప్ర: చివరగా, రాష్ట్ర అధ్యక్షుడిగా సామాన్య బిజెపి కార్యకర్తకు మీరిచ్చే సందేశం ఏమిటి? 

జ: భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే కొండంత బలం. బిజెపి కార్యకర్తలు ఎన్నో ఎదురుదెబ్బలకు ఎదురొడ్డి నిలిచినవారు. ఎంతోమంది కార్యకర్తలు నక్సలైట్ల దాడులలో, రాజకీయ దాడులలో హతమయ్యారు. అయినా వెనుకడుగు వేయకుండా ఎంతోమంది కార్యకర్తలు పార్టీ నిర్మాణంలో ఉన్నారు. ఈరోజు పార్టీ ఈ స్థితిలో ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తా కృషి వల్లనే అని నేను చెప్పగలను. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివిధ జిల్లాలలో బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అంశం మా దృష్టికి వచ్చింది. నేను కార్యకర్తలకు చెప్పేది ఒకటే.. రానున్న రోజులలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే. మీరందరూ పార్టీ కోసం పని చేయండి, మీ కోసం నేనున్నాను అని చెప్తున్నాను. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మా లీగల్ టీములు పనిచేస్తాయి, ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా వారు ముందుండి ఆదుకుంటారు.