Jubilee Hills Temple

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకు పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో మరికొన్ని నెలల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ నాయకుల్లోనూ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఎన్నికల హామీలు అమలు పరచలేక పోవడంతో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో పాటు సహచర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు దూరమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఉపఎన్నిక కీలకం కానుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేని పక్షంలో రేవంత్ రెడ్డి కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టం కాగలదని పార్టీ అధిష్ఠానం భావించే అవకాశం ఉంది. మరోవంక, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా తమ పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ కనిపించడం లేదని బీఆర్ఎస్ నాయకులు గ్రహిస్తున్నారు. మీడియా సమావేశాలకు పరిమితం కావడం మినహా పార్టీ నేతలు ఎవ్వరూ ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. ఇప్పటికే కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని పార్టీ కోల్పోయింది. జూబ్లీహిల్స్‌ను కూడా పోగొట్టుకుంటే తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు బిజెపి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

మంత్రివర్గ విస్తరణలో కీలకమైన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల స్వయంగా పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసమ్మతి వ్యక్తం చేశారు. వారికి సర్దిచెప్పేందుకు ఖర్గే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవంక, కాంగ్రెస్‌లో వర్గాలు రేవంత్ రెడ్డికి ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందిన మాజీ ఎంపీ అజారుద్దీన్ ఇప్పటికే తాను మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను ఉపఎన్నికకు సన్నద్ధం చేసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామిలను ముఖ్యమంత్రి పంపారు. అయితే వారి ముందే ఇక్కడ పార్టీ యెట్లా గెలుస్తుంది? అంటూ నిలదీశారు. మేయర్ విజయలక్ష్మి నియోజకవర్గంలో తిరిగితే వెంటరామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలలో సానుకూలత లేదని తేల్చి చెప్పారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అంతకన్నా బాగాలేదు. సొంత బలానికి తోడు టీడీపీ, జనసేన మద్దతుతో బిజెపి బలంగా మారుతుందన్న భయంతో తెలుగుదేశం మద్దతు కోసం కేటీఆర్ తెరచాటు ప్రయత్నాలు ప్రారంభించారు. 

తెలుగుదేశం పార్టీతో మాగంటి గోపినాథ్ కున్న సంబంధాలను ఆసరా చేసుకొని ఆయన కుటుంబంలోని వారికే ఈ సీట్ ఇస్తామని, తమకు మద్దతు ఇవ్వాలంటూ ఆ పార్టీతో మంతనాలు ప్రారంభించారు. తెలంగాణలో ఇటీవల ఎన్నికలకు దూరంగా ఉంటున్నప్పటికీ నిత్యం తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ కాలం గడుపుతున్న బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఆ పార్టీ సానుభూతిపరులను మచ్చిక చేసుకొని ఏదోవిధంగా జూబ్లీహిల్స్ సీట్ గెలుపొందాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. కేటీఆర్ నేరుగా ఏపీ మంత్రి నారా లోకేష్ తో సంప్రదింపులు ప్రారంభించారని ప్రచారం జరుగుతుంది. మాగంటి గోపినాథ్ మృతి చెందిన సందర్భంగా భార్య బ్రాహ్మణితో కలిసి వెళ్లి, కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించిన సందర్భాన్ని ఆసరాగా తీసుకొని, వారి కుటుంబం నుండే అభ్యర్థిని నిలబెడుతామని, మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్ని ఎత్తుగడలు వేసినా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో సొంతంగా గెలుపొందే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఉప ఎన్నిక తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ఆ రెండు పార్టీలు ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోలేక పోవడం తెలిసిందే. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆ పార్టీకి చెప్పుకోదగిన బలం లేదు. ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండడంతో ఎంఐఎం మద్దతుతో గట్టెక్కాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో నేరుగా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినా కాంగ్రెస్ గెలవలేకపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ – రెండూ అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలమై ఉన్న సమయంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బిజెపికి తెలంగాణలో రాజకీయ భవిష్యత్ తమదే అని నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ఎన్. రామచందర్ రావు కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకోసమే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. పైగా, వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలకు తొలి బలపరీక్షగా ఈ ఉపఎన్నిక మారే అవకాశం ఉంది.

ప్రవీణ్