Kisan Morcha

యూరియా కొరతపై అపోహలు సృష్టిస్తున్న కాంగ్రెస్

Kisan Morchaకేంద్ర ప్రభుత్వం తెలంగాణకు యూరియా పంపిణీ చేయలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. వాస్తవానికి 2024–25 రబీ సీజన్‌ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే, కేంద్రం 12.02 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియాను రాష్ట్రానికి పంపిణీ చేసిందని, అంటే అదనంగా దాదాపు 3 లక్షల టన్నుల యూరియా పంపించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం యూరియా కొరత అంటూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని విమర్శించారు. జూలై 17న హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల ఆత్మహత్యలు వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన “రైతు భరోసా”ను పూర్తిగా అమలు చేయలేదు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.15,000 చొప్పున భరోసా అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తరువాత దానిని రూ.12,000కి తగ్గించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, హడావుడిగా కేవలం రూ.6,000 చొప్పున నిధులు విడుదల చేసింది. అధికారంలోకి వచ్చినప్పుడు 14 పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ బోనస్ చెల్లింపులు ఎక్కడా జరగలేదు. ధరణిని భూభారతిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు ఉపశమనంగా మారాల్సిన ఈ వ్యవస్థను సమస్యల కూపంగా మార్చింది. అనేకమంది రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పారదర్శకత లేకపోవడం, సాంకేతిక లోపాలు రైతుల భూముల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులకు జరుగుతున్న నష్టాలపై కిసాన్ మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలి.

యూపీఏ హయాంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రిపగలు ఫర్టిలైజర్ షాపుల ముందు పడిగాపులు కాసేవారు. చెప్పులు క్యూలైన్లలో పెట్టి మరీ వేచి ఉండేవారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక, బ్లాక్ మార్కెటింగ్‌ను నిర్మూలించేలా నీమ్ కోటెడ్ యూరియాను అన్ని రాష్ట్రాలకు సరిపడేలా పంపిణీ చేస్తోంది. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల కోసం 14 రకాల పంటలకు ఎంఎస్పీ పెంచింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డులు, ఫసల్ బీమా యోజనతో మోదీ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. సాగునీటిని విస్తరించేందుకు ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోంది. కాని రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. గుజరాత్‌లో రైతు ఉద్యమాలే కేంద్రబిందువుగా భారతీయ కిసాన్ సంఘ్ పనిచేసింది. దీని మూలంగా భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. గుజరాత్‌లో బిజెపి గెలుపునకు ఒక మూలస్తంభంగా నిలిచింది. గుజరాత్‌లో పలు సందర్భాల్లో ఈ సంఘం రైతు సమస్యలపై ఉద్యమాలు చేపట్టింది. అందుకే అన్ని మోర్చాల కంటే ఎక్కువ బాధ్యత కిసాన్ మోర్చాదే. అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై, వారి సమస్యలపై ఉద్యమించాలి. ప్రస్తుతం రైతులు బిజెపి వైపు చూస్తున్నారు. బిజెపి కార్యకర్తలు కిసాన్ మోర్చా నాయకత్వంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కష్టపడి పనిచేయాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో విస్తృతంగా తెలియజేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలను బహిర్గతం చేయాలి. రానున్న పంచాయతీరాజ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి.’’ అని అన్నారు.