BC Dharna

స్థానిక సంస్థల రిజర్వేషన్ల నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే

NRR Dharnaబీసీలకు ఇచ్చిన హామీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్టికల్ 243D (6) క్లాజ్‌ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకుండా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ఇచ్చిందని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఆగస్ట్ 2న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బిజెపి మహాధర్నా’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఆడిన కపట నాటకాన్ని ఎండగట్టారు. బీసీ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ ధర్నాలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ ‘‘2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీలకు అనేక హామీలు ఇస్తూ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున ప్రకటనలు చేశారు. కానీ బీసీలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారు. బీసీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా కుట్ర చేస్తున్నారు. బీసీ సంక్షేమం కోసం ప్రతి ఏడాది రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీని పూర్తిగా మరిచిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు బిజెపి బేషరతుగా మద్దతు తెలిపింది. ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. దాదాపు ఐదారు నెలలు గడిచినా ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు, కానీ అందులో కేవలం 32 శాతం మాత్రమే బీసీలకు ఇవ్వాలనుకుంటున్నారు. మిగతా 10 శాతం ముస్లింలకు కేటాయించాలని చూస్తున్నారు. మత రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ పేరిట తేవడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లలో ముస్లింలను తప్పించాలి. 

బీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేసిన పార్టీ బిజెపి. బీసీ కమిషన్‌ను తీసుకొచ్చి, దానికి రాజ్యాంగబద్ధత కల్పించింది కూడా బిజెపియే. కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఐదుగురు ముఖ్యమంత్రులు బీసీలు. 1947 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిగా చేయలేదు. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్‌లకు చైర్మన్లను నియమించగా అందులో కేవలం ఒక్కరే బీసీ కావడం కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ కేబినెట్‌లో కేవలం ముగ్గురు బీసీ మంత్రులే ఉన్నారు. యూపీఏ హయాంలో 2011లో సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, కుల స్థితిగతులపై కులగణన జరిపారు. ఆ గణాంకాలను ఎందుకు బుట్టదాఖలు చేశారు? ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదు? బీసీ రిజర్వేషన్ల విషయమై మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదు? కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 బీసీ రిజర్వ్ డివిజన్లలో 35 డివిజన్లలో ముస్లింలకే కేటాయించి బీసీల హక్కులను కాలరాశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఎంబీసీల సంక్షేమం కోసం పని చేయలేదు. సంచార జాతుల సహా అనేక బీసీ కులాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. బీసీలకు పెద్దపీట వేస్తున్న బిజెపికి బీసీ సమాజం అండగా ఉంది. అందుకే కాంగ్రెస్ బీసీలను భారతీయ జనతా పార్టీ నుంచి దూరం చేయాలనే కుట్ర చేస్తోంది. బండారు దత్తాత్రేయను గరవర్నర్‌ను చేసింది. బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు కేటాయించింది. అనేకమంది బీసీలకు ఇతర పదవులు, హోదా కల్పించింది. మరి కాంగ్రెస్ బీసీలకు ఏ పదవులు ఇచ్చింది? బిజెపిని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. బీసీలకు పెద్దపీట వేసి న్యాయం చేసేది బిజెపియే.’’ అని అన్నారు.

ఇచ్చేది 2 శాతం తక్కువే: కిషన్ రెడ్డి

ఈ ధర్నాలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్​ పేరుతో కాంగ్రెస్​ ఎన్నికల ముందు చెప్పింది, కానీ రెండు సంవత్సరాలు కావొస్తున్నా బీసీల రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించకుండా.. చేతకానితనంతో కేంద్ర ప్రభుత్వంపై బట్టకాల్చి వేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్​ చెబుతున్న 42 శాతం రిజర్వేషన్​ బీసీలకు మేలు చేసే రిజర్వేషన్లు కావు, ముస్లింలకు మేలు చేసేవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్​ అమలైంది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 12 శాతం మత రిజర్వేషన్లు తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని నాటీ సీఎం కేసీఆర్​ శాసనసభలో ప్రకటించారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ 23 శాతానికి తగ్గించిన విషయాన్ని బీసీలు అర్థం చేసుకోవాలి. మీరు 42 శాతం రిజర్వేషన్​ అని ఆడంబరంగా చెబుతున్నారు కానీ.. గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్​ కంటే మీరు ఇస్తున్న రిజర్వేషన్​ 2 శాతం తక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్ని వర్గాల జనాభా పెరిగిందని సర్వేలో చూపెట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వం, బీసీల జనాభా మాత్రం తగ్గించి చూపించారు. కాంగ్రెస్​ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42కు 42 శాతం రిజర్వేషన్​ బీసీలకే ఇవ్వాలి. ఇందులో నుంచి ముస్లింకు ఇస్తామంటే ఊరుకోం. 

స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్​ వాళ్లు జనాభా లెక్కల్లో కులగణన చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్​ ఈ దేశాన్ని అనేక ఏండ్లు పాలించింది. జనాభా లెక్కలు చేసింది తప్పా.. కులగణన వివరాలు తీసుకోలేదు. ఇప్పుడు రాహుల్​ గాంధీ ఎగిరెగిరి పడుతున్నడు. అయ్యా.. రాహుల్​ గాంధీ మీ నాన్న, మీ నానమ్మ, మీ తాత.. మీ కుటుంబం, మీ పార్టీ ఏండ్ల తరబడి అధికారంలో ఉన్నారు కదా.. మరి బీసీల కులగణన ఎందుకు చేయలేదో చెబుతూ పార్లమెంట్​ ముందు నువ్వు ముక్కు నేలకు రాస్తావా? శాస్త్రీయంగా, చట్టబద్ధంగా దేశమంతా కులగణన చేయాలని, మోదీ సర్కారు దేశంలో అన్ని సామాజిక వర్గాల వివరాలను వచ్చే ఏడాది లెక్కించబోతున్నది. నరేంద్ర మోదీ నాయకత్వంలో జనాభా లెక్కల్లో బీసీల కులాగణన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం అటు రాహుల్​ గాంధీ గానీ, కాంగ్రెస్​ గానీ ప్రయత్నించలేదు. సీఎం రేవంత్​ రెడ్డి ప్రధానమంత్రిని కన్వర్టెడ్​ బీసీ అంటున్నాడు. బీసీలో చేరిన సామాజిక వర్గాన్ని కన్వెర్టెడ్​ బీసీ అని ఎలా అంటారు? 1971లో లంబాడీలు ఎస్టీల్లో చేరారు. మరి వాళ్లు కన్వెర్టెడ్​ ఎస్టీలు అవుతారా?’’ అని అన్నారు.

బీసీలకు మంత్రి పదవులేవి?: ఏలేటి

బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘అధికారంలోకి రావడానికి 42% రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు ముస్లింలను బీసీల కోటాలో చేర్చి అన్యాయం చేస్తోంది. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించి పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్‌ను బీసీలకే అమలు చేయాలి. 42% బీసీలు ఉన్న రాష్ట్రంలో వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు మంత్రి పదవులు ఇస్తామన్నారు.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్, ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకి మారుస్తామన్న హామీ, యాదవులకు రెండో దఫా గొర్రెల పంపిణీ, గౌడలకు ప్రకటించిన కార్యక్రమాలు అన్నీ అమలవ్వలేదు. ఈ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయవలసిన అంశాలను కాలయాపన చేస్తూ బిజెపిపై నిందలు వేయడం తగదు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన హామీ యథావిధిగా అమలు కాలేదు. అధికారంలోకి రాగానే ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇప్పుడు బీసీల విషయంలో రాజకీయాలు చేస్తున్నారు.’’ అని అన్నారు.

రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి డ్రామా: ఆర్.కృష్ణయ్య

రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ.. ‘‘రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో డ్రామా చేస్తున్నారు. పైగా కేంద్రం మీద, బిజెపి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్త మీద ఉంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు బీసీలకు అనేక వాగ్దానాలు చేశారు. అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాటలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గ్యారెంటీగా అధికారంలోకి వస్తుంది. అందుకే, దాన్ని అడ్డుకోవడానికి ఏదో ఒక వర్గానికి వ్యతిరేకమన్న ముద్ర వేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థలన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి బీసీలకు న్యాయం చేయడానికి మొత్తం పూర్తి అధికారాలు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నాయి. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు, ఆ తర్వాత గవర్నర్‌ వద్దకు పంపించారు, దిల్లీకి పంపించారు. కానీ ఎక్కడా బిజెపి అడ్డంకి కలిగించలేదు. బీసీలకు 42% వాటా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదు? కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు 60 ఉండగా, కనీసం 20 శాతం కూడా బీసీలకు ఇవ్వలేదు. ఐదుగురు ఇన్ఫర్మేషన్‌ కమిషనర్లను నియమించినా, బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలపై ప్రేమ చూపుతున్నట్లు నటించడం తప్ప, అది నిజమైన ప్రేమ కాదు.’’ అని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో న్యాయం జరగదు: ఈటల

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి పడిపోయినప్పుడు, కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లు చూసింది తప్ప, రిజర్వేషన్లపై న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి అబద్దాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంలో మొసలికన్నీళ్లు కారుస్తున్నారు. 2023 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రైతు, యువ, మహిళా డిక్లరేషన్ల పేరిట 6 గ్యారంటీలు, 66 హామీలు ఇచ్చారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మాట ఏమైంది? బీసీ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సుల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇవ్వకపోగా, గత బీఆర్ఎస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేయలేదు. బీసీ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు, ఎంత మందికి ఇచ్చారో చెప్పలేదు. కల్లుగీత, మత్స్యకార, రజక ఫెడరేషన్లకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకి, ఆపై రూ.6 వేలకి పెంచుతామని చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రతి నెలా ఉద్యోగులకు తొలివారం జీతం పడినట్లే టంచనుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2,500 వేస్తామని హామీ ఇచ్చారు. అమలు కాలేదు. రైతు భరోసా కింద రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పిన హామీలు అమలు కాలేదు. 

బీసీ గణాంకాల కోసం బూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేసినట్టు చెబుతున్నా, ఇది స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ ఆధారంగా నిర్వహించింది. చట్టబద్ధత లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో 70-80 శాతం పైబడి రిజర్వేషన్లు ఉన్నాయి. నిజంగా తెలంగాణలో కూడా చేయాలనుకుంటే.. చట్టబద్ధమైన కమిషన్ వేసి, ఆర్టికల్ 340 ప్రకారం పూర్తిగా డాక్యుమెంటేషన్ చేసి అమలు చేస్తే బిజెపి అడ్డుకోదు. బీఆర్ఎస్ ఉన్నంతవరకు ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ అనేక సంవత్సరాల పాలనలో ఉన్నా ఒక్క రోజు అయినా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించలేదు. కాంగ్రెస్ ఉన్నంతవరకు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు.’’ అని అన్నారు.

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలిDharna Crowd

బిజెపి ఓబీసీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ప్రసంగిస్తూ.. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలకు పూర్తిస్థాయిలో అన్యాయం చేయాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిజెపి మీద నిందను నెట్టాలని కుట్ర పన్నుతోంది. గత 10 సంవత్సరాలుగా పాలన చేసిన బీఆర్ఎస్‌, రెండు సంవత్సరాలుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తీరని ద్రోహం చేశాయి. ఈ పార్టీల కుట్రలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం ఈ ధర్నా నిర్వహించాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేయడానికి ప్రతి కార్యకర్త పనిచేయాలి.’’ అని అన్నారు. ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ప్రసంగిస్తూ.. ‘‘తెలంగాణ రాష్ట్రమొస్తే బీసీలకు న్యాయం జరగుతుందని బీసీలంతా కలలుగన్నరు. 2014 నుంచి 2023 వరకు పాలించిన బీఆర్ఎస్ బీసీలను దగా చేసింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని, బీసీల అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది. అధికారిక పదవుల్లో 42 శాతం పదవుల్లో బీసీలకు కేటాయిస్తామన్నరు. కాంగ్రెస్‌కు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ కేబినెట్‌లో 42 శాతం బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. ముస్లింలు లేని 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలి.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.