SHG

మహిళా బృందాలకు రూ.11 లక్షల కోట్లు దాటిన బ్యాంకు రుణాలు

దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్) సరికొత్త అధ్యాయం. సాంప్రదాయక ఆర్థిక సంస్థల నుంచి మహిళా స్వయం సహాయ బృందాలకు (ఎస్‌హెచ్‌జీస్) రూ.11 లక్షల కోట్లకు పైగా రుణసదుపాయం కల్పించారు. బ్యాంకులు స్వశక్తి బృందాలకు అండగా నిలవడంతోనే ఈ చరిత్రాత్మక విజయం సాధ్యమైంది. అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు అందేట్లు చూడాలని, మహిళలకు సాధికారతను కల్పించడంతో పాటు కింది స్థాయిలో ఆర్థిక పునాదులను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది అద్దం పడుతోంది.

పేద మహిళల భాగస్వామ్యంతో పటిష్ఠమైన సామూహిక సంస్థలను నిర్వహించి, ఆ మహిళల బతుకుతెరువుకు దన్నుగా నిలబడడం ద్వారా గ్రామాలను పేదరిక వలయం నుంచి బయటకు తేవాలన్నదే డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్ ముఖ్యోద్దేశం. ఈ స్వయం సహాయ బృందాలు పల్లెల్లో రుణ పంపిణీకి ప్రధాన మార్గాలుగా మారిపోయాయి. దీంతో అభివృద్ధి ప్రయోజనాలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లడంతో పాటు మహిళల నాయకత్వంలోని వ్యాపార సంస్థలను పెంచి పోషించడానికి వీలవుతోంది. రుణాలను నిలకడైన రీతిలో అందజేస్తుండడం వల్ల పల్లె ప్రాంతాల మహిళల్లో కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలనే ఉత్సాహం పెరుగుతోంది. వారు తమకంటూ ఆదాయాన్ని సంపాదించిపెట్టగల సంస్థలను ధైర్యంగా స్థాపించగలుగుతున్నారు.

అసంఖ్యాక మహిళలు నెలకొల్పిన సంస్థలు జీవనోపాధికి పట్టుగొమ్మలుగా మారాయి. చిత్తశుద్ధితో బ్యాంకులు కీలక భూమిక పోషించనిదే ఈ ప్రక్రియ ఇంతటి విశేష విజయానికి నోచుకొనేదే కాదు. ఈ కీలక మద్దతే ఎస్‌హెచ్‌జీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, అనేక మంది సమష్టి స్వప్నాలను నెరవేర్చి, ఆర్థిక స్వావలంబన దిశగా వారు సాగిస్తున్న ప్రయాణాన్ని వేగవంతం చేసింది. బ్యాంకింగ్ ప్రతినిధులుగా సేవలు అందిస్తున్న ఎస్‌హెచ్‌జీ మహిళా సభ్యులను ‘బ్యాంక్ సఖులు’ అని పిలుస్తున్నారు. ఈ విజయంలో బ్యాంక్ సఖులు సైతం ముఖ్య పాత్ర పోషించారు. వీరు అలుపెరుగక చేస్తున్న కృషి రుణ వితరణతో పాటు రుణాల తిరిగి చెల్లింపులో కూడా కీలకంగా మారుతూ, ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకింగ్ సంస్థలకు మధ్య అనుబంధాన్ని పెంచుతోంది.

‘డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్’, ‘లఖ్‌పతి దీదీ పథకాల’ల వంటి కార్యక్రమాల రూపంలో స్వయంసహాయ బ‌ృందాల ఉద్యమం లక్షల మంది మహిళలకు సాధికారితను కల్పిస్తోంది. రూ.11 లక్షల కోట్ల స్థాయిలో రుణ పంపిణీ, పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలివ్వడం, వడ్డీలో రాయితీ సదుపాయం, ఇంకా ఇతరత్రా ఆర్థిక సహాయం, రుణమొత్తాల తిరిగి చెల్లింపు 98 శాతాని కంటే ఎక్కువగా నమోదు కావడం.. ఈ కార్యక్రమాల ఘనవిజయానికి సంకేతాలు.