మోదీ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం
ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నిర్విరామంగా పని చేస్తున్నారని, ఆ స్ఫూర్తిని మనం అందిపుచ్చుకొని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవాపక్షం’లో భాగంగా అక్టోబర్ 9న బిజెపి ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్ లో సమాజానికి సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, సమాజం కోసం చేసిన విస్తృతమైన కృషిని గుర్తిస్తూ వారికి అవార్డులు అందజేశారు. సమాజానికి నిరంతరం సేవలందిస్తున్న వ్యక్తులను గౌరవించడం ద్వారా ప్రజల్లో సేవాస్ఫూర్తిని మరింత పెంచేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరం విజయం కోసం కష్టపడి పని చేయాలి. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు. ఫెయిల్యూర్స్ ఎదురైనా పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తేనే సక్సెస్ సాధ్యమవుతుంది. సేవాభావంతో పని చేసేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవాపక్షం’ ఉద్దేశ్యం. రాజకీయ నాయకులు కేవలం రాజకీయమే కాకుండా, సేవా దృష్టితో కూడా పని చేయాలి. గతంలో 100 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో ఒక్క మెడల్ కూడా రాలేదనే వార్తలు చూసేవాళ్లం. ఇప్పుడు పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. స్కూల్స్‌లో కూడా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలి. డ్రగ్స్ ఫ్రీ నేషన్‌గా మారాలంటే, చెడు అలవాట్ల బారిన పిల్లలు పడకూడదంటే క్రీడలు ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఇజ్రాయిల్‌లో 18 ఏళ్ల వయసు పూర్తయిన వ్యక్తులు మూడు సంవత్సరాలు మిలటరీలో పని చేస్తేనే యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడానికి అర్హత లభిస్తుంది. దేశాన్ని కాపాడటానికి యువత, మహిళలు, ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఇజ్రాయిల్ ఒక బలమైన దేశంగా నిలిచింది, ఎన్ని యుద్ధాలు జరిగినా సమర్థంగా ఎదుర్కొంది. ఇజ్రాయిల్ చిన్న దేశం, ఒక యువ దేశం, అయినప్పటికీ అది ప్రపంచంలో అత్యంత బలమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఎందుకు? దానికి కారణం జాతీయవాదం. ఆ దేశం కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కారణంగా అభివృద్ధి చెందలేదు, కేవలం జాతీయవాదం వల్లే ఇజ్రాయిల్ అభివృద్ధి చెందింది. అదే తరహాలో మన దగ్గర కూడా దేశ భద్రత, అభివృద్ధి కోసం యువత, మహిళలు, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. నరేంద్ర మోదీకి దీర్ఘాయువుతో దేశాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లే అఖండ శక్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.’’ అని అన్నారు.

